12 గంటల్లోగా ఇళ్లకు చేరండి

ABN , First Publish Date - 2021-05-05T05:26:04+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం నుంచి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయనున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు.

12 గంటల్లోగా ఇళ్లకు చేరండి

మధ్యాహ్నం 12 గంటల నుంచి

మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ

ఉదయం 6 నుంచి 12 వరకూ దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి

ఆ తరువాత ఎవరూ రోడ్లపై కనిపించకూడదు

పకడ్బందీగా అమలుచేస్తాం

11.30 నుంచే పెట్రోలింగ్‌ ప్రారంభం

మెడికల్‌, రైల్వే, నేవీ, ప్రెస్‌, ఐటీ వంటి అత్యవసర రంగాలకు మినహాయింపు

మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా

మూడు షిప్టుల్లో సిబ్బంది విధులు

దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలి 

‘ఆంధ్రజ్యోతి’తో నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా


విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం నుంచి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయనున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే కర్ఫ్యూ ప్రారంభమవుతుందని, ఆలోగానే అందరూ ఇళ్లకు చేరిపోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఆయన మంగళవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ కర్ఫ్యూ అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. వైద్యం, ఐటీ, మీడియా, రైల్వే, నేవీ, హెచ్‌పీసీఎల్‌, స్టీల్‌ప్లాంట్‌ వంటి అత్యవసర రంగాల్లో పనిచేసే వారికి మినహాయింపు ఉంటుందన్నారు. మొదటి మూడు రోజుల్లో వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అంతవరకూ ప్రజలపై జరిమానాలు విధించబోమని, కర్ఫ్యూపై అవగాహన పెంచేలా కృషిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశామన్నారు.


6-12 గంటల వరకూ దుకాణాలకు అనుమతి

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు, మార్కెట్లు, రెస్టారెంట్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తెరుచుకోవాల్సి ఉంటుందన్నారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎలాంటి దుకాణాలను అనుమతించే ప్రసక్తి వుండదని సీపీ తెలిపారు. అందుకోసం తమ సిబ్బంది ఉదయం 11.30 గంటల నుంచే పెట్రోలింగ్‌ ప్రారంభించి, దుకాణాలను 12 గంటలకల్లా మూసేయాలని అనౌన్స్‌మెంట్‌ చేస్తారన్నారు. 


వీరికి మినహాయింపు

ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌ కాస్టింగ్‌ సర్వీసులు, పెట్రోల్‌బంకులు, ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ర్టిబ్యూషన్‌, నీటి సరఫరా, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, కోల్డ్‌ స్టోరేజీలు, వేర్‌హౌసింగ్‌ సర్వీసు, ఆస్పత్రులు, వైద్య, ఆరోగ్య శాఖ వంటి అత్యవసర రంగాలకు చెందిన వారికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని, పోలీస్‌ సిబ్బందికి గుర్తింపు కార్డులను చూపిస్తే వారిని విడిచిపెట్టేస్తారని సీపీ తెలిపారు.


రద్దీ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా

చేపల మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టనున్నట్టు సీపీ వివరించారు. నిర్ణీత సమయం తర్వాత అక్కడ ఇంకా ఏవైనా కార్యకలాపాలు నడుస్తున్నాయా?, ఎవరైనా తిరుగుతున్నారా? అనే దానిని స్పెషల్‌బ్రాంచి విభాగం సిబ్బంది డ్రోన్లతో పరిశీలించి సమాచారం కంట్రోల్‌రూమ్‌కు అందజేస్తారన్నారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధి సిబ్బంది అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుంటారన్నారు.


కంట్రోల్‌రూమ్‌ నుంచి పర్యవేక్షణ

పోలీసులు రోడ్లపై నిలబడి ప్రజలకు కనిపిస్తూ కర్ఫ్యూ అమలు చేయడం కంటే కంట్రోల్‌రూమ్‌ నుంచి అమలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సీపీ తెలిపారు. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినందున వాటన్నింటికీ కంట్రోల్‌రూమ్‌తో అనుసంధానం చేశామన్నారు. వాటి ద్వారా వచ్చే ఫీడ్‌ను కంట్రోల్‌రూమ్‌లో సిబ్బంది పరిశీలించి ఎక్కడైనా నిబంధనలు పాటించనట్టు గుర్తిస్తే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 


మూడు షిఫ్టుల్లో సిబ్బంది

నగరంలోని లా అండ్‌ ఆర్డర్‌ సిబ్బందిని మూడు షిఫ్టులుగా విభజించామన్నారు. ఉదయం ఆరు నుంచి 12 గంటలకు వరకూ ఒక షిఫ్టు, 12 నుంచి పది గంటల వరకూ ఒక షిఫ్టు, పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకూ ఒక షిప్టుగా విభజించామన్నారు. ఉదయం ఆరు నుంచి 12 గంటల వరకూ విధులు నిర్వర్తించే సిబ్బంది సూపర్‌మార్కెట్లు, కిరణా దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌ వద్దకు వెళ్లి కొనుగోలుదారులు రద్దీగా వుంటే వారిని క్యూలో ఉంచడం, భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయించడం వంటి వాటిపై అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి అవగాహన కల్పిస్తారన్నారు. తప్పనిసరి అయితే అక్కడి యజమాని లేదా యాజమాన్యంపై కేసులు నమోదుచేస్తామన్నారు. మద్యం దుకాణాలు, బార్ల వద్ద సెబ్‌ అధికారులు, సిబ్బంది ప్రత్యేక నిఘా పెడతారని సీపీ వివరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ పనిచేసే సిబ్బంది కర్ఫ్యూ అమలుకు వ్యాపారులు, ఇతర యూనియన్ల సహకారంతో ముందుకువెళతారన్నారు. అలాగే మైక్‌ సిస్టమ్‌ ద్వారా కర్ఫ్యూపై ప్రజలకు అవగాహన కల్పించడం, 11.30 నుంచే దుకాణాలను మూసివేయించడం, రోడ్లపై వున్నవారిని ఇంటికి పంపించేయడం వంటి చర్యలు తీసుకుంటారని సీపీ తెలిపారు. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము ఆరు గంటల వరకూ పనిచేసే సిబ్బంది, దుకాణాల్లో చోరీలు జరగకుండా పెట్రోలింగ్‌ చేస్తారన్నారు. 


Updated Date - 2021-05-05T05:26:04+05:30 IST