నాయకుడంటే.. ఇలా కదా ఉండాలి!

ABN , First Publish Date - 2022-05-28T06:50:27+05:30 IST

అభిమాన నటుడు.. ఆరాధ్యదైవం.. తెలుగు సంస్కృతికి నిలువెత్తు రూపం.. తెలుగుజాతి ఆత్మగౌరవ చిహ్నం. మూడక్షరాల తారకమంత్రం.. ఎన్టీయార్‌.

నాయకుడంటే.. ఇలా కదా ఉండాలి!

  • నేటి నుంచీ ఎన్టీయార్‌ శతజయంతి ఉత్సవాలు
  • చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెరిగిపోని నందమూరి ముద్ర


(ఆంధ్రజ్యోతి - తిరుపతి) :  అభిమాన నటుడు.. ఆరాధ్యదైవం.. తెలుగు సంస్కృతికి నిలువెత్తు రూపం.. తెలుగుజాతి ఆత్మగౌరవ చిహ్నం. మూడక్షరాల తారకమంత్రం.. ఎన్టీయార్‌. 1982 దాకా వెండి తెరనూ, ఆ తర్వాత రాజకీయాలనూ శాసించిన సంచలనం.. ఎన్టీయార్‌. 1996లో కన్నుమూసేదాకా తెలుగు ప్రజలకు నిత్యవార్త ఆయన. ఇప్పటికీ తెలుగుజనహృదయాల్లో వెలుగుతున్న దీపం నందమూరి తారకరామారావు. ఆయన జీవించి వుంటే నేడు 99 ఏళ్లు పూర్తి చేసుకుని వందవ సంవత్సరంలోకి అడుగిడివుండేవారు.  ఆయన కనుమరుగై పాతికేళ్లు దాటినా ఆయన జ్ఞాపకాలు సజీవంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కళ్లెదుట కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఆయన చిత్తశుద్ధిని చాటుతున్నాయి. నాయకుడంటే ఇలా కదా ఉండాలని, రాజకీయ విధానాలు వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మరీ మరీ ప్రజల వెన్ను చరిచి చెబుతున్నాయి. 


తిరుపతి నుంచే శ్రీకారం..

  • తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి పట్ల  అనన్యభక్తి విశ్వాసాలు గల ఎన్టీయార్‌, తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో పలు కీలక సందర్భాలకు తిరుపతినే వేదిక చేసుకున్నారు.
  • తెలుగుదేశం పార్టీ స్థాపించాక తొలి రాజకీయ సభ తిరుపతిలోనే నిర్వహించారు.
  •  తొలిసారి ఆయన ఎన్నికలబరిలోకి దిగింది కూడా తిరుపతి నుంచే. 1983లో తిరుపతి నుంచి, గుడివాడ నుంచీ కూడా అసెంబ్లీకి ఆయన పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు. ఆ తర్వాత ఆయన తిరుపతి స్థానానికి రాజీనామా చేశారు. 
  • ఎన్నికలను ఎదుర్కొన్న ప్రతిసారీ ప్రచారాన్ని తిరుపతి నుంచే మొదలు పెట్టారు. 
  • ఎన్టీయార్‌ జీవితంలో వివాదాస్పద ఘట్టంగా పరిణమించిన లక్ష్మీపార్వతితో రెండో పెళ్లి ప్రకటనను సైతం తిరుపతి నుంచే చేశారు.
  • నెరవేరని ఎన్టీయార్‌ కల: తిరుమల, తిరుపతి లను వాటికన్‌ తరహాలో తీర్చి దిద్దాలన్నది.


నందమూరి వరాలు:

దేశంలోనే రెండవ మహిళా విశ్వ విద్యాలయం: ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్టీయార్‌, 1983 ఏప్రిల్‌ 14న తిరుపతిలో శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. అప్పటికి అది దేశంలోనే రెండవ మహిళా విశ్వవిద్యాలయం. 


తిరుమలలో నిత్యాన్నదానం: తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు దేవస్థానం ద్వారా ఉచిత అన్నప్రాసాదాలు అందించాలని ఎన్‌టీఆర్‌ నిర్ణయించారు.  1985 ఏప్రిల్‌ 6న నిత్యాన్నదాన పథకం ప్రారంభించారు. భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ పథకానికి ఇప్పటికే దాతల నుంచీ రూ. వెయ్యి కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఆ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో దేవస్థానం తిరుమల, తిరుపతిలలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు, తిరుపతిలో రోగులకు, పేదలకు ఉచితంగా అన్నప్రసాదాలు అందజేస్తోంది.


వికలాంగుల కోసం బర్డ్‌

జైపూర్‌ తరహాలో తిరుపతిలో కూడా వికలాంగులకు అధునాతన వైద్యసేవలందించాలని ఎన్టీయార్‌ తీసుకున్న నిర్ణయంతో టీటీడీ 1985లో  బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్జరీ, రీసెర్చి అండ్‌ రిహాబిలిటేషన్‌ ఫర్‌ డిసేబుల్డ్‌ పేరిట (బర్డ్‌) వైద్య సంస్థను తిరుపతిలో ప్రారంభించింది. అంచెలంచెలుగా విస్తరించిన బర్డ్‌ ఆసుపత్రి ఇపుడు ఆర్థోపెడిక్‌ విభాగంలో దేశంలోనే పేరుమోసింది.


సూపర్‌ స్పెషాలిటీ వైద్యం కోసం స్విమ్స్‌: టీటీడీ ద్వారా రాయలసీమ జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎన్‌టీఆర్‌ 1986లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరా వైద్య విజ్ఞాన సంస్థకు శంకుస్థాపన చేశారు.  1993లో ప్రారంభమైన ఆ సంస్థ కేవలం మూడేళ్ళలోనే 1995లో యూనివర్శిటీ హోదానందుకుంది. ఇపుడు  నర్సింగ్‌, ఫిజియోథెరపీ కళాశాల, మెడికల్‌ కళాశాలలతో ఏపీలోనే అతిపెద్ద వైద్య సంస్థగా విరాజిల్లుతోంది. 


తమిళనాడుకు స్నేహపూర్వక తెలుగు గంగ: దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు కేంద్రంగా నిలిచిన తమిళ రాజధాని చెన్నై నగరం పట్ల కృతజ్ఞతగానూ, చెన్నైవాసులతో స్నేహం చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఆకాంక్షతోనూ ఎన్‌టీఆర్‌ సీఎం అయిన తొలి ఏడాదే తెలుగు గంగ పథకం ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచీ చెన్నై నగర వాసులకు తాగునీరందించడమే దీని లక్ష్యం. ఈ పథకం జిల్లాలోని తూర్పు మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీటినందిస్తోంది.


హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి: నికర సాగునీటి వనరులు లేక కరువుసీమగా పేరుపడిన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఎన్‌టీఆర్‌ 1985లో రెండు సాగునీటి పథకాలను ప్రవేశపెట్టారు. కృష్ణా నదీ జలాల ఆధారంగా ప్రారంభించిన ఈ పథకాలు హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతిగా పేరు పొందాయి.


భాకరాపేట నుంచీ రూ. 2కే కిలో బియ్యం: దేశంలోనే సంచలనం ఎన్టీయార్‌ మొదలుపెట్టిన రూ.2లు కే కిలో బియ్యం. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో ఈ పఽథకాన్ని ఎన్టీయార్‌ తొలుత ప్రారంభించారు.


పీలేరులో నూనెవిత్తుల కర్మాగారం: ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌కు అనుబంధంగా పీలేరులో శ్రీకృష్ణదేవరాయ సహకార నూనెవిత్తుల కర్మాగారం ఏర్పాటు చేశారు. నిర్వహణాపరమైన లోపాలతో  అది ఆ తర్వాత మూతపడింది.


ఎందరికో రాజకీయ జీవితం

జిల్లాలో ఎందరికో ఎన్టీయార్‌ రాజకీయ జీవితం ప్రసాదించారు. ఎందరినో పదవులతో అందలాలెక్కించారు. వారిలో ఎలాంటి రాజకీయ నేపధ్యం లేని సామాన్యులు కూడా వుండడం గమనార్హం. వారిలో  ఎందరు ఆయనను  ఇప్పటికీ స్మరించుకుంటున్నారో చెప్పలేం. 


తిరుపతి: చింతా మోహన్‌, కత్తుల శ్యామల, ఏ.మోహన్‌

శ్రీకాళహస్తి: సత్రవాడ మునిరామయ్య, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి, పీఆర్‌ మోహన్‌

సత్యవేడు: తలారి మనోహర్‌, సురాజ్‌

నగరి: రాధాకృష్ణ, వి.దొరస్వామిరాజు

పుత్తూరు: గాలి ముద్దుకృష్ణమ నాయుడు

చంద్రగిరి: మేడసాని వెంకట్రమణనాయుడు, నారా రామ్మూర్తినాయుడు

పీలేరు: చల్లా ప్రభాకర్‌రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, జీవీ శ్రీనాధరెడ్డి

వాయల్పాడు: చింతల సురేంద్రరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, తిమ్మాపురం రఘురామిరెడ్డి

మదనపలె: రాటకొండ నారాయణరెడ్డి, రాటకొండ సాగర్‌రెడ్డి, ఎస్‌.పి.రాధాకృష్ణ, దొమ్మలపాటి రమేష్‌

తంబళ్ళపలె: ఏవీ ఉమాశంకర్‌రెడ్డి, ఏవీ లక్ష్మిదేవమ్మ

పుంగనూరు: బగ్గిడి గోపాల్‌, కెళవాతి రామకృష్ణారెడ్డి, బషీర్‌, వాహిదున్నీసా, హైదర్‌

పలమనేరు: పట్నం సుబ్బయ్య.

కుప్పం: రంగస్వామినాయుడు

చిత్తూరు: ఎన్‌.పి.ఝాన్సీలక్ష్మి, దొరబాబు, హరిప్రసాద్‌, ఏఎస్‌ మనోహర్‌

వేపంజేరి: తలారి రుద్రయ్య, ఆర్‌.గాంధీ, 

సూళ్ళూరుపేట: సట్టి ప్రకాశం, మదనంబేటి మణెయ్య , పరసా రత్నం

వెంకటగిరి: స్వంతంత్రానంతరం రాజకీయాలకు దూరంగా వున్న వెంకటగిరి రాజా కుటుంబం ఎన్టీయార్‌ చొరవతో రాజకీయాల్లోకి వచ్చింది. ఆ కుటుంబం నుంచీ తండ్రీకొడుకులు వీవీఆర్‌కే యాచేంద్ర, సాయికృష్ణ యాచేంద్ర ఇవురురికీ ఎన్టీయార్‌ టీడీపీ టికెట్లు కేటాయించి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేందుకు కారకులయ్యారు. 

 


అన్న కోసం 8 మంది ప్రాణత్యాగం

నటుడిగానే కాదు, నాయకుడిగా కూడా ఎన్టీయార్‌ అంటే ప్రాణాలిచ్చేంత పిచ్చి అభిమానం ప్రజల్లో ఉండేది. 1984 ఆగస్టు సంక్షోభంలో ఆయన పదవీచ్యుతుడయ్యాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడికక్కడ జనం రోడ్లపైకి వచ్చారు. పాఠశాలలు, దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయించారు. బస్సులు తగులబెట్టారు. కల్వర్టులు, బ్రిడ్జిలు కూల్చివేశారు. మదనపల్లె మండలం సీటీఎం గ్రామంలోని స్పిన్నింగ్‌ మిల్లు కార్మికులు భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. ఏకంగా పోలీసు వాహనాలనే తగులబెట్టారు. డీఎస్పీ వాహనంపై దాడి చేసి దాన్ని కూడా కాల్చివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎనిమిదిమంది కార్మికులు మరణించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్టీయార్‌ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెనుదీయని అభిమానులున్నారన్న వైనాన్ని ప్రపంచానికి చాటింది.

Updated Date - 2022-05-28T06:50:27+05:30 IST