దివ్యాంగుల కోసం ఈ దివ్యాంగ బాలిక ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2021-10-30T23:38:08+05:30 IST

17 ఏళ్ల ఆర్య రాజ్ మంగళవారం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఆప్టిట్యూడ్

దివ్యాంగుల కోసం ఈ దివ్యాంగ బాలిక ఏం చేసిందంటే...

కోజికోడ్: 17 ఏళ్ల ఆర్య రాజ్ మంగళవారం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఆప్టిట్యూడ్ టెస్ట్ పాసైంది. 80 శాతం సెరెబ్రల్ ప్లాసీ (మస్తిష్క పక్షవాతం)తో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైన ఆర్య.. తనలాంటి దివ్యాంగులు ఎందరికో మేలు చేసే పనిచేసి ప్రశంసలు అందుకుంది. సెప్టెంబరు 17న రాసిన యోగ్యతా పరీక్షలో జాతీయ స్థాయిలో (వైకల్యం కలిగిన వ్యక్తుల కేటగిరీ-పీడబ్ల్యూడీ)లో ఐదో ర్యాంకు సాధించి తిరువనంతపురం ఐఐఎస్‌ఈఆర్‌లో అడ్మిషన్ సంపాదించింది. అంతేకాదు, దివ్యాంగుల ఫ్రెండ్లీ వ్యవస్థ కోసం అవసరమై ‘దిద్దుబాటు’ చర్యలకు మార్గాన్ని సుగమం చేసింది.


పరీక్ష రాయడానికి ముందు ఆర్య జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) ఎదుట రెండు డిమాండ్లు ఉంచింది. అందులో ఒకటి తన విద్యార్హతకు సమానమైన అర్హత ఉన్న వ్యక్తిని తనకు బదులుగా పరీక్ష రాసేందుకు (స్క్రైబ్) అనుమతించడం. రెండోది అదనపు సమయం. ఈ రెండూ తనకు ఇవ్వాలని అభ్యర్థించింది.


ఆర్య లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించిన డీఎల్ఎస్ఏ.. ఆప్టిట్యూట్ టెస్ట్ 2021 నిర్వహించిన ఐఐఎస్ఈఆర్‌ కోల్‌కతాకు లేఖ రాసింది. ఈ డిమాండ్లను పరిశీలించేందుకు వరుసగా మూడు రోజులపాటు ఆన్‌లైన్ అదాలత్ నిర్వహించిన ఐఐఎస్‌ఈఆర్ నిబంధనలను సవరించేందుకు సంశయించింది. అయితే,  చివరి రోజు మాత్రం ఆర్య రాజ్ డిమాండ్లకు అంగీకారం తెలిపింది. 


నిజానికి ఆప్టిట్యూట్ పరీక్ష రాసే వ్యక్తికి కింది తరగతి వాళ్లనే స్క్రైబ్‌గా అనుమతిస్తారు. అయితే, అలాంటి వారు ఆర్య రాజ్ చెప్పే దానిని సరిగ్గా అర్ధం చేసుకుని పేపర్‌పై పెట్టే అవకాశం లేదు. దీంతో ఆమె తనకు సమానమైన విద్యార్హత కలిగిన వ్యక్తిని స్క్రైబ్‌గా కావాలని కోరింది. ఐఐఎస్‌ఈఆర్ ఇందుకు అనుమతించడంతో తన స్కూల్‌మేట్, ప్లస్ టు విద్యార్థిని అయిన హిబాను ఆర్య తనకు స్క్రైబ్‌గా ఎంచుకుంది. అలాగే, ఆర్య డిమాండ్‌ను పరిశీలించిన ఐఐఎస్‌ఈఆర్ అదనంగా అరగంట సమయాన్ని కేటాయించింది. అంతేకాదు, ఆర్య రాజ్‌ కోసం ఐఐఎస్‌ఈఆర్ చేసిన సవరణలన్నీ పీడబ్ల్యూడీ విద్యార్థులందరికీ అందుబాటులోకి వస్తాయి.  


ఆర్య తిరుగులేని ట్రాక్ రికార్డు కూడా నిబంధనల సవరణకు కారణమైంది. ఈ ఏడాది జరిగిన ప్లస్ 2 పరీక్షల్లో ఆర్య మొత్తం 1200 మార్కులు సాధించింది. కేరళలో ఎల్ఎస్ఎస్, యూఎస్ఎస్ స్కాలర్‌షిప్ రెండూ అందుకున్న ఏకైక సెరెబ్రల్ ప్లాసీ విద్యార్థిని ఆర్య కావడం గమనార్హం.


జేఈఈ పరీక్ష (పీడబ్ల్యూడీ కేటగిరి)లో జాతీయ స్థాయిలో ఆర్య 44వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఫలితంగా ఆమెకు నిట్‌లో సులభంగా సీటు లభించింది. ఆస్ట్రోబయాలజీలో పరిశోధన ఆమె కల. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తన కుమార్తె రోల్ మోడల్ అని ఆర్య తండ్రి రాజీవ్ కె పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆర్య యూనిసెఫ్ చైల్డ్ చీవర్ అవార్డు గెలుచుకుంది. 

Updated Date - 2021-10-30T23:38:08+05:30 IST