కళాకారుల నోట.. వలస పాట!

ABN , First Publish Date - 2022-01-23T06:43:28+05:30 IST

‘కళ’.. నిజంగానే కళ తప్పుతోంది! ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పల్లెల్లో రోజుల తరబడి నాటకాలు వేస్తూ.. వీధివీధిన తిరిగి పాటలు పాడుతూ.. జనాన్ని రంజింపజేసిన కళాకారులు నేటి ఆధునిక పోకడలతో కాలక్రమేణా కనుమరుగవుతున్నారు. ఆటను వీడి.. పాటను మాని.. కన్నీటి అంచున కాలం వెల్లదీస్తున్నారు. ఓవైపు చేతిలో చిల్లిగవ్వ లేక.. మరోవైపు స్వరాష్ట్రంలో సర్కారు ప్రోత్సాహం లేక అర్ధాకలితో విలవిల్లాడుతున్నారు. చేసేదేమీ లేక కళాకారులు.. కాలే కడుపుతో.. పొట్ట చేత పట్టుకొని.. ‘వలస పాట’ అందుకుంటూ ముంబై, దుబాయి వంటి సుదూర ప్రాంతాలకు వలసెళ్లిపోతున్నారు.

కళాకారుల నోట.. వలస పాట!
నల్లపోచమ్మ చరిత్ర నాటక ప్రదర్శనలో పలు వేషధారణలో కళాకారులు

కనుమరుగవుతున్న ప్రాచీన కళలు
కళాకారులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ప్రోత్సాహం కరువై.. పొట్ట కూటి కోసం కళాకారుల వలసబాట
కూలీనాలీ కోసం పల్లెలు, పట్టణాలకు..
కాలక్రమేణా కనిపించకుండా పోతున్న గ్రామీణ కళాకారులు, కళా బృందాలు
ప్రతిభావంతులకు దక్కని గౌరవం
ఉద్యోగ అవకాశాల కల్పనలోనూ దక్కని చోటు
తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. ఉభయ జిల్లాలో మారని బతుకులు
రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళాకారులను ఆదుకునేనా?!

బాన్సువాడ, జనవరి 22: ‘కళ’.. నిజంగానే కళ తప్పుతోంది! ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పల్లెల్లో రోజుల తరబడి నాటకాలు వేస్తూ.. వీధివీధిన తిరిగి పాటలు పాడుతూ.. జనాన్ని రంజింపజేసిన కళాకారులు నేటి ఆధునిక పోకడలతో కాలక్రమేణా కనుమరుగవుతున్నారు. ఆటను వీడి.. పాటను మాని.. కన్నీటి అంచున కాలం వెల్లదీస్తున్నారు. ఓవైపు చేతిలో చిల్లిగవ్వ లేక.. మరోవైపు స్వరాష్ట్రంలో సర్కారు ప్రోత్సాహం లేక అర్ధాకలితో విలవిల్లాడుతున్నారు. చేసేదేమీ లేక కళాకారులు.. కాలే కడుపుతో..  పొట్ట చేత పట్టుకొని.. ‘వలస పాట’ అందుకుంటూ ముంబై, దుబాయి వంటి    సుదూర ప్రాంతాలకు వలసెళ్లిపోతున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ, బ్రహ్మ శంకరులు.. అంటూ పాత్రలతో కళాకారులు బృందాలుగా ఏర్పడి పల్లె ప్రాంతాల్లో నాటకాలను ప్రదర్శిస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారు. నెలల తరబడి.. కడుపు నిండా కళాకారులకు తిండి దొరికేది. తరతరాలు గా వీధినాటకాలతో తమదైన శైలిలో రంజింపజేసిన కళాకా రులు.. నేటి ఆధునిక పోకడలతో ఒక్కసారిగా కుదేలయ్యా రు. ఇంటర్నెట్‌ ప్రపంచంలో ప్రాచీన కళలతో పాటు కళాకా రులకూ ఆదరణ కరువై.. కళలు కనుమరుగవుతున్నాయి. సీఎం కేసీఆర్‌.. తెలంగాణ కవులు, కళాకారుల రాష్ట్రమని.. ఎంతమంది కళాకారులనైనా ఆదుకుంటామని, ప్రభుత్వం తరపున ఆర్థికసాయం అందజేస్తామని చెప్పినప్పటికీ.. ఇప్పటికీ ఆ హామీ నెరవేరిన దాఖలాలు లేవు. దీంతో ప్రతిభావంతులైన కళాకారులకు సరైన గౌరవం దక్కడం లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సీఎం కేసీఆర్‌ వెంట జిల్లాకు చెందిన ఎందరో కళాకారులు పాలుపంచుకున్నారు. ప్రాచీన కళలను కళాకారులు రోడ్డుపై ప్రదర్శిస్తూ పోరు బాటలో కీలకపాత్ర పోషించారు. అయితే ప్రత్యేక రాష్ట్రం సాధించిన సం తోషంలో కళాకారులు తమ బతుకులు మారుతాయని గంపెడాశతో ఎదురు చూశారు. కానీ చివరకు వారికి నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రాంతాల్లోని కళాకారులను విస్మరిస్తోందని  కళాకారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పదుల సంఖ్యలో కళాకారులు కాలే కడుపుతో హైదరాబాద్‌, ముంబై, దుబాయి, షార్జా వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. కళ కనుమరుగు కావడం.. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో.. మరికొందరు కళాకారులు కూలీనాలీ పనుల కోసం పట్టణాలకు వెళుతున్నారు. ఇంకొందరు పంట చేలల్లో కూలీలుగా మారుతున్నారు.
స్వరాష్ట్రంలోనూ మారని బతుకులు
ఉమ్మడి జిల్లాలో వందలాది మంది కళాకారులు ఉన్నారు. కామా రెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్‌ గ్రామానికి చెందిన ఐదు బృందాల సభ్యులు సంవత్సరానికి ఇద్దరు చొప్పున నల్లపోచ మ్మ చరిత్ర ఆటలో భాగంగా చక్కటి వేషధారణలతో నాటకాలు ఇస్తూ తమ ప్రతిభను కనబరుస్తారు. అలాగే హన్మాజీపేట్‌కు చెందిన అక్కమ్మ భజన మండలి సభ్యులు బ్రహ్మ, విష్ణు, మ హే శ్వర, శంకర, పార్వతి అంటూ మొత్తం 32పాత్రల్లో అద్భుతమైన వేషధారణలు వేస్తూ చరిత్ర పారాయణం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆనవాయితీ ప్రకారం నాటకాలు ప్రదర్శిస్తున్నారు. అలాగే, గ్రా మానికి చెందిన కళాకారులు దుర్గి గంగా రాం, వడ్ల కిషన్‌ ఆధ్వర్యం లోనూ చాలాకాలం గా ఈ చరిత్రను ప్రదర్శిస్తూ ప్రజలను అలరిస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయని, గౌరవ వేత నం లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూ శారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. ప్రభుత్వం మాత్రం కళాకారులను అంతగా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రోజురోజుకూ పెరిగిపోతు న్న ఇంటర్నెట్‌ ప్రపంచం.. కళలను అంతరించిపోయేలా చేసింది. అంతేకాకుండా స్మార్ట్‌ ఫోన్లు, ఎల్‌ ఈడీ టీవీలు, మల్టీఫ్లెక్స్‌ సినిమా థియేటర్లతో పాటు ఇత ర త్రా ఎలకా్ట్రనిక్‌ వస్తువులతో ఆధునిక పోకడలే మారిపోతున్నాయి. దీంతో ప్రజ లంతా ఆన్‌లైన్‌ ప్రపంచానికి ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో కవులు, కళాకారులకు గ్రామాల్లో సరైన ఆదరణ కొరవడింది. చివరికి వారు ప్రదర్శించే కళలను కూడా ఎవరూ చూడలేని పరిస్థితి ఎదురవడంతో కుటుంబ పోషణ భారంగా మారి వలసబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒక జీవనోపాధి చూపిస్తే.. వారు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. వారిని ఆదరించి.. వారికి ఏదో ఒక జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత అధికారులతో పాటు పాలకులపైనా ఉంది.  సీఎం కేసీఆర్‌ కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి, ప్రతినెలా ఆర్థిక సహాయం కింద పింఛన్‌ అందజేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి ఆదరణ, ఆర్థిక సహాయం కళాకారులకు కరువైంది. సర్కారు సాయం అందక పల్లె ప్రాంతాల్లోని కళాకారులు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
... తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది కళాకారులే..! అలాంటి వారి కాలికి ఇప్పుడు గజ్జ బరువైంది..! గొంతులోంచి పాట పెకలనంది..!!  తరతరాలుగా వీధి నాటకాలతో తమదైన శైలిలో రంజింపజేసిన కళాకారులకు ఇప్పుడు బతుకే బరువైంది. అలాంటి  కళాకారులను ఆర్థికంగా ఆదుకొని.. అండగా నిలవాల్సిన బాధ్యత    రాష్ట్ర ప్రభుత్వంపై  ఎంతైనా ఉంది.
ప్రభుత్వం కళాకారులను పట్టించుకోవడం లేదు
: కాశీరాం ( హన్మాజీపేట్‌, కళాకారుడు )
ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులను ప్రభుత్వం విస్మరించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాకారుల బతుకులు బాగు పడతాయని అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌ కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారికి గౌరవంతో పాటు నెలనెలా పింఛన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు. అందుకే కళాకారులు ఉపాధి కోసం వలస వెళ్లిపోతున్నారు.
ఆదరణ కరువై వలస బాట పడుతున్నాం..
: వెంకటి ( హన్మాజీపేట్‌, కళాకారుడు )
పల్లె ప్రాంతాల్లో ఒకప్పుడు కళాకారులు ప్రదర్శించే ప్రదర్శనలు, వేషధారణలతో ప్రజల్లో ఎంతో ఆదరణ ఉండేది. ప్రతిరోజూ వేల మంది ప్రజలు కళాకారుల ప్రదర్శన కోసం వేచి చూసి ఉండేవారు. రోజురోజుకు పోటీ ప్రపంచంలో ఆదరణ తగ్గుతూ వచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, మల్టీఫ్లెక్స్‌ థియేటర్లు పెరిగిపోవడంతో కళాకారుల ను ఆదరించడం లేదు. చివరకు కుటుంబ పోషణ కోసం మాకూ వలసబాట తప్పడం లేదు.
కుటుంబ పోషణ భారంగా మారింది
: పోశెట్టి ( బాన్సువాడ, కళాకారుడు )
కళాకారుడిగా గత 20ఏళ్లుగా వేషధారణలు వేస్తూ ప్రజల ఆదరణ పొందుతూ కుటుంబాన్ని పోషించుకునే వాణ్ణి. రోజు రోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో కళాకారులకు ఆదరణ కరువైంది. పల్లెల్లో ఎక్కడ చూసినా స్మార్ట్‌ ఫోన్లు ఇతరత్రా వాటితో ప్రజలు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులకు పింఛన్లు, ఉద్యోగాలు, ఆదరణ లభిస్తుందని అనుకున్నాం. సీఎం కేసీఆర్‌ కళాకారులను విస్మరించారు.

Updated Date - 2022-01-23T06:43:28+05:30 IST