పైసా తీసుకోకుండా ఆస్పత్రికి చేరుస్తూ...

ABN , First Publish Date - 2020-09-12T05:30:00+05:30 IST

కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్లను ఆస్పత్రికి తరలించేందుకు ఆటోలు, క్యాబ్‌ల వారే కాదు అంబులెన్స్‌ డ్రైవర్లు సైతం వెనకడుగు వేస్తున్న వేళ ఆమె ధైర్యంగా ముందుకొచ్చారు.

పైసా తీసుకోకుండా ఆస్పత్రికి చేరుస్తూ...

కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్లను ఆస్పత్రికి తరలించేందుకు ఆటోలు, క్యాబ్‌ల వారే కాదు అంబులెన్స్‌ డ్రైవర్లు సైతం వెనకడుగు వేస్తున్న వేళ ఆమె ధైర్యంగా ముందుకొచ్చారు. వారిని తన ఎలక్ర్టిక్‌ రిక్షాలో ఆస్పత్రికి తీసుకువెళుతున్నారు. అందుకు వారి దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోవడం లేదు. సాటిమనిషి కష్టాన్ని అర్థం చేసుకొనే మనసు, అవసరంలో సాయం చేసే గుణం ఉన్న నలభై ఎనిమిదేళ్ల మున్మున్‌ సర్కార్‌ విశేషాలివి.


‘‘మున్మున్‌ చాలా గొప్ప పనిచేస్తున్నారు. కరోనా సోకిన వారి దగ్గరకు వెళ్లడానికే అందరూ భయపడుతున్న సమయంలో ఆమె ధైర్యంగా వారిని ఆస్పత్రికి తీసుకెళుతున్నారు’’ అంటున్నారు అనిర్బన్‌ రాయ్‌ అనే వైద్యుడు. 


కరోనా సోకిన వాళ్లలో కొందరినీ ప్రభుత్వం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుంది. మరికొందరు తమంత తాముగా ఆస్పత్రికి వెళుతుంటారు. అయితే వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ఆటో, క్యాబ్‌ వాళ్లు ఎవరూ ముందుకు రారు. వచ్చినా ఎక్కువ మొత్తంలో డబ్బు అడుగుతారు. మందులేని రోగం వచ్చిందని ఇరుగుపొరుగు వారిని దూరం పెట్టడం, సమయానికి ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడం వారిని మానసిక వేదనకు గురిచేస్తాయి. ఇవన్నీ పశ్చిమబెంగాల్‌  డార్జిలింగ్‌ జిల్లాలోని సిలిగురికి చెందిన మున్మున్‌ సర్కార్‌ను ఆలోచనల్లో పడేశాయి. సిలిగురిలో ఎలక్ర్టిక్‌ రిక్షా నడిపిన తొలి మహిళ ఆమె. గత ఆరున్నర ఏళ్లుగా రిక్షా నడుపుతున్న ఆమె ఇప్పుడు ఈ-రిక్షా (స్థానికంగా ‘టోటో’ అని పిలుస్తారు)నడిపే మహిళల బృందానికి నాయకురాలు. తన రిక్షాలో ఆహారం, ఆపదలో ఉన్నవారికి అవసరమైన వస్తువులను వారి దగ్గరకు చేరవేస్తారు. అందరితో కలపుగోలుగా ఉండే ఆమెను అంతా ‘మునియా దీదీ’ అని పిలుస్తారు. 


అవాంతరాలు ఎదురైనా...

సిలిగురిలోని శక్తిగర్‌ ప్రాంతంలో ఉంటున్న మున్మున్‌ 12 వరకు చదవుకున్నారు. ఆమె భర్త ఆనందా సర్కార్‌. వీరికి ఇద్దరు పిల్లలు. మున్మున్‌ మొదటి నుంచీ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మహిళలు తమ కాళ్లమీద తాము నిలబడాలనేది ఆమె అభిప్రాయం. మాటలతో సరిపుచ్చడం కాదు చేతల్లో చూపించి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఎలక్ర్టిక్‌ రిక్షా నడపడం మొదలెట్టారు. ఆమెను చూసి మరొకొందరు మహిళలు ఈ రిక్షా నడిపేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు సిలిగురిలో 118 మంది మహిళలు ఈ-రిక్షా నడుపుతున్నారంటే అందుకు కారణం మున్మునే. ‘‘కరోనా బారినపడ్డ వారిని నా ఎలక్ర్టిక్‌ రిక్షాలో ఆస్పత్రికి తరలిస్తున్న కొత్తలో స్థానిక కౌన్సిలర్‌ నన్ను అడ్డుకున్నారు. ఇరుగుపొరుగు నన్ను, మా కుటుంబాన్ని తిట్టడం మొదలెట్టారు. అయినా నేను వెనక్కితగ్గలేదు. ఇంట్లోవాళ్లు కూడా నాకు మద్దతుగా నిలిచారు. ఏ విధమైన పరిణామాలననైనా ఎదుర్కొనేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకూ వందల మంది కరోనా బాధితులను ఆస్పత్రికి చేర్చాను. వారిలో ఒక్కరు మాత్రమే చికిత్స పొందుతూ చనిపోయారు. చాలామంది దాతలు నాకు పీపీఈ కిట్స్‌ అందించి ప్రోత్సహిస్తున్నారు. నా డ్రైవింగ్‌ సీట్లో ఎప్పుడూ పీపీఈ కిట్‌ ఉంటుంది. సీటు వెనక భాగం ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పి ఉంటుంది. నా రక్షణ జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వచ్చిన వాళ్లను హాస్పిటల్‌కు చేరుస్తున్నాను. రోజు నా వాహనాన్ని శానిటైజ్‌ చేస్తాను. అందుకు ఎక్కువగా ఖర్చవుతుంది’’ అని చెబుతారు మున్మున్‌ సర్కార్‌. నిస్వార్ధంగా ఆమె చేస్తున్న పనిని ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST