కళాత్మక కల

ABN , First Publish Date - 2021-07-26T06:22:00+05:30 IST

శూన్యంలో దృశ్యం చూస్తే తెలుస్తుంది! గొప్ప కళ ఎలాఉంటుంది? ఎలా ఉండాలి? గాలిలో చిత్రాన్ని గీసారా ఎప్పుడైనా?...

కళాత్మక కల

శూన్యంలో దృశ్యం చూస్తే తెలుస్తుంది!

గొప్ప కళ ఎలాఉంటుంది?

ఎలా ఉండాలి?


గాలిలో చిత్రాన్ని గీసారా ఎప్పుడైనా?

అద్భుత చిత్రకారుడు గాల్లో అందంగా గీస్తాడు

ఆపోసన పట్టి 

గాలిని

బుగ్గలు బుగ్గలుగా ఊదుతాడు

మేఘాలు మేఘాలుగా

చిత్రాలు చిత్రాలుగా

దృశ్యపరంపర మన కట్టెదుట నిల్చి

మరుక్షణంలో మాయమైపోతాయి!


నీటిమీద రాత ఎంత అందంగా ఉంటుంది!

చూపుడువేలుపెట్టి తిప్పితే నీడ కదలాడుతూ

అక్షరవిన్యాసం

పదాలుపదాలుగా

వాక్యాలువాక్యాలుగా దర్శనమిస్తుంది !


గీయగలిగినవాడు

గీయాలిగాని,

చూడగలిగినవాడు

చూడగలడు


రాయగలిగినవాడు

రాయాలిగాని,

చదువగలిగినవాడు

చదువగలడు!


గాల్లో దృశ్యాలూ

నీటిమీది రాతలూ

అలా మాయమై,

మాయమైనట్టే మాయమై

మనోఫలకమ్మీద ముద్రిస్తాయి!

ఆలోచనల్లో ఇమిడి

తరంగాలు తరంగాలుగా

సముద్రాంతరంగమవుతాయి!


గాలిలో దృశ్యం-

నీటిమీది రాత-


స్వప్న వీక్షణం

శూన్యదృశ్యంలో

నీటిచిత్రణలో

ఒక కళాత్మను 

సృష్టిస్తాయి!!

కందుకూరిశ్రీరాములు

94401 19245


Updated Date - 2021-07-26T06:22:00+05:30 IST