చిలీలో అరుణోదయం

ABN , First Publish Date - 2021-12-21T06:30:30+05:30 IST

చిలీ అధ్యక్షుడుగా ముపైఐదేళ్ళ గాబ్రియేల్ బోరిక్ ఘన విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష అభిమానుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. అలనాటి అలండీ తాత్వికత ప్రజల్లో సజీవంగా ఉన్నదనీ...

చిలీలో అరుణోదయం

చిలీ అధ్యక్షుడుగా ముపైఐదేళ్ళ గాబ్రియేల్ బోరిక్ ఘన విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష అభిమానుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. అలనాటి అలండీ తాత్వికత ప్రజల్లో సజీవంగా ఉన్నదనీ, సామ్రాజ్యవాదులకు ఈ ఫలితాలు చెంపపెట్టని వారు సంతోషిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో అంతో ఇంతో స్థిరంగా, సంపన్నంగా ఉన్నప్పటికీ కొన్నేళ్ళుగా నిరసనలతో నలుగుతున్నందున చిలీ అధ్యక్ష ఎన్నికలూ ఫలితాలూ ప్రపంచాన్ని ఆకర్షించాయి. మితవాద ప్రత్యర్థి జోస్ ఆంటోనియా మీద గెలిచిన ఈ వామపక్ష నేత మద్దతుదారులంతా యువతరమే. యువ ఓటర్లే నిర్ణయాత్మకశక్తిగా నిలిచి చిలీ చరిత్రలోనే అతిపిన్న వయస్కుడిని అధ్యక్షస్థానంలో కూచోబెట్టారు.


లాటిన్ అమెరికా దేశాల్లో పారిశ్రామికంగా మెరుగ్గా ఉన్న చిలీలో అధికశాతం ప్రజలకు మేలు చేసే హామీలను బోరిక్ ఇచ్చాడు. కార్మికులకు, సాధారణ ప్రజలకు పెన్షన్, ఆరోగ్య రంగాన్ని ప్రక్షాళించడం, పనిగంటలను తగ్గించడం, పౌరహక్కుల పరరక్షణ, పర్యావరణానుకూల పెట్టుబడులు ఇత్యాది హామీలను జనం విశ్వసించారు. సహజవనరులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నప్పటికీ తీవ్ర అసమానతలు, అవినీతితో  చిలీ నలిగిపోతున్నది. ప్రజలు కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇటీవలివరకూ ప్రజాందోళనలకు నేతృత్వం వహించిన బోరిక్ అధ్యక్షస్థానంలోకి వచ్చాడు. ఫలితాలు వెలువడుతుండగానే రాజధాని శాంటియాగోలో వేలాదిమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆనందాన్ని పంచుకోవడం బోరిక్ ప్రజాదరణకు నిదర్శనం. 


నిజానికి ఇది ఆశ్చర్యకరమైన పరిణామమేమీ కాదు. ఆర్నెల్లక్రితం రాజ్యాంగ రచనాపరిషత్ కోసం జరిగిన ఎన్నికల్లో దేశప్రజలు మితవాదులకు చోటివ్వలేదు. పరిషత్తుతో పాటు, గవర్నర్లు, మేయర్లు, కౌన్సిల్ సభ్యుల ఎంపికలో సైతం వారు కొత్త రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నారో ముందే స్పష్టంచేశారు. నియంత ఆగస్టో పినోచెట్ కాలంలో తయారైన పెట్టుబడిదారీ అనుకూల రాజ్యాంగం స్థానంలో పేదల పక్షపాతిగా ఉండే సంవిధానం కావాలని వారు కోరుకోవడంతో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడినవారితో కొత్త రాజ్యాంగ సభ నిండిపోయింది. దశాబ్దాలుగా అమలులో సరళీకృత ఆర్థికవిధానాలతో విద్య, వైద్యం ఖరీదై, నిరుద్యోగం, అసమానతలు హెచ్చి, సామాజిక భద్రత కరువైన స్థితిలో 2018నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు ఆరంభించారు. మరుసటి ఏటాది మెట్రోచార్జీల పెరుగుదలపై ఊపందుకున్న నిరసన పలు రంగాలకు, వర్గాలకు విస్తరించింది. సమూలమైన ప్రక్షాళనతో తప్ప తాము  అనుభవిస్తున్న పరిస్థితులు మారవని వారు గుర్తించారు. శ్రామికులను దోచుకొని, కార్పొరేట్ కంపెనీలకు విపరీతంగా లాభాలు సమకూర్చి పెట్టే పినోచెట్, ఆయన వారసుల ఆలోచనలనూ, పాలనావిధానాలను తుడిచిపెట్టేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ విధంగా లక్షాలాదిమంది ఉద్యమించి, సాధించిన కొత్త రాజ్యాంగ సభ అన్ని వర్గాల, జాతుల సముచిత ప్రాతినిధ్యంతో ఏర్పడింది. ఏడాదికాలంలో రాజ్యాంగ రచన పూర్తయి, తిరిగి ప్రజామోదాన్ని పొంది, అంతిమంగా అమలవుతుంది. ఏవో ఉపరితల విన్యాసాలు కాక, రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థల సమూలమైన మరమ్మతును సంకల్పించిన చిలీ ప్రస్తుతం ఒక పరివర్తన కాలంలో ఉంది. ఈ దశలో బోరిక్ ఎన్నిక ప్రజలు తీసుకున్న చక్కని నిర్ణయమని చెప్పక తప్పదు. ఐదుదశాబ్దాల క్రితం సోషలిస్టు అధ్యక్షుడు సాల్వడార్ అలెండీ చిలీలో చేపట్టిన విధానాలు మొత్తం లాటిన్ అమెరికాని ప్రభావితం చేసి పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాలను సృష్టిస్తాయని భయపడింది అమెరికా. నియంత పినోచెట్‌ను అడ్డంపెట్టుకొని అలెండీ హత్యసహా అక్కడ అది సృష్టించిన విధ్వంసం తెలియనిదేమీ కాదు. 18 సంవత్సరాల పినోచెట్ నియంతృత్వపాలనలో చిలీ అల్లాడిపోయింది. అనంతరం ఎవరు అధికారంలో ఉన్నా అవే విధానాలతో శతకోటీశ్వరులను సృష్టిస్తూ, అసమానతలను పెంచారు. విద్యార్థినేతనుంచి దేశాధినేతగా ఎదిగిన బోరిక్ ఏలుబడిలో చిలీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, వారి జీవితాలు మెరుగుపడతాయని ఆశించాలి.


Updated Date - 2021-12-21T06:30:30+05:30 IST