న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధానిగా చూడటం ఖాయమని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ కో ఇంఛార్జ్ రాఘవ్ చద్దా జోస్యం చెప్పారు. కోట్లాది మంది ప్రజలకు కేజ్రీవాల్ ప్రస్తుతం ఆశాజ్యోతిగా మారారని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే, ప్రజలు అవకాశమిస్తే అతి త్వరలోనే కేజ్రీవాల్‌ను ప్రధానిగా చూడగలమన్నారు. గురువారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో చద్దా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటంతో చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని, ఆమ్ ఆద్మీ పార్టీ అంత కంటే తక్కువ సమయంలోనే రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని చద్దా చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేస్తుందని చద్దా చెప్పారు.
Arvind Kejriwal Raghav Chadha Prime Minister