డ్రగ్స్‌ రవాణా కేసుల్లో పట్టుబడి.. జైళ్లలో తెలుగు వాళ్లు!

ABN , First Publish Date - 2021-04-15T09:22:47+05:30 IST

డ్రగ్స్‌ ముఠాల వలలో చిక్కుకుంటున్న తెలుగు ప్రవాసీలు.. గల్ఫ్‌ జైళ్లలో మగ్గిపోతున్నారు.

డ్రగ్స్‌ రవాణా కేసుల్లో పట్టుబడి.. జైళ్లలో తెలుగు వాళ్లు!

  • వ్యూహాత్మకంగా ఇరికిస్తున్న ముఠాలు
  • ట్రావెల్‌ ప్రొఫైల్‌ కోసం వచ్చే వారే లక్ష్యం
  • చివరి నిమిషంలో బ్యాగుల అందజేత
  • తనిఖీల్లో పట్టుబడుతున్న అమాయకులు

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): డ్రగ్స్‌ ముఠాల వలలో చిక్కుకుంటున్న తెలుగు ప్రవాసీలు.. గల్ఫ్‌ జైళ్లలో మగ్గిపోతున్నారు. వీరిలో కొందరు తమ కేసులను పునఃసమీక్షించాలని స్థానిక ప్రభుత్వాలను కోరుతుండగా, ఈ విషయాన్ని భారత పోలీసుల దృష్టికి తీసుకెళ్లొదంటూ వారి కుటుంబాలపై స్మగ్లింగ్‌ ముఠాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా వంటి దేశాల వీసాలు పొందాలనుకునే వారు.. ట్రావెల్‌ ప్రొఫైల్‌ కోసం ముందుగా గల్ఫ్‌ దేశాలను సందర్శిస్తుంటారు. అలాంటి వారితోపాటు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుంటున్న డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ముఠాలు.. వారికి తెలియకుండానే పలు రకాల డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నాయి. గల్ఫ్‌ దేశాల్లోని నిబంధనల కారణంగా వాటిని రవాణా చేస్తూ పట్టుబడ్డ వారికి కఠిన శిక్షలు పడుతున్నాయి. తాజాగా మాదక ద్రవ్యాల రవాణా కేసులో పదేళ్ల జైలు శిక్ష పడిన ముంబై దంపతులు ఇటీవల విడుదల కావడం.. ఇలాంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న తెలుగు ప్రవాసీల్లో ఆశలు రేకెత్తించింది. తమను డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ముఠాలు వ్యూహాత్మకంగా ఇరికించి జైలు పాలు చేశాయని, తమ కేసులను పునఃసమీక్షించాలని వారు కోరుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు రెండు వేర్వేరు డ్రగ్స్‌ రవాణా కేసుల్లో పట్టుబడి కొన్నాళ్లుగా ఖతర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దోహాకు బయలుదేరే ముందు సమీప బంధువు ఒకరు ఓ బ్యాగు ఇచ్చాడని, అందులో ఏముందో తెలుసుకోకుండా తీసుకొచ్చి తాను ఇరుక్కుపోయానని అంబర్‌పేటకు చెందిన యువకుడు వాపోతున్నారు. 


అక్కడి కోర్టు సదరు యువకుడికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.41.5లక్షల జరిమానా విధించింది. ఒకవైపు ఖతర్‌లో అతడు శిక్ష అనుభవిస్తుండగా, భారత్‌లో ఎవరికీ ఫిర్యాదు చేయొద్దంటూ బ్యాగు అందించిన సమీప బంధువు అతడి కుటుంబంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ‘‘మా కొడుకు అమాయకుడు. అమెరికా లేదా కెనడా వెళ్లేందుకు వీసా సులభంగా దొరకాలంటే ట్రావెల్‌ ప్రొఫైల్‌ ఉండాలని చెప్పారు. దాంతో నాలుగు రోజుల పర్యటన కోసం ఖతర్‌ వెళ్లగా.. డ్రగ్స్‌ కేసులో ఇరికించారు’’ అని అతడి కుటుంబం వాదిస్తోంది. స్మగ్లింగ్‌ ముఠా కారణంగానే తమ కుమారుడికి శిక్ష పడిందంటూ అతడి తల్లిదండ్రులు ఇటీవల ఖతర్‌ ప్రభుత్వానికి పిటిషన్‌ పంపారు. ముంబై దంపతుల కేసులో వారిని ఇరికించిన మేనత్త సహా మొత్తం ముఠాను జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్ధ (ఎన్‌సీబీ) పూర్తి సాక్ష్యధారాలతో అరెస్టు చేసి చార్జిషీట్‌ దాఖలు చేసింది. సదరు పత్రాలను అరబ్‌ భాషలోకి అనువదించి మరీ ఖతర్‌ న్యాయస్థానానికి సమర్పించడంతో వారు విడుదలయ్యారు. కానీ, హైదరాబాద్‌ కేసులో ఆ దిశగా అడుగులే పడలేదు. దీంతో అతడి తల్లిదండ్రులు కేవలం క్షమాభిక్ష ప్రసాదించాలని మాత్రమే కోరారు. మరో కేసులో చాంద్రాయణగుట్టకు చెందిన నలుగురికి కూడా ఖతర్‌ కోర్టు జైలుశిక్ష విధించింది. చివరి క్షణంలో ఇచ్చిన బ్యాగులను తీసుకొచ్చి మోసపోయామని వారు చెబుతున్నారు.


 మరి కొందరు...

దుబాయ్‌కి డ్రగ్స్‌ రవాణా చేసిన కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి విడుదలై స్వదేశానికి వెళ్లిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పూసల శ్రీనివాస్‌... తనకు పార్సిల్‌ ఇచ్చిన వ్యక్తి ఇంటి ఎదుట ధర్నా చేశారు. దీంతో పంచాయితీ పెట్టి రూ.5 లక్షలు ఇప్పించి, అసలు నిందితులను పోలీసులు వదిలిపెట్టారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి కేసులోనే కామారెడ్డి జిల్లాకు చెందిన కుమ్మరి లింగం దుబాయ్‌లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. కువైత్‌లో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన అనేక మంది ఇలాగే జైళ్లలో మగ్గుతున్నారు.

Updated Date - 2021-04-15T09:22:47+05:30 IST