Abn logo
Sep 21 2021 @ 15:11PM

ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్: కేజ్రీవాల్

పనజి: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ మోడల్‌ను బీజేపీ కాపీ చేస్తోందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉచిత నీరు, నేరుగా ఇంటి వద్దకే సేవలు వంటి వాగ్దానాలు తమ నుంచి కాపీ చేసినవేనని అన్నారు. గోవా ప్రజలు ఒరిజనల్‌కు (ఆప్( ఓటేవేయాలని, డ్యూప్లికేట్‌కు (బీజేపీకి) ఓటు వేయవద్దని కోరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కేజ్రీవాల్ మంగళవారంనాడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోవా ప్రజలకు తాము 7 హామీలు ఇస్తున్నామని చెప్పారు.

ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశ్రిత పక్షపాతం లేకుండా గోవా ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పిస్తామని, కుటుంబంలో ఎవరో ఒకరికి ఉపాధి లభించేంత వరకూ నెలకు రూ.3,000 ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కోవిడ్ కారణంగా టూరిజం రంగంలో ఉద్యోగం కోల్పోయిన వారికి నెలకు రూ.5,000 ఇస్తామని, గనులపై నిషేధం కారణంగా బాధితులైన వారికి ప్రతినెలా రూ.5,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.

డిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నీరు, డోర్ స్టెప్ సర్వీస్ స్కీములను గోవా సీఎం ప్రమోద్ సావంత్ కాపీ కొట్టారని కేజ్రీవాల్ ఆరోపించారు. ''ఒరిజనల్ ఉండగా డ్యూప్లికేట్‌కు (బీజేపీ) ఓటు వేయడం ఎందుకు?'' అని ప్రశ్నించారు. హామీలు నెరవర్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రజలు తనను తరచు అడుగుతుంటారని, ఢిల్లీలోనూ ఇలాగే తనను అడిగారని, అయితే అవినీతికి చరమగీతం పాడుతూ అన్ని వాగ్దానాలను తాము అమలు చేశామని కేజ్రీవాల్ చెప్పారు.