చెత్త సేకరించే వ్యక్తి కుమారునికి నీట్‌లో 620 మార్కులు... గ్రామంలో సంబరాలు!

ABN , First Publish Date - 2020-10-24T12:45:17+05:30 IST

ఏదైనా సాధించాలని గట్టిగా పట్టుపట్టి, అందుకు తగిన విధంగా కృషిచేసేవారికి అసాధ్యమంటూ ఏమీ ఉండదని అరవింద్...

చెత్త సేకరించే వ్యక్తి కుమారునికి నీట్‌లో 620 మార్కులు... గ్రామంలో సంబరాలు!

కోటా(రాజస్థాన్): ఏదైనా సాధించాలని గట్టిగా పట్టుపట్టి, అందుకు తగిన విధంగా కృషిచేసేవారికి అసాధ్యమంటూ ఏమీ ఉండదని అరవింద్ అనే విద్యార్థి నిరూపించాడు. చెత్త సేకరించి కుటుంబాన్ని పోషించే తన తండ్రికి గ్రామంలో మంచిపేరు తీసుకువచ్చాడు. డాక్టర్ కావాలన్న కలను సాకారం చేసుకుని కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాడు. 



నీట్-2020లో అరవింద్ 620 మార్కులు సాధించాడు. ఆల్ ఇండియాలో 11602, ఓబీసీ కేటగిరీలో 4,392వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ పరిధిలో గల బర్డీ గ్రామానికి చెందిన అరవింద్ తండ్రి భిఖారీ కుమార్ చెత్త సేకరించే పని చేస్తుంటాడు. రిక్షాతో వీధుల్లో తిరుగుతూ ఇళ్లలోని పాత సామాను కొనుగోలు చేస్తుంటాడు. అరవింద్ తల్లిదండ్రులు తమ కుమారుడు డాక్టర్ కావాలని కలలుగనేవారు. ఇందుకోసం కుమారుడిని ఒక కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు. తొలిప్రయత్నింలో అరవింద్‌కు మంచి ర్యాంక్ రాలేదు. రెండవ ప్రయత్నంలో ఉన్నత ర్యాంకు సాధించాడు. గోరఖ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే సమయంలో 8 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కేవాడు. 10వ తరగతిలో 48శాతం, 12 వ తరగతిలో 60 శాతం మార్కులు సంపాదించాడు. బొటాబొటీ మార్కులతో చదువులు గట్టెక్కుతున్నప్పటికీ డాక్టర్ కావాలన్న బలమైన పట్టుదలతో నీట్ పరీక్షకు సిద్ధమై మంచి ర్యాంకు సాధించాడు. ఈ సందర్బంగా అరవింద్ మాట్లాడుతూ తమ గ్రామంలో తానే మొదటి డాక్టర్‌ను అని, ఎంబీబీఎస్ పూర్తి చేశాక ఆర్థోపెడిక్ సర్జన్ కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. 

Updated Date - 2020-10-24T12:45:17+05:30 IST