వైద్యుల్లేని ఏఆర్టీ!

ABN , First Publish Date - 2021-07-21T06:04:39+05:30 IST

వీరంతా హెచ్‌ఐవీ బాధితులు.

వైద్యుల్లేని ఏఆర్టీ!
పాత ప్రభుత్వాస్పత్రి ఏఆర్టీ సెంటర్లో మందుల కోసం క్యూ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత

హెచ్‌ఐవీ బాధితులకు అందని వైద్యసేవలు 

కౌన్సెలింగ్‌ లేక కుంగిపొతున్న వారెందరో 


వీరంతా హెచ్‌ఐవీ బాధితులు. విజయవాడ పాత, కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రిట్రో వైరల్‌ ట్రీట్‌మెంట్‌ (ఏఆర్టీ) మందు కోసం వచ్చే వీరి గోడు ఆలకించేవారే లేరు. వీరి ప్రాణాలను నిలబెట్టే మందులను ఉచితంగా ఇస్తున్నప్పటికీ, వ్యాధి తీవ్రతను గుర్తించి, అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇక్కడ వైద్యులు లేరు.. మానసికంగా కుంగిపోయేవారికి ధైర్యం చెప్పే కౌన్సెలింగ్‌ సిబ్బందీ లేరు.  


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆరోగ్యకరమైన ఆహారం, వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా మందులను తీసుకోవడం ద్వారానే హెచ్‌ఐవీ బాధితులు జీవితకాలాన్ని పొడిగించుకుంటారు. వీరు జీవితాంతం వాడాల్సిన ఏఆర్‌టీ మందులు ఖరీదైనవి కావడంతో వాటిని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేనివారు ప్రతి రోజూ వందల సంఖ్యలో విజయవాడ పాత, కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న యాంటీ రిట్రో వైరల్‌ ట్రీట్‌మెంట్‌ (ఏఆర్టీ) సెంటర్‌కు వచ్చి ఉచితంగానే తీసుకువెళుతుంటారు. అయితే ఇక్కడ వైద్య సిబ్బంది కొరత కారణంగా వీరు ఇబ్బందులకు గురవుతున్నారు.


వైద్యులు, సిబ్బంది కొరత 

హెచ్‌ఐవీ బాధితులకు వైద్యసేవలను, ఖరీదైన మందులను ఉచితంగా అందజేయడంతోపాటు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో 2006లో విజయవాడ కొత్త, పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్టీ సెంటర్లను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఒక్కొక్క సెంటర్లో ముగ్గురు మెడికల్‌ ఆఫీసర్లు విధులు నిర్వహించగా... ప్రస్తుతం ఒక్క డాక్టరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లతోపాటు స్టాఫ్‌ నర్సులు, కౌన్సిలర్లు, డేటా మేనేజరు, కేర్‌ కో-ఆర్టినేటరు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.


మందులకూ కొరతే..

ఏఆర్టీ మందులను నెలకు సరిపడా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మందుల కొరత ఉందంటూ సిబ్బంది 15 రోజులకు సరిపడేలా మందులను ఇచ్చి పంపేస్తున్నారు. ఏఆర్టీ సెంటర్లకు రోజుకు 300 నుంచి 500 మంది వరకు వస్తున్నారు. వీరందరికీ కౌన్సెలింగ్‌, మందుల వినియోగంలో సలహాలు ఇవ్వవలసిన సిబ్బంది పనిభారం కారణంగా తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 


ఒక్కపూట మందులు వాడకపోయినా ప్రమాదమే.. 

హెచ్‌ఐవీ బాధితులు వైద్యుల సూచనలు, సలహాల మేరకే మందులను వాడాలి. ఆ మందులను వాడటం మొదలు పెడితే జీవితాంతం క్రమం తప్పకుండా వాడాల్సిందే. ఒక హెచ్‌ఐవీ బాధితుడు రెండు రోజులు ఏఆర్టీ మందులు వాడకపోతే వ్యాధి తీవ్రత 15 శాతం పెరుగుతుంది. నెల రోజులపాటు మందులు వాడకపోతే వ్యాధి తీవ్రత 50 శాతం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు తగిన కౌన్సెలింగ్‌, వైద్యుల సలహాలు ఎంత కీలకమో చెప్పనవసరం లేదు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇకనైనా చొరవ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఏఆర్టీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-21T06:04:39+05:30 IST