ముంబై: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చిక్కిన బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరో 14 రోజులపాటు జైలులోనే గడపనున్నాడు. అతడు పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో ఆర్యన్‌ను ముంబై ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. అక్కడ 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నాడు.
ఆర్యన్‌తోపాటు మరో మరో ఐదుగురు నిందితులకు జైలులోని బ్యారక్ నంబర్ 1ను కేటాయించారు. జైలులోని మొదటి అంతస్తులో ఉన్న ఇది ప్రత్యేక క్వారంటైన్ బ్యారక్. ఆర్యన్ అక్కడ ఐదు రోజులపాటు క్వారంటైన్లో గడనున్నాడు.
ఆర్యన్‌ఖాన్, ఇతర నిందితులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. అలాగే వారికి వ్యాక్సినేషన్ కూడా పూర్తయింది. ఆర్యన్‌ను కూడా జైలులోని ఇతర ఖైదీలలానే పరిగణిస్తారు. వేకువ జామున 6 గంటలకు నిద్రలేవాల్సి ఉంటుంది. ఏడుగంటలకు అల్పాహారం అందిస్తారు. 11 గంటలకు మధ్యాహ్న భోజనం, సాయంత్రం ఆరు గంటలకు రాత్రి భోజనం అందిస్తారు.
అల్పాహారంలో సాధారణంగా షీరా-పోహా ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో చపాతి, కూర, పప్పు, అన్నం వడ్డిస్తారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఆర్యన్‌కు ఇంటి భోజనం అందే వీలులేదు. అయితే, జైలులోని క్యాంటీన్ నుంచి డబ్బులు చెల్లించి ఆహార పదార్థాలు కొనుక్కునేందుకు అనుమతిస్తారు.