పనిలో పని, అన్నిటినీ...

ABN , First Publish Date - 2021-07-17T05:47:06+05:30 IST

భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహ నిబంధన 124–ఎ మీద అత్యున్నత న్యాయస్థానంలో గురువారం నాడు జరిగిన విచారణ, ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలు చరిత్రాత్మకమైనవి...

పనిలో పని, అన్నిటినీ...

భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహ నిబంధన 124–ఎ మీద అత్యున్నత న్యాయస్థానంలో గురువారం నాడు జరిగిన విచారణ, ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలు చరిత్రాత్మకమైనవి. కాలం చెల్లిపోవలసిన ఒక చట్టాన్ని ఇంకా సజీవంగా ఉంచుతూ అసమ్మతిని, ప్రజాస్వామిక ప్రత్యర్థులను కూడా అణచిపెట్టడానికి వినియోగించడాన్ని దేశ పౌరసమాజంలోని విమర్శకులు చాలా కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇంతకాలానికి అయినా, ఆ నిబంధనను సుప్రీంకోర్టు బోనులో నిలబెట్టి విచారిస్తున్నందుకు అభినందించవలసి ఉన్నది. అంతకు మించి, ఇటీవలి సంవత్సరాలలో దేశంలో మానవ, ప్రజాస్వామిక, రాజకీయ హక్కులకు ఎదురవుతున్న గడ్డుపరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చకు మరింత ప్రాధాన్యం లభిస్తున్నది. 


రాజద్రోహ నిబంధనపై అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ‘‘ఇది వలసవాదులు మన ప్రజలను, జాతీయోద్యమాన్ని అణచడానికి ఉపయోగించిన చట్టం, దీని కింద గాంధీజీ, తిలక్ మొదలైన జాతీయ నాయకులను నిర్బంధించారు. ఇంకా దీన్ని కొనసాగించవలసిన అవసరం ఏమిటి? దీన్ని అధికార యంత్రాంగం దుర్వినియోగం చేస్తోంది. ఐటి చట్టంలోని 66–ఎ సెక్షన్ ఎంత దుర్వినియోగం అయిందో రాజద్రోహం కూడా అంతగా దుర్వినియోగం అవుతోంది. వేధింపులకు ఇది ఆస్కారం ఇస్తోంది.’’ ప్రభుత్వ పక్షం ఏమంటుంది? ఈ చట్టం కొనసాగవలసిన అవసరం ఉందని వాదించింది. కావాలంటే దుర్వినియోగాన్ని నిరోధించడానికి మార్గదర్శకాలు ఇవ్వండి అని న్యాయస్థానానికి ఉదారంగా అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ పక్ష వాదనతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. రాజద్రోహ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలయిన కేసులన్నిటిని పరిగణనలోకి తీసుకుని తదుపరి ప్రక్రియ సాగిస్తామని చెప్పింది.


ఒక పక్క రాజద్రోహంపై అత్యున్నత న్యాయపీఠంలో విచారణ జరుగుతూ ఉండగా, హర్యానా రాష్ట్రంలో వందమంది రైతు ఆందోళనకారులపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆ చట్టాన్ని ప్రభుత్వాలు ఎందుకోసం ఉపయోగిస్తున్నాయనడానికి ఇంతకుమించిన సాక్ష్యం అక్కరలేదు. సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేసినందుకు, దళిత యువతి అత్యాచారంపై నిజనిర్ధారణకు వెడుతున్నందుకు, కమ్యూనిస్టు పుస్తకాలు చదివినందుకు, నినాదాలు చేసినందుకు, కొవిడ్ నిరోధంలో ప్రభుత్వం విఫలమయినందని మాట్లాడినందుకు కూడా దేశంలో రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ప్రతి ప్రజా ఉద్యమాన్ని దేశద్రోహకరమైనదిగా ముద్రవేస్తూ కేంద్రంలోను అనేక రాష్ట్రాలలోను ఉన్న ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠినమయిన అప్రజాస్వామిక చర్యలపై న్యాయస్థానం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇటీవలి కాలంలో పెరిగింది. జస్టిస్ ఎన్.వి రమణ ప్రధాన న్యాయమూర్తి అయ్యాక, హక్కులు, ప్రజాస్వామికతల విషయంలో న్యాయస్థానాల, కనీసం ఉన్నత న్యాయస్థానాల, స్పందన ప్రగతిశీలంగా మారింది. ఈ పరిణామం అభినందనీయమైనది. ప్రజాస్వామ్యాన్ని మరింతగా విస్తరింపజేసుకోవడానికి అవకాశం కల్పించేది. 


ఒకేసారి పెనుమార్పును ఆశించడం అత్యాశ కావచ్చును కానీ, ప్రజలను వేధిస్తున్న, ఉద్యమాలను బాధిస్తున్న అంశం రాజద్రోహం ఒక్కటే కాదు. అప్పటికీ ఇప్పటికీ అది ఒకే పేరుతో కొనసాగుతున్నందు వల్ల ఇంకా అదే చట్టం కొనసాగడమేమిటి అన్న ప్రశ్నకు నైతికత లభిస్తున్నది కానీ, పేరు మారి వలసవాద న్యాయాన్ని కొనసాగిస్తున్న చట్టాలు అనేకం ఉన్నాయి. వలసవాదంతో నిమిత్తం లేకుండా, స్వతంత్ర భారతదేశమే రూపొందించిన అనేక అప్రజాస్వామిక చట్టాలు ఉన్నాయి. రాజద్రోహం మీద జరుగుతున్న చర్చ ఈ అన్ని చట్టాలకు కూడా విస్తరింపజేయాలి. 


మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని జాతీయోద్యమ నాయకుడిగా మార్చింది, రౌలట్ చట్టంపై ఆయన తీసుకున్న వైఖరి. దైవదత్తమైన హక్కులపై దాడి రౌలట్ చట్టం అని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ వైఖరిని ఆధారం చేసుకుని దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆ చట్టానికి నిరసన తెలిపారు. జలియన్ వాలాబాగ్‌లో రక్తసిక్తమయిన సమావేశం రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగినదే. నిందితులే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనే నిబంధనతో సహా ఆ రౌలట్ చట్టంలోని అనేక అన్యాయమైన, దుర్మార్గమైన అంశాలు ఇప్పటి ఊపా చట్టంలో ఉన్నాయి. మునుపు టాడా, పోటా వంటివి కూడా రౌలట్ ప్రేరణతోనే రూపొందించారు. రౌలట్ పేరు కొనసాగనంత మాత్రాన ఊపా నేరపూరిత చట్టం కాకుండా పోతుందా? జాతీయోద్యమం ఉధృతమవుతున్న తొలిరోజులలోనే బ్రిటిష్ వారు అమలులో పెట్టిన రౌలట్ చట్టం దేశీయుల గొంతునొక్కేందుకు ఉద్దేశించినదే. స్వతంత్ర భారతంలో అటువంటి చట్టం ఎందుకు? ఏ విచారణ, ఏ అభియోగ పత్రం దాఖలు చేయకుండా నెలల తరబడి నిందితులను దారుణమైన నిర్బంధంలో ఉంచడం ప్రపంచవ్యాప్తంగా భారత్‌ను అప్రదిష్ట పాలుచేస్తున్నది. సమస్యల మీద గొంతు విప్పే విద్యార్థులను, అప్రజాస్వామిక శాసనాలపై నిరసన తెలిపే పౌరులను, ప్రజాసంఘాలను, రైతాంగాన్ని ఈ చట్టాల చట్రంలో దేశద్రోహులుగానో, తీవ్రవాదులుగానో ముద్రవేస్తున్నారు.


జమ్మూకశ్మీర్‌లో ఉపయోగిస్తున్న ప్రజా భద్రతా చట్టం బ్రిటిష్ వారు రూపొందించిందే. కమ్యూనిస్టు విప్లవకారులను, జాతీయవాద విప్లవకారులను అణచివేయడానికి వలసప్రభుత్వం 1928లో ఆ పేరుతో ఒక చట్టం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధసమయంలో ప్రజావ్యతిరేకతను నిరోధించడానికి రూపొందించిన భారత రక్షణ చట్టాన్ని స్వతంత్ర భారతంలో ప్రతి యుద్ధ సందర్భంలోనూ అమలులోకి తెచ్చారు. రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21 జీవితహక్కుకు పూచీ పడుతుంటే, ఆర్టికల్ 22లోని (3) సెక్షన్ ముందస్తు నిర్బంధానికి ఆమోదం తెలిపింది. చివరకు బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా ఆర్టికల్ 22 (3) అవసరమేనని వాదించారు. ముందస్తు నిర్బంధానికి ప్రభుత్వ దృష్టి నుంచి చెబుతున్న సమర్థనలే, పి.డి.చట్టం, జాతీయ భద్రతా చట్టం మొదలైనవాటికి దారితీశాయి. వలసవాద చట్టాలను వ్యతిరేకించడం మాత్రమే కాదు, ప్రభుత్వాలు తమలో ఉన్న వలసవాద మనస్తత్వాన్ని మార్చుకోవలసిన, ప్రజలను అదుపుచేయవలసిన వారిగా పరిగణించడాన్ని మానుకోవలసిన అవసరం ఉన్నది. 


రాజ్యాంగ విలువల రక్షణకు అత్యున్నత న్యాయస్థానం చొరవతీసుకుని ముందుకు వస్తున్నది కాబట్టి, ఒక చట్టమో, ఒక నిబంధనో అని కాకుండా, అప్రజాస్వామికంగా, అన్యాయంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న అన్ని చట్టాలపై న్యాయసమీక్ష చేయవలసిందిగా అభ్యర్థించవలసిన సమయం వచ్చింది.

Updated Date - 2021-07-17T05:47:06+05:30 IST