Abn logo
Jul 24 2021 @ 23:16PM

దారి దోపిడీ దొంగల అరెస్టు

దోపిడీదారుల నుంచి స్వాఽధీనం చేసుకున్న బైక్‌లు

కడప (క్రైం), జూలై 24 : కడప-కర్నూలు నేషనల్‌ హైవే రోడ్డులోని ఖాజీపేట సమీపంలోని భూమాయపల్లె డాబా వద్ద లారీల్లో ఉన్న డ్రైవర్లను బెదిరించి వారి వద్ద నుంచి నగదు లాక్కెళ్లిన దారి దోపిడీ దొంగలను ఖాజీపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ అన్బురాజన్‌, ఓఎస్డీ దేవప్రసాద్‌, మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరు టౌన్‌ నాగేంద్రనగర్‌లోని పుట్టవీధికి చెందిన షేక్‌ ముబారక్‌ అదే ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అస్లాం, నేతాజీనగర్‌కు చెందిన షేక్‌ సద్దాం, రామేశ్వరంకు చెందిన ఎం.శ్రీనివాసరాజులు స్నేహితులుగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిలో శ్రీనివాసరాజు, షేక్‌ సద్దాంలు అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా డిగ్రీ చదువుతున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ వీరు రాత్రుళ్ల సమయంలో హైవేపై తిరుగుతూ ఆగి ఉన్న లారీల వద్దకు వెళ్లి డ్రైవర్లను కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న నగదు దోచుకెళుతున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఖాజీపేట సమీపంలో ఓ లారీని ఆపి డ్రైవర్‌ నిద్రపోతుండగా ఈ నలుగురు డ్రైవరును కత్తితో బెదిరించి దాడి చేసి రూ.5 వేలు దోపిడీ చేసినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి 12.30కు మరో లారీ డ్రైవరును కత్తితో బెదిరించి అతడి వద్ద కూడా రూ.500 దోపిడీ చేసి అక్కడి నుంచి పారిపోయారు. లారీ డ్రైవరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. శుక్రవారం వీరు ఖాజీపేట సమీపంలో తిరుగుతుండగా మైదుకూరు డీఎస్పీ ఆధ్వర్యంలో మైదుకూరు రూరల్‌ సీఐ కొండారెడ్డి, ఖాజీపేట ఎస్‌ఐ కుళ్లాయప్ప తమ సిబ్బందితో నలుగురిని అరెస్టు చేశారన్నారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, కత్తి, కర్రలు, రూ.4 వేలు నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులను అందించారు.