బ్రేకింగ్ న్యూస్: షారూఖ్ ఫ్యాన్స్‌లో మరింత టెన్షన్.. Aryan Khan బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ తరపు లాయర్లు వాదనలు వినిపించిన తర్వాత ఎన్సీబీ తరపున లాయర్ వాదనలు వినిపించబోయారు. ఈలోపే ఈ పిటిషన్లను గురువారం వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో అటు షారూఖ్ కుటుంబానికి, అభిమానులకు, ఆర్యన్ ఖాన్‌కు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటికే మేజిస్ట్రేట్ కోర్టులో, ప్రత్యేక కోర్టులో బెయిల్ తిరస్కరణకు గురవడంతో.. ఈ సారి హైకోర్టులో తప్పనిసరిగా బెయిల్ వస్తుందన్న ఆశతో షారూఖ్ కుటుంబం ఉంది. 

హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అసలు ఆర్యన్ ఖాన్ వద్ద మాదకద్రవ్యాలు లేవనీ, కానీ సెలబ్రెటీ కావడంతోనే ఇరికించారని ముకుల్ చెప్పుకొచ్చారు. ఎన్సీబీ అధికారులు చూపుతున్న వాట్సప్ చాటింగులు అన్నీ ఆరు నెలల క్రితం నాటివనీ.. వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు బెయిల్ ను అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్యన్ స్నేహితుడి వద్ద అతితక్కువ మోతాదులోనే మాదకద్రవ్యాలు దొరికాయన్నారు. నేరం రుజువు అయితే గరిష్టంగా ఇలాంటి కేసుల్లో ఒక్క ఏడాది మాత్రమే శిక్ష పడుతుందనీ.. అలాంటి చిన్న కేసులోనే తాము బెయిల్‌ను అడుగుతున్నామని ముకుల్ రోహత్గీ వాదించారు. ఆయన తర్వాత అర్బాజ్ మర్చంట్ తరపున అమిత్ దేశాయ్ హైకోర్టులో వాదించారు. 

పార్టీ జరుగుతున్న రోజు కూడా వాళ్లిద్దరూ విడివిడిగానే వచ్చారని అమిత్ దేశాయ్ గుర్తు చేశారు. ‘నా క్లయింట్‌ను అక్రమంగానే అరెస్ట్ చేశారు. అతి తక్కువ మోతాదులో మాదకద్రవ్యాలు దొరికితే అరెస్ట్‌కు మినహాయింపు ఉంది. నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు అవమని కోరవచ్చు. కానీ అదేం చేయలేదు. అక్రమంగా అరెస్ట్ చేశారు.’ అంటూ గతంలో ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ తీర్పును అమిత్ దేశాయ్ చదివి వినిపించారు. అరెస్ట్ మెమోలో డ్రగ్స్ తీసుకున్నారు అని ఉంది తప్పితే.. తన క్లయింట్‌పై ఇతర కేసులు ఏమీ లేవని అమిత్ దేశాయ్ చెప్పుకొచ్చారు. నిందితుల తరపున వాదనలు విన్న హైకోర్టు.. ఈ పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Advertisement

Bollywoodమరిన్ని...