Oct 14 2021 @ 15:39PM

Aryan Khan కు బెయిల్ ఇవ్వొద్దు.. అదే జరిగితే ఏడాది జైలు ఖాయం.. ప్రత్యేక కోర్టులో NCB తరపు లాయర్ వాదనలివీ..!

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ వస్తుందా..? లేదా..? అన్న విషయంపై అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు దొరకకపోయినా అక్రమ రవాణా వ్యవహారంపై ఆయనకు సంబంధించిన ఆధారాలు లభించాయన్నది ఎన్సీబీ వాదన. ఈ బెయిల్ పిటిషన్ పై బుధవారం జరిగిన వాదనలకు కొనసాగింపుగా గురువారం అడిషనల్ సోలిసిటర్ జనరల్ తన వాదనలను వినిపించారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ అస్సలు ఇవ్వొద్దని కోర్టును కోరారు.

‘ఈ కేసులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి. వారితో ఆర్యన్ ఖాన్ ఫోన్ సంభాషణలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు విచారణను వేగవంతం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వస్తే ఆధారాలను ధ్వంసం చేస్తారు. వాట్సప్ చాటింగ్‌లో ఉన్న ఆధారాలను బట్టి ఆర్యన్ ఖాన్ ఇప్పుడే కొత్తగా డ్రగ్స్ తీసుకోవడం లేదు. ఎప్పటినుంచో కొన్నేళ్లుగా వాడుతున్నాడు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరికాయా..? లేదా..? అన్నది ముఖ్యం కాదు. డ్రగ్స్ వ్యవహారంలో అతడి పాత్ర ఎంత ఉందన్నదే ముఖ్యం. గతంలో కేరళలో కేసులోనూ ఓ వ్యక్తి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోయినా అతడికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడింది. ఒకవేళ డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్టు రుజువు అయితే వాళ్లతోపాటు ఆర్యన్ ఖాన్‌కు కూడా ఏడాదిపాటు జైలు శిక్ష పడుతుంది.’ అంటూ అడిషనల్ సోలిసిటర్ జనరల్ తన వాదనలను వినిపించారు. దీంతో ఈ బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న ఉత్కంఠ షారూఖ్ అభిమానుల్లో నెలకొంది. 

Bollywoodమరిన్ని...