ఈ దురాశను ఏ వ్యాక్సిన్ ఆపగలదు?

ABN , First Publish Date - 2021-05-15T06:09:07+05:30 IST

కొవిడ్ సంబంధిత విలయంలో కరోనా పాత్ర ఎంత, దాని పేరు మీద మనుషులు, వ్యవస్థ సృష్టిస్తున్న విషాదం ఎంత? అంబులెన్సుల నిర్వాహకుల నుంచి ఆసుపత్రుల యాజమాన్యాల వరకు అందరూ కరోనా బాధితులను నిస్సిగ్గుగా దోచుకుంటున్నారు. ప్రాణభయం ఉన్నవారు ఎంతైనా, ఎలాగైనా చెల్లిస్తారని భావిస్తున్న ఈ లాభాలు మరిగిన తోడేళ్ళు కరోనా అనంతర కాలంలో మారిపోతాయా? లేక మరింత వ్యవస్థీకృతం అవుతాయా?...

ఈ దురాశను ఏ వ్యాక్సిన్ ఆపగలదు?

కొవిడ్ సంబంధిత విలయంలో కరోనా పాత్ర ఎంత, దాని పేరు మీద మనుషులు, వ్యవస్థ సృష్టిస్తున్న విషాదం ఎంత? అంబులెన్సుల నిర్వాహకుల నుంచి ఆసుపత్రుల యాజమాన్యాల వరకు అందరూ కరోనా బాధితులను నిస్సిగ్గుగా దోచుకుంటున్నారు. ప్రాణభయం ఉన్నవారు ఎంతైనా, ఎలాగైనా చెల్లిస్తారని భావిస్తున్న ఈ లాభాలు మరిగిన తోడేళ్ళు కరోనా అనంతర కాలంలో మారిపోతాయా? లేక మరింత వ్యవస్థీకృతం అవుతాయా?


కరోనా తాకిన అనంతరం అన్ని వర్గాల వారి జీవితం ఒకేలా లేదనే విషయాన్ని వ్యవస్థ గుర్తించడం లేదు. సంఖ్యాపరంగా మొత్తం సమాజంలో పేదల, మధ్య తరగతి, ధనిక వర్గం నిష్పత్తి ఎంత? అందరినీ సమాన స్థాయిలో కరోనా ప్రభావితం చేస్తుందంటే అత్యధికులు సామాన్యులే మరణిస్తారని కదా అర్థం? కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకోవాలి అనేవాళ్ళు అంటున్నదేమిటి? కింది తరగతి వారు మరణాలతో, ఆపై వర్గాల వాళ్ళు ప్రైవేటు రంగంలో తగ్గిన ఆదాయంతో, ప్రభుత్వరంగంలో స్థిరంగా పెరుగుతున్న జీతాలతో, ధనిక వర్గం పెరిగిన లాభాలతో సహజీవనం చేయాలనీ. ఇది న్యాయమా? 


కొవిడ్ సందర్భంగా సృష్టించబడుతున్న విలయంలో కరోనా పాత్ర ఎంత, దాని పేరు మీద మనుషులు, వ్యవస్థ సృష్టిస్తున్న విషాదం ఎంత? అంబులెన్సుల నిర్వాహకుల నుంచి ఆసుపత్రుల యాజమాన్యాల వరకు అందరూ కరోనా బాధితులను నిస్సిగ్గుగా దోచుకుంటున్నారు. ప్రాణభయం ఉన్నవారు ఎంతైనా, ఎలాగైనా చెల్లిస్తారని భావిస్తున్న ఈ లాభాలు మరిగిన ఈ తోడేళ్ళు కరోనా అనంతర కాలంలో మారిపోతాయా? లేక మరింత వ్యవస్థీకృతం అవుతాయా? 


రాజకీయార్థిక వ్యవస్థ, పేదలకు బలవంతంగా ఆకలి, చావులు అలవాటు చేసింది. మధ్య తరగతికి జీతాలు అలవాటు చేసింది. కరోనా కాలంలో వారి జీతాలు ఆగలేదు, ఇంక్రిమెంట్లు ఆగలేదు. బోనస్సులు ఆగలేదు. ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కరువు వస్తుంది. కానీ ప్రతి సామూహిక విపత్తు తర్వాత అన్ని వర్గాలు ఎదుర్కొనే మానసిక సమస్యలు మధ్య తరగతీ ఎదుర్కొంటోంది. లాభాలను, (అదర్ పూనావాలా భాషలో చెప్పాలంటే సూపర్ లాభాలను), అధికారాన్ని, ఎన్నికలను అలవాటు చేసుకున్న బలవంతులు మాత్రం, వాటిని ప్రాణవాయువు అంత సహజంగా పరిగణిస్తున్నారు. ఆస్పత్రిలో ప్రాణవాయువు లేకపోయినా పర్లేదు కానీ, లాభాలు, అధికారం లేకపోతే వాళ్ళ ప్రాణాలు నిలవకపోవచ్చు.


వ్యక్తులు స్వయంగా చేసుకున్నా, వ్యవస్థ బలవంతంగా రుద్దినా, ఈ అలవాట్లు ఎంత బలమైనవంటే, జీతాలూ, లాభాలు, అధికారం కొంత తగ్గించుకుంటే, కరోనా ప్రభావం లేకనే మనుషుల ప్రాణాలు పోవచ్చు. సమాజం ఆలోచనలు ఎంత లోతుగా వ్యవస్థీకృతమై ఉందంటే, కనీసం కరోనా కాలంలో ఎన్నికలు కొంతకాలం జరపకపోతే ఏమౌతుంది, లాభాపేక్ష లేకుండా ఆసుపత్రులు నడపలేమా, ఉద్యోగుల జీతాలు తగ్గించుకుంటే పేదలను కనీసం తాత్కాలికంగా ఆదుకోలేమా, కేంద్రప్రభుత్వం వద్ద కరోనా కాలంలో కూడా నెల నెలా జీఎస్టీ పేరు మీద లక్ష కోట్ల పైన నగదు పోగుపడుతుంటే దాన్ని పునర్వ్యవస్థీకరించి పంపిణీ చేయలేమా అనే ప్రశ్నలు ఎవరి నుంచి రావడం లేదు. కనీసం సంక్షోభ కాలంలో లాభాలను, జీతాలను హేతుబద్దంగా సవరించాలనే ప్రతిపాదన ఎవరి నుంచి రావడం లేదు. నా ఈఎంఐ ఎవరు కడతారు? వడ్డీల మీద బతికే బ్యాంకింగ్ వ్యవస్థ ఏం కావాలి? ప్రాథమిక ఉత్పత్తిదారులు మీద బతికే అన్ని పరాన్నజీవులు అడిగే ప్రశ్న ఇది. కాబట్టి వ్యవస్థ లాక్‌డౌన్ ప్రసక్తే లేదు అంటున్నారు. 


సమాజాన్ని ప్రస్తుతమున్న రీతిలో తప్ప ఇంకోలా వ్యవస్థీకరించడం సాధ్యం కాదు అని మధ్య తరగతి, ముఖ్యంగా ఆధిపత్యంలో ఉన్నవారు భావిస్తున్నారు. వ్యవస్థలో బలవంతులు ఏం కావాలంటే అది చేస్తారు, అందులో బతకగలిగే వాళ్ళు బతుకుతారు లేనివాళ్లు పోతారు అనేది చాలాకాలంగా ఉన్న దృక్పథమే. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దీనికి సోషల్ డార్వినిజం ముద్దు పేరు పెట్టుకున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. సమాజం ఇలా మాత్రమే వ్యవస్థీకృతం కాగలదు, దీనికి ప్రత్యామ్నాయం లేదు అనే అభిప్రాయం మార్కెట్ వ్యవస్థ దౌర్జన్యం చేయడం ప్రారంభించడానికి ముందు కూడా ఉంది. ప్రతి సంక్షోభ కాలంలో, గత రెండు ప్రపంచ యుద్ధాల కాలంలోనూ, క్షామాలలోనూ, వ్యాపార వర్గాలు దండిగా లాభాలను దండుకున్నాయి అనేదానికి తెలుగు సాహిత్యం నిండా సాక్ష్యాలు కోకొల్లలు.


పెట్టుబడిదారీ వర్గం నుంచఇ  సమష్టి ప్రయోజనాలను ఆశించడంలో అర్థం లేదు. ప్రభుత్వ లెక్క ప్రకారం గతంలో ప్రజల ఆరోగ్యానికి హాని చేసే 344 మందులు కంపెనీలు తయారు చేశాయి. వాటిని ప్రభుత్వం నిషేధించింది. లాభాలను, సంపదను, దురాశను గర్వంగా (Greed is good) ప్రచారం చేసుకునే కాలంలో ప్రాణాలు పోతుంటే ఆసుపత్రులు దయ చూపాలనుకోవడం అసంగతం. వైద్య వ్యవస్థలో ప్రైవేటీకరణ చేసినప్పుడు మాట్లాడని మధ్య తరగతి, మెడికల్ సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో కొనడానికి పోటీ పడటాన్ని ఉపేక్షించే సమాజానికి వైద్య వ్యవస్థ దుర్మార్గాల గురించి ఫిర్యాదు చేసే నైతిక హక్కు ఉందా? మార్కెట్ వర్గాల ఆధిపత్యంలో ఉండే కొన్ని పాశ్చాత్య దేశాలలో కూడా కనీసం విద్య, వైద్య రంగాలను లాభాలకు దూరంగా ఉంచారు. కానీ భారతీయ పెట్టుబడిదారీ వర్గం, మధ్యతరగతి, ప్రజల అనారోగ్యంలో లాభాలనే చూశారు. ఇప్పుడు దిగ్భ్రాంతిని ఎందుకు ప్రకటిస్తున్నట్లు? ఈ విపత్తు సందర్భంలో ఈ కఠిన ప్రశ్నలు అడగక తప్పదు. 


మార్కెట్ వ్యవస్థ ఒక జీవిత విధానాన్ని, ఆలోచన విధానాన్ని ప్రజలకు అలవాటు చేసింది. టూరిజం తప్ప ఇక ఏ ఇజమూ లేదన్న వాళ్ళు చేసిన ఆలోచన విధానం అది: డబ్బు సంపాదించు. అది అన్నింటినీ సమకూర్చి పెడుతుంది. దానికి పరిమితులు లేనట్టు. ‘అతను యాభై లక్షలు పెట్టుకోగలడు, కానీ ఆస్పత్రిలో బెడ్ దొరకడం లేదు’ అని ఆశ్చర్యపోతున్న వాళ్ళందరూ ప్రదర్శిస్తున్న ఆలోచన విధానం ఇదే. ఈ ఆలోచనలో డొల్లతనాన్ని కరోనా సంక్షోభం బయటపెట్టింది. కానీ ఈ ఆలోచనలకు అనుగుణంగా రూపొందిన రాజకీయ, ఆర్థికవ్యవస్థ ప్రజల ప్రాణాలు కాపాడడానికి లాక్‌డౌన్ విధించవు. లాక్‌డౌన్ విధిస్తే వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడానికి తాత్కాలికంగానైనా సంపదను కాకపోయినా, కనీసం డబ్బులు పునఃపంపిణీ చేయవు.


ఎందుకంటే సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే మధ్య, ధనిక వర్గం జీవన విధానం పునర్వ్యవస్థీకరణ జరగాల్సి రావచ్చు. అప్పుడు ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదనే వాదం బలహీన పడుతుంది. ఆ స్థితి మార్కెట్ వ్యవస్థ ఆధిపత్యానికి ప్రమాదకరం. అందుకే కొన్ని లక్షల ప్రాణాలను త్యాగం చేయడానికైనా వ్యవస్థ సిద్ధపడింది కానీ తాత్కాలికంగా నైనా వైద్య వ్యవస్థను జాతీయం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను స్తంభింప చేయడానికి సిద్ధంగా లేదు. స్వచ్ఛందంగా కరోనా విపత్తును లేకపోతే ఆర్థిక విపత్తును వ్యక్తిగతంగా ఎంచుకోమని ప్రజలకే వ్యవస్థ వదిలేసింది. ఇది ప్రజలకు ఇచ్చిన ప్రజాస్వామికమైన ఎంపికేనా? 


ప్రస్తుత స్థితిలో జాతీయకరణ దాకా పోకపోయినా, ప్రైవేట్ ఆసుపత్రులన్నిటినీ ప్రభుత్వం తన ఆధీ నంలో తీసుకుని ఎందుకు నడపకూడదు? కరోనా అత్యవసర పరిస్థితి కాకపోతే ఇంకేమౌతుంది అనే అమాయకమైన ప్రశ్నలు బాధలో ఉన్న ప్రతి పౌరుడికి వస్తుంది. పాలనా విధానాలను నిర్దేశించే రాజకీయాలు అంతిమంగా బలవంతుల ప్రయోజనాలు, అధికారం గురించే పట్టించుకుంటాయనడలో సందేహం లేదు. తమ స్వప్రయోజనాల గురించి వ్యవస్థీకృతమై ఉన్న వైద్య వ్యవస్థ అధికారం గురించి తక్కువ అంచనా వేయనక్కరలేదు. రాజకీయాల మీద ప్రైవేటు విద్యా వ్యవస్థ పట్టు తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలుసు. వైద్య వ్యవస్థ పట్టు అంత ప్రత్యక్షంగా కనిపించక పోయినా దాపరికమేమీ లేదు. జాతీయ వైద్య సేవలలో భాగం కాకపోవడానికి వైద్య సంఘాలు చేసిన కుయుక్తులు బ్రిటన్ సహా చాలా దేశాల్లో జరిగింది. ఆధునిక వైద్య వ్యవస్థ మందుల ఉత్పత్తి కంపెనీలతో కుమ్మక్కు అవుతున్నాయనే ఫిర్యాదు గత వంద ఏళ్లుగా ఉంది.


ఈనాడు మందుల కంపెనీలు దేశాలను శాసిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, వ్యాక్సిన్ కావాలంటే తమ దేశానికి మిలిటరీ ఎయిర్ బేసులు ఇవ్వాలని బ్రెజిల్, అర్జెంటీనా దేశాలకు షరతులు విధించింది. కరోనా విపత్తు వెనక, మార్కెట్ వ్యవస్థ, మందుల కంపెనీలు చేసిన చాలా పెద్ద కుట్ర ఉందని వాదించే అసమ్మతి స్వరాలకు ఇలాంటి వార్తలు బలాన్ని చేకూర్చుతున్నాయి. లాభాలను జుర్రుకుంటున్న వైద్య వ్యవస్థకు అన్ని రంగాలకు లాగే ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కరోనా సంక్షోభంలోనూ వారి ప్రయోజనాలకు అతీతంగా వైద్య విధానం ఏర్పడదు. ఇది తెలియకపోతే వైద్య వ్యవస్థ ఇంత సంక్షోభంలోనూ ఇంత కంటే వేరే పద్ధతిలో పనిచేయడం సాధ్యం కాదేమో అనుకుంటాం. 


ఈ విలయం సృష్టిస్తున్న భయం మన సామూహిక మస్తిష్కంలో చాలాకాలం ఉండబోతుంది. అది ప్రజల వ్యక్తిగత, సామూహిక జీవితంలో చాలా రూపాల్లో బయటపడుతుంది. భవిష్యత్తులో ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళడానికి భయపడే పరిస్థితి రావచ్చు. కానీ పెట్టుబడిదారీ వైద్యరంగం అలాంటి పరిస్థితినీ తనకు మరింత అనుకూలంగా మార్చుకుంటుంది. ప్రత్యామ్నాయ వైద్య రంగాన్ని పోటీలో లేకుండా చేయడం, ఇన్సూరెన్స్ లేకుండా ఏ ఒక్కరు ఆస్పత్రి గుమ్మం తొక్క లేకుండా చేయడం అది చేసే పని. పాశ్చాత్య దేశాల్లో వైద్య రంగంలో పాలనా విధానం మనకు చెప్తున్న పాఠమిదే. ప్రజలకు చౌకైన వైద్య విధానం అనే ఒకే అంశం మీద ఒబామా అధికారంలో వచ్చాడంటే అతిశయోక్తి కాదు. కరోనా విలయాన్ని ఒక విషాదంగా కాక ఒక అవకాశంగా పరిగణించే మనుషులు, వ్యవస్థలు ఉన్నంతకాలం ఇలాంటి విషాదాలు మరల మరల వస్తూనే ఉంటాయి. వాళ్ళ దురాశను ఏ వాక్సిన్ అడ్డుకోగలదు? 


-కే. మురళి

నల్సార్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్

Updated Date - 2021-05-15T06:09:07+05:30 IST