Apr 15 2021 @ 20:12PM

హిట్‌ కాంబినేషన్‌లో ‘బార్డర్‌’

కోలీవుడ్‌: సాధారణంగా ఒక చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత అదే కాంబినేషన్‌లో వచ్చే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. హీరో అరుణ్‌ విజయ్‌, దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్‌లో గతంలో ‘కుట్రం 23’ పేరుతో వచ్చిన చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో రానున్న చిత్రానికి ‘బార్డర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను తమిళ ఉగాది రోజున విడుదల చేశారు. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత విజయ రాఘవేంద్ర భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం చెన్నై, ఢిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇందులో హీరో అరుణ్‌ విజయ్‌తో పాటు రెజీనా, స్టెఫీ పటేల్‌, భగవతి పెరుమాళ్‌ తదితరులు నటించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు అరివళగన్‌ మాట్లాడుతూ..‘కుట్రం 23’ చిత్రం తర్వాత అరుణ్‌ విజయ్‌తో కలిసి పనిచేస్తున్నాను. ‘కుట్రం 23’ మూవీ ఒక మెడికల్‌ క్రైం థ్రిల్లర్‌ అయితే, ‘బార్డర్‌’ మూవీ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రాన్ని పూర్తిస్థాయిలో ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కించాను. నేను దర్శకత్వం వహించిన గత చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా స్పై చిత్రం అనగానే దేశభక్తి, ఉగ్రవాదం అనే అంశాలు ఉంటాయని భావిస్తారు. ఈ చిత్రంలో దేశభక్తిని విభిన్న కోణాల్లో చెప్పడం జరిగింది. ఇందులో హీరోయిన్‌ స్పై పాత్రను పోషిస్తుంది. స్టెఫీ పటేల్‌ పాత్ర కూడా కీలకంగా వుంటుంది. కథకు అవసరమైన చోట ఒక థీమ్‌ సాంగ్‌, ఒక ప్రేమ గీతం ఉన్నాయి. ఈ కథ ఉత్తర భారత రాష్ట్రాల్లో కొనసాగుతుందని అందుకే ఢిల్లీ, ఆగ్రాల్లో షూటింగ్‌ జరిపాం.. అని తెలిపారు.