ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-11-01T07:03:31+05:30 IST

ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్‌ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్‌ దత్‌ వెల్లడించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు

ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్‌

14 జిలిటిన్‌ స్టిక్స్‌, మూడు డిటోనేటరు స్వాధీనం 


కొత్తగూడెం, అక్టోబరు 31: ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్‌ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్‌ దత్‌ వెల్లడించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మణుగూరు ఏరియా కమిటీ మావోయిస్టు లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ కమాండర్‌ (ఎల్‌జీసీ) మడివి మంగాలు అలియాస్‌ జిలాల్‌, మడకం దేశి అలియాస్‌ మమతక్కను అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక బార్మర్‌ తుపాకీ, ఒక మొబైల్‌ ఫోన్‌, మూడు పెన్‌ డ్రైవ్‌లు, ఒక కార్డ్‌ రీడర్‌, నాలుగు కనెక్టర్లు, మాన్‌పాక్‌, 14 జిలెటిన్‌ స్టిక్స్‌, మూడు డిటోనేటర్లు, ఒక టిఫిన్‌ బాక్స్‌, 75 మీటర్ల వైరు, మూడు బ్యాటరీలు, మావోయిస్టు విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తిర్లాపూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలున్నట్టు సమాచారం రాగా ఏడూళ్ల బయ్యారం స్పెషల్‌ పార్టీ సిబ్బంది కూంబింగ్‌ నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న   ఒక మగ, ఆడ వ్యక్తులను గుర్తించామని తెలిపారు. వారి చేతుల్లో సంచులతోపాటు తుపాకీని స్వాధీనం చేసుకొని విచారించగా, వారు నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులుగా నిర్ధారణ అయిందని వివరించారు.  గతంలో మడవి మంగాలు 60 కేసుల్లో నిందితుడు కాగా, వాటిలో 16 హత్య కేసులు, 19 హత్యాయత్నం కేసులు, మందుపాతర్లు పేల్చిన ఘటనలో, ఐదు కిడ్నాప్‌ కేసుల్లో మొదలైనవి వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో నమోదయ్యాయని తెలిపారు.


15 సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉంటూ వివిధ పార్టీలో పని చేశాడని తెలిపారు. మడకం దేశీ గత మూడేళ్లుగా మావోయిస్టు పార్టీల్లో అజ్ఞాతంలో ఉంటూ 17 కేసుల్లో ఉందని పేర్కొన్నారు. ఈమె సుకుమా, బీజాపూర్‌, బస్తర్‌ జిల్లాల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో నిందితురాలుగా గుర్తించినట్లు చెప్పారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులైన చంద్రన్న, హరిభూషణ్‌, ఆజాద్‌, దామోదర్‌ అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వ్యాపారస్తులకు లేఖలు రాస్తూ బెదిరిస్తున్న సమాచారాలు పోలీస్‌శాఖకు ఎప్పటికప్పుడు తెలుస్తోందని అన్నారు. మావోయిస్టుల సిద్ధాంతాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి కలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. మావోయిస్టులకు ప్రజలు సహకరించవద్దని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏడూళ్ల బయ్యారం, పాల్వంచ సీఐలు దోమల రమేష్‌, టి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T07:03:31+05:30 IST