ఆరోగ్య కారణాలతో 5 నిమిషాల్లో వెళ్లిపోయిన ఆర్యన్
ABN , First Publish Date - 2021-11-12T22:57:56+05:30 IST
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బెయిలుపై ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ..
ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బెయిలుపై ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారంనాడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కార్యాలయం ముందు హాజరయ్యాడు. అయితే ఆరోగ్య కారణాలతో కేవలం 5 నిమిషాల్లోనే కార్యాలయం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఆర్యన్ తన న్యాయవాదితో కలిసి మధ్యాహ్నం 1.45 గంటలకు ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చాడు. నేరుగా మూడో అంతస్తులోని అధికారులకు వద్దకు వెళ్లి బెయిల్ షరతలకు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తి చేశారు. 1.50 గంటల కల్లా తిరిగి కార్యాలయాన్ని విడిచిపెట్టాడు. ఆర్యన్ స్టేట్‌మెంట్‌ను ఎన్‌సీబీ సిట్ అధికారులు రికార్డు చేయాలని అనుకున్నప్పటికీ, ఆరోగ్య కారణాలను వివరిస్తూ మరికొంత సమయం కావాలని ఆర్యన్ తరఫు లాయర్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.
కాగా, ఇటీవలే బెయిల్ పొందిన ఆర్యన్‌ను ప్రశ్నించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సమన్లు పంపింది. అయితే తనకు జ్వరంగా ఉందంటూ సిట్ ముందు ఆయన హాజరుకాలేదు. అక్టోబర్ 29న ముంబై హైకోర్టు బెయిల్ షరతుల్లో భాగంగా ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ అధికారుల ముందు ఆయన హాజరుకావాల్సి ఉంది. తన పాస్‌పోర్ట్‌ను కూడా ఆర్యన్ సరెండర్ చేశాడు. బెయిల్ తర్వాత ఎన్‌బీసీ కార్యాలయానికి ఆర్యన్ హాజరైన రెండో శుక్రవారం ఇది.