స్టార్‌ క్యాంపెయినర్‌గా మునుగోడు బాధ్యతలు అప్పగిస్తే ఆలోచిస్తా

ABN , First Publish Date - 2022-08-19T07:51:29+05:30 IST

తెలంగాణ పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌గా తనకు మునుగో డు బాధ్యతలు అప్పగిస్తే ఆలోచిస్తానని, పాదయాత్రపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

స్టార్‌ క్యాంపెయినర్‌గా మునుగోడు బాధ్యతలు అప్పగిస్తే ఆలోచిస్తా

పాదయాత్రపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

అమెరికా మాదిరి సిద్దిపేట, సిరిసిల్ల రోడ్లు 

మిగతా ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్నాయి

సిరిసిల్ల, సిద్దిపేటలో 20 వేల ‘డబుల్‌’ ఇళ్లు

మునుగోడులో ఒక్క ఇల్లూ నిర్మించలేదు

దక్షిణ తెలంగాణపై కేసీఆర్‌ది సవతి ప్రేమ


చౌటుప్పల్‌ రూరల్‌, అగస్టు 18: తెలంగాణ పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌గా తనకు మునుగో డు బాధ్యతలు అప్పగిస్తే ఆలోచిస్తానని, పాదయాత్రపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో  ధర్మభిక్షం, సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాలకు గురువారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని తంగడపల్లి రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు.  అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకన్నా అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపా రు. సీఎం ఫామ్‌హౌస్‌ చుట్టూ రూ.600 కోట్లతో మూడు నెలల్లో రోడ్లు వేసిన ప్రభుత్వం.. తంగడపల్లి రోడ్డును పూర్తిచేసేందుకు ఇన్ని నెలలు పడుతుందా? అని ప్రశ్నించారు. సిద్దిపేట, సిరిసిల్లలో రోడ్లు అమెరికా మాదిరిగా అద్దంలా ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. సిరిసిల్ల, సిద్దిపేటలో 20 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించిన ప్రభుత్వం మునుగోడులో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని దుయ్యబట్టారు. పిల్లాయిపల్లి కాల్వ నిర్మాణానికి రూ.350కోట్లు కేటాయిస్తే రూ.54కోట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు కమీషన్‌ రూపంలో తీసుకున్నారని ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో లక్షల కోట్ల ప్రాజెక్టులు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌.. దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని అన్నారు. సీఎం కంటే ఎక్కువగా నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నానని, ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మం త్రి గడ్కరీ హైదరాబాద్‌ సభలో ప్రకటించారని గుర్తుచేశారు. ఎయిమ్స్‌ అభివృద్ధికి రూ.925కోట్లు మంజూరయ్యాయని, పనుల ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించినట్లు తెలిపారు.  


వెంట రాజగోపాల్‌ మద్దతుదారులు

చౌటుప్పల్‌లో పర్యటించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెం ట బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు ఉండడం స్థానికంగా చర్చనీయాశంగా మారింది. వెంకట్‌రెడ్డి వెంట ఉన్న నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారైం ది. వెంకట్‌రెడ్డి పర్యటన గురించి  రాజగోపాల్‌రెడ్డి అనుచరులకు మాత్రమే సమాచారం ఉండటంతో వారే వెంకట్‌రెడ్డి పర్యటనలో పాల్గొనడం విశేషం. 

Updated Date - 2022-08-19T07:51:29+05:30 IST