ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌దే భవిష్యత్‌!

ABN , First Publish Date - 2022-07-03T06:00:59+05:30 IST

రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌దే భవిష్యత్తు అని, ప్రపంచస్థాయిలో ఆ కోణంలో పరిశోధనలు సాగుతున్నాయని కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌దే భవిష్యత్‌!
ఐఐటీ-హెచ్‌లో ప్రసంగిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

ఆ కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి

గతంలో టెక్నాలజీని దిగుమతి చేసుకునే వాళ్లం

ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో టెక్నాలజీ అభివృద్ధి

ప్రపంచం గర్వించేలా ఐఐటీ-హెచ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలుండాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 

ఐఐటీ-హెచ్‌లో బీవీఆర్‌ సీయంట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

సాంకేతిక, పరిశోధన భవనాల ప్రారంభోత్సవం

పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా ఐఐటీ-హెచ్‌, గ్రీన్‌కో సంస్థల ఒప్పందం


కంది, జూలై 2: రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌దే భవిష్యత్తు అని, ప్రపంచస్థాయిలో ఆ కోణంలో పరిశోధనలు సాగుతున్నాయని కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీ-హెచ్‌)లో శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌ (బీవీఆర్‌ సీయంట్‌) భవన నిర్మాణానికి పునాది రాయివేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఐఐటీ-హెచ్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన టెక్నాలజీ ఇన్నోవేషన్‌ పార్‌ (టిప్‌), రీసెర్చ్‌ సెంటర్‌ కాంప్లెక్స్‌లను ఐఐటీహెచ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, డైరెక్తర్‌ బీఎస్‌ మూర్తి, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, జైకా, సీయంట్‌ సంస్థ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, అధికారులతో కలసి ప్రారంభించారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌ పార్క్‌లో నూతన ఆవిష్కరణలను ఆయన పరిశీలించారు. అనంతరం ఐఐటీ-హెచ్‌ ఆడిటోరియంలో గ్రీన్‌కో స్కూల్‌ ఆఫ్‌ సస్టైనబుల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఏర్పాటు కోసం ఐఐటీ-హెచ్‌, గ్రీన్‌కో సంస్థల మధ్య అవగాహన ఒప్పందం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఆత్మనిర్భర్‌లో భాగంగా స్థాపించిన హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన భారత్‌ బయోటెక్‌, పూణే ప్రాంతానికి చెందిన సిరం కంపెనీలు కరోనాను ఎదుర్కొనేందుకు చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ రెండు సంస్థలు వ్యాక్సిన్‌, మెడిసిన్‌లు సకాలంలో తయారు చేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలకంగా నిలిచాయని ధర్మేంద్ర ప్రధాన్‌ ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ వేశామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఐఐటీలు నూతన పరిశోధనల్లో దేశీయ టెక్నాలజీని వినియోగించడం అభినందననీయమన్నారు. గతంలో టెక్నాలజీని, వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వారమని, ఇప్పడు మనదేశం ప్రంపంచ దేశాలకు ఉత్పత్తి చేసే స్థాయికి చేరిందన్నారు. మనకు అర్థమయ్యే భాషలో టెక్నాలజీ అభివృద్ధి చెందిదని ఆయన వివరించారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగించడంలో భారత్‌ మూడో స్థానంలో ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సహజవాయు ఉత్పత్తిని పెంచుతున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా ఐఐటీ-హెచ్‌, గ్రీన్‌కో సంస్థల ఒప్పందం కుదిరినందుకు సంతోషకరమన్నారు. ఐఐటీ హైదరాబాద్‌ దేశంలో గొప్ప పరిశోధనా కేంద్రంగా రూపుదిద్దుకోవడం విశేషమని కేంద్ర మంత్రి తెలిపారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించి ప్రపంచం గర్వించేలా ఐఐటీ-హెచ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఐటీయన్లు వివిధ సంస్థలు ఇచ్చిన ప్యాకేజీల ఆధారంగా కాకుండా ఉద్యోగాల కల్పన అంశాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్‌ ఆకాంక్షించారు. 


అబ్బురపరిచేలా ఐఐటీహెచ్‌ పరిశోధకుల ఆవిష్కరణలు

టెక్నాలజీ ఇన్నోవేషన్‌ పార్క్‌లో నూతన ఆవిష్కరణలు చూపరులను కట్టిపడేశాయి. అబ్బురపరిచేలా, అందరికి ఉపయోగపడేలా ఐఐటీ-హెచ్‌ పరిశోధనా విద్యార్థులు అధునాతన సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేసిన పరికరాలు త్వరాలో అందుబాటులోకి రానున్నాయి. ఐఐటీహెచ్‌ పరిశోఽధనలకు పెద్దపీట వేస్తూ రూ.135 కోట్లు వెచ్చిస్తుందని ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి వెల్లడించారు.


శరీర రుగ్మతలను గుర్తించే జిమ్‌ సూట్‌

మనం వ్యాయమం చేసేటప్పుడు శరీర కదలికల ఆధారంగా మనలో ఉన్న రుగ్మతల్ని గుర్తించేలా పరిశోధన విద్యార్థులు జిమ్‌ సూట్‌ను ఆవిష్కరించారు. దీని ధర రూ.8వేలు ఉంటుందని. 2023 జనవరి నుంచి ఇది మార్కెట్‌లో అందుబాటులోకి రానుందని పరిశోధకులు తెలిపారు. 


అధిక బరువులు మోయగల బ్యాటరీ వాహనాలు

ఇప్పటి వరకు రోడ్ల మీద వేగంగా దూసుకెళ్లే బ్యాటరీతో నడిచే విద్యుత్‌ వాహనాలే వినియోగంలో ఉన్నాయి. ఐఐటీ-హెచ్‌ పరిశోధకులు పర్‌సెస్ట్‌ ఎనర్జీ పేరులో కొత్త బ్యాటరీ వాహనాలను రూపొందించారు. దాదాపు 250 కిలోల బరువు మోయగల ఈ బ్యాటరీ వాహనం ధర రూ.60 వేలు. 4 గంటలు చార్జింగ్‌ చేస్తే చాలు 140 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రైతులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు ఇది ఎంతో ఉపయోగకంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. 


 డ్రైవర్‌ లేకుండా ఎగిరే విమానాలు 

ఐఐటీహెచ్‌లో డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడి ప్రొఫెసర్‌ దీపక్‌ జాన్‌ మాఽథ్యూ సహకారంతో ప్రాక్టిస్‌ బేస్డ్‌ (నమూనాలను తయారుచేసే) పీహెచ్‌డి చేస్తున్న ప్రియబ్రత రౌత్రే ఆస్ట్రేలియాలోని స్పిన్‌బన్‌ యూనివర్సిటితో కలిసి రూపకల్పన చేశారు. ఈ పీఏఈలు రోడ్లపై కారులాగా నడుపుతూ, అససరం అనుకుంటే గాల్లో ఎగిరేలా తయారు చేయడం అద్భుతమని డిజైన్‌ విభాగం పరిశోధకులను అభినందించారు. డ్రైవర్‌ లేకుండానే సెన్సార్‌, జీపీఎ్‌సలు అనుసంధానిస్తూ ఎగిరే విమానాలు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.


 అమ్మఒడిలో ఉంచే కామెర్లకు చికిత్స

నవజాత శిశువులు గతంలో కామెర్ల బారి పడితే వారిని తల్లి ఒడి నుంచి వేరు చేసి చికిత్స అందించేవారు. ఐఐటీ-హెచ్‌ సీఎ్‌ఫహెచ్‌ఈ పరిశోధనా విద్యార్థులు తయారు చేసిన ఎన్‌లైట్‌ 360 పరికరంతో అమ్మఒడిలో ఉంచే శిశువులకు కామెర్లకు చికిత్స అందించేలా రూపొందించారు. ప్రస్తుతం ఈ పరికరం ప్రయోగ దశలోనే ఉన్నా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు చెపుతున్నారు. 


సీనియార్టీ ప్రకారం వేతనాలు పెంచాలని వినతి

కంది, జూలై 2: కాంట్రాక్టు ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం వేతనాలు పెంచేలా చూడాలని శనివారం ఐఐటీ-హెచ్‌ సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఐఐటీహెచ్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు కొండపురం జగన్‌, పల్పనూరి శేఖర్‌లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ఐఐటీ-హెచ్‌కు భూములు ఇచ్చిన వారి కుటుంసభ్యులకు ఒప్పంద ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఉద్యోగాలు వచ్చి పదేళ్లు అవుతున్నా కనీసం వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. ఇతర ఐఐటీల మాదిరిగా ఐఐటీ-హెచ్‌ కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2022-07-03T06:00:59+05:30 IST