ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరణ

ABN , First Publish Date - 2021-10-11T21:07:22+05:30 IST

క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్‌సీబీ అరెస్టు చేసిన బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ ..

ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరణ

ముంబై: క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్‌సీబీ అరెస్టు చేసిన బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ మరో రెండు రోజులు ఆర్ధర్ రోడ్డు జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఆయన బెయిలు దరఖాస్తుపై విచారణను సెషన్స్ కోర్టు ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి తమ స్పందన తెలియజేసేందుకు వారం రోజులు వ్యవధి ఇవ్వాలని కోర్టును ఎన్‌సీబీ కోరడంతో విచారణను వచ్చే బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.


ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ను ఎన్‌సీబీ గుర్తించలేదని, ఆయన కస్టడీలో ఉంచడం సరికాదని ఆర్యన్ తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే, అమిత్ దేశాయ్ తమ వాదన వినిపించారు. ఎన్‌సీబీ మరింత గడువు కోరడం సరికాదని అన్నారు. ఆర్యన్‌ వద్ద ఏమీ పట్టుబడనప్పటికీ 7 రోజులు ఆయన కస్టడీలో ఉంచారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి ఎన్‌సీబీ తరఫున హాజరైన స్పెషల్  పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏఎం ఛిమాల్కర్ తన వాదన వినిపిస్తూ, సహజంగా సమాధానం ఇచ్చేందుకు ఎన్‌సీబీ వారం రోజుల వ్యవధి తీసుకుంటుందని, ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున వారం రోజుల గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. కనీసం రెండు, మూడు రోజుల వ్యవధి అయినా ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.


క్రూయిజ్ షి‌ప్‌పై ఆకస్మిక దాడి అనంతరం అక్టోబర్ 2న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టేన్సెస్‌ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు నమోదు చేసింది. దీంతో అక్టోబర్ 4 వరకూ ఎన్‌సీబీ కస్టడీకి ఆర్యన్‌ను రిమాండ్ చేశారు. ఆ తర్వాత కస్టడీకి 7వ తేదీ వరకూ పొడిగించారు. అక్టోబర్ 8న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు ఇచ్చారు. ఆర్యన్ బెయిల్ దరఖాస్తును అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఎం నెర్లికర్ తోసిపుచ్చారు.

Updated Date - 2021-10-11T21:07:22+05:30 IST