కష్ట కాలంలో ఏకతాటిపైకి రాలేరా? : శ్రీ శ్రీ రవిశంకర్

ABN , First Publish Date - 2022-04-29T21:48:28+05:30 IST

సమాజంలో శాంతి, సామరస్యాలు, మానవతావాద

కష్ట కాలంలో ఏకతాటిపైకి రాలేరా? : శ్రీ శ్రీ రవిశంకర్

న్యూఢిల్లీ : సమాజంలో శాంతి, సామరస్యాలు, మానవతావాద విలువలు, పరస్పర నమ్మకం కోసం; చీకటిని, అపనమ్మకాన్ని తొలగించడం కోసం కృషి చేయాలని  ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రపంచ శాంతికాముకులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27 బుధవారం జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ‘ఐ స్టాండ్ విత్ పీస్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 


ఏదైనా సంక్షోభం వచ్చినపుడు, ముప్పు ఉందని భావించినపుడు, లేదా, వివేకంతో ఆలోచించినపుడు ప్రజలు ఏకతాటిపైకి వస్తారన్నారు. సమాజంలో శాంతిని సృష్టించగలిగేదాని కోసం, సకారాత్మక అంశం కోసం ప్రజలు కలిసి రాలేరా? అనేది తన ప్రశ్న అని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి అనంతర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం, మానసికంగా కోలుకునే సామర్థ్యాలను పెంచవలసిన అవసరం ఉందన్నారు. శాంతికి మద్దతుగా నిలవాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోగలిగితే, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే, ప్రపంచ శాంతిని మనం సాకారం చేయవచ్చునని చెప్పారు. వ్యక్తిగత శాంతి లేకుండా ప్రపంచ శాంతి సాధ్యం కాదన్నారు. భారతీయ విలువలైన శాంతి, ప్రేమ, మానవత్వం గురించి  ‘ఐ స్టాండ్ విత్ పీస్’ కార్యక్రమంలో భాగంగా అందరికీ వివరించాలని పిలుపునిచ్చారు. 


అపనమ్మకమే ఘర్షణలకు కారణం

గతంలో జరిగిన యుద్దాలు, ఘర్షణలకు కారణాల గురించి మాట్లాడుతూ, నమ్మకం చెడినపుడు, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయినపుడు ఘర్షణలు జరిగేవన్నారు. ప్రతి దోషి లోపల సహాయం కోసం రోదించే ఓ బాధితుడు ఉంటాడని తాను విశ్వసిస్తానని చెప్పారు. 


శ్రీ శ్రీ రవిశంకర్ యూరోపు-జర్మనీ, పోలండ్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించారు. అనేక వేల మందిని ఉద్దేశించి మాట్లాడారు. విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, వేలాది మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లతో ఆయన మాట్లాడారు. ఈ వాలంటీర్లు కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ ప్రజలకు అనేక సేవలు అందించారు. ఆయన వచ్చే నెలలో అమెరికాలో పర్యటిస్తారు. 


సురక్షిత ప్రపంచం

సురక్షిత, హింసారహిత, ఒత్తిళ్ళులేని ప్రపంచాన్ని సృష్టించాలన్న లక్ష్యంతో ఆయన కృషి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గిల్లెస్ కార్బొన్నియెర్‌ ఆయనను కలిసిన అనంతరం ఇచ్చిన ట్వీట్‌లో, నేటి యుద్ధాలు, ఘర్షణల పరిస్థితుల్లో తాము మానవతావాద, శాంతి ప్రయత్నాల గురించి చర్చించామని తెలిపారు. మానవతావాద సిద్ధాంతాలు, వివిధ మతపరమైన సూత్రాల మధ్య గల సారూప్యత, భవిష్యత్తులో మార్పులకు గల అవకాశాల గురించి చర్చించినట్లు చెప్పారు. 


శ్రీ శ్రీ రవిశంకర్ స్థాపించిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యుమన్ వాల్యూస్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐరాస డైరెక్టర్ జనరల్ తాతియాన వలొవయ, ఐరాసకు భారత శాశ్వత సభ్యురాలు ఇంద్రమణి పాండే పాల్గొన్నారు. ఈ సంస్థ నిర్మించిన సేవా కేంద్రాలు లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. కోవిడ్ బాధితుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. 


Updated Date - 2022-04-29T21:48:28+05:30 IST