టీడీపీ నేతల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-20T05:17:13+05:30 IST

పలాసలో టీడీపీ నేత గురిటి సూర్యనారాయణకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఆ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలాస వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధించారు. టీడీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ ఆపేశారు. లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం టీడీపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని టెక్కలికి తరలించారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను కూడా అరెస్టు చేసి మందస పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

టీడీపీ నేతల అరెస్టు
లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద అచ్చెన్న, రామ్మోహన్‌నాయుడు, టీడీపీ నేతల వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు

- లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద హైటెన్షన్‌
- అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడి వాహనాల అడ్డగింత
-  ఇద్దరినీ టెక్కలి పోలీసుస్టేషన్‌కు తరలించిన పోలీసులు
-  పలాస వెళ్లే రోడ్లన్నీ అదుపులోకి తీసుకున్న వైనం
-  టీడీపీ శ్రేణులను రానివ్వకుండా అడ్డంకులు
(పలాస, ఆగస్టు 19)

పలాసలో టీడీపీ నేత గురిటి సూర్యనారాయణకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఆ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలాస వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధించారు. టీడీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ ఆపేశారు. లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం టీడీపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని టెక్కలికి తరలించారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను కూడా అరెస్టు చేసి మందస పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

................

పలాస మండలం లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలాసలో టీడీపీ సీనియర్‌ నాయకుడు, కౌన్సిలర్‌, మాజీ వైస్‌చైర్మన్‌ గురిటి సూర్యనారాయణ ఇళ్లను అధికారులు గురువారం కూల్చేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల చర్యలపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. శుక్రవారం సూర్యనారాయణకు సంఘీ భావం తెలిపేందుకు పలాస-కాశీబుగ్గ వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టు లకు శ్రీకారం చుట్టారు. లక్ష్మీపురం టోల్‌ప్లాజాతో పాటు అన్నీ ప్రధాన రోడ్లలో పోలీసులు పహారా పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష, మాజీ మంత్రి గౌతు శివాజీ, సీనియర్‌ నాయకుడు చౌదిరి బాబ్జితో పాటు ఇతర టీడీపీ నాయకులు వాహనాల్లో వస్తుండగా పోలీ సులు వారిని అడ్డుకున్నారు. శాంతిభధ్రతలకు విఘాతం కలుగు తుందని, పలాస-కాశీబుగ్గ రావద్దని హెచ్చరించారు. ఈ సంద ర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతు తమ నాయకులకు అన్యా యం జరిగితే వెళ్లి పరామర్శించడం తప్పా అని ప్రశ్నించారు. తాము వెళ్లితీరుతామని భీష్మించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలె త్తాయి. పోలీసులు ముందస్తు నోటీసులు అచ్చెన్నాయుడుకు ఇచ్చి ఆయన తో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడిని అదుపులోకి తీసు కుని టెక్కలి పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో టీడీపీ నాయ కులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి సీదిరి అప్పలరాజే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వైసీపీ నాయకు లకు తగురీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

మందసకు ఎమ్మెల్యే అశోక్‌ తరలింపు
పలాసలో సూర్యనారాయణకు సంఘీభావం తెలిపేందుకు ఎమ్మెల్యే అశోక్‌కుమార్‌ గురువారం అర్ధరాత్రి వచ్చారు. వైసీపీ నాయకుల తీరును దుయ్యబట్టారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఆ పార్టీ నాయకుల ఆగడాలు పెట్రేగిపోతున్నాయని, ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. వైసీపీ నాయకులు ఆ ప్రాంతానికి చేరి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు అశోక్‌ను వెళ్లిపోవాలని కోరారు. వ్యవహారం కుదుటపడేవరకు తాను ఇక్కడ నుంచి కదిలేది లేదని ఎమ్మెల్యే చెప్పడంతో పోలీసులు ఆయనతో వాదనకు దిగారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అశోక్‌ను ప్రత్యేక పోలీసుల సహాయంతో బలవంతంగా జీపు ఎక్కించి మందసకు తరలించారు. అనంతరం సూర్యనారాయణ ఇంటిని కూల్చేదిలేదని తహసీల్దార్‌ స్పష్టమైన హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు ఆందోళన విరమించారు.

నిమ్మాడలో అచ్చెన్న గృహ నిర్బంధం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడలో గృహ నిర్బంధం చేశారు. పలాసలో టీడీపీ నేతలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఆయనను లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా అదుపులోకి తీసుకుని.. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆయన స్వగృహానికి తరలించారు. అచ్చెన్న ఇంటి వద్ద టెక్కలి సీఐ ఎంవీ గణేష్‌, కోటబొమ్మాళి ఎస్‌ఐ ఖాదర్‌భాషా, పోలీసులు శుక్రవారం సాయంత్రం వరకు బందోబస్తు నిర్వహించారు.

నేను వెళ్లేందుకు స్వేచ్ఛలేదా?
నన్ను పోలీసులు నిర్బంధించడం తగదు. పరామర్శకు వెళ్లేందుకు కూడా స్వేచ్ఛ లేదా? వాస్తవానికి ఎక్కడికి వెళ్తున్నానో వారికి తెలియదు. నేను వెళ్లి లా అండ్‌ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే అరెస్టు చేయాలని ఎస్పీకి చెప్పాను. వైసీపీ నాయకుల చెప్పినట్లు పోలీసులు అడ్డుకోవడం దారుణం. ఈ వ్యవహారాన్ని ఇంతటితో విడిచిపెట్టడం జరగదు. అవసరమైతే కోర్టుకు వెళతాను. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలపాల్సిన బాధ్యత పోలీసులదే.
- కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

నోటీసులు ఇవ్వకుండా కూలగొడతారా?:
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 21 సంవత్సరాలుగా ఉంటున్న గురిటి సూర్యనారాయణ ఇంటితో పాటు ఆ ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లు ఎలా కూలగొడతారు? పలాస టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసేందుకు ఇక్కడి వైసీపీ నాయకులు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.  భూ కబ్జాలు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని మా పార్టీ నాయకులు పోరాటం చేస్తే సహించలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. బాధితులకు అండగా ఉంటాం.
- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎంపీ

మంత్రి క్షమాపణ చెప్పాలి
రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు చూస్తే పశువులు పాలిస్తున్నట్లుగా ఉంది. పలాసలో అది స్పష్టమైంది. నేను మంత్రికి ఎందుకు క్షమాపణ చెప్పాలి. నా తండ్రితో పాటు స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్నపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని ముందు నేను చేసిన వ్యాఖ్యలు పెద్దవి కావు, అందుకే ఆయనే ముందుగా మాకు క్షమాపణ చెప్పాలి. ఆక్రమణలపై మేము స్పష్టమైన వైఖరితో ఉన్నాం. కొండలు, గుట్టల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి.
- గౌతు శిరీష, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కక్షసాధింపు మానుకోవాలి : ఎమ్మెల్యే అశోక్‌
కవిటి, ఆగస్టు 19: కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. పలాసలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్‌ను కవిటి మండలం రామయ్యపుట్టుగలో ఎస్‌ఐ రాము, పోలీసులు గృహ నిర్బంధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘జిల్లాలో రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితంగా ఉండేవి. కానీ, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. టీడీపీ కౌన్సిలర్‌ సూర్యనారాయణ ఇళ్లను కూల్చివేసేందుకు యత్నించడం అన్యాయం. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా.. బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం మానుకోవాలి. అహంకారంతో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ‘గడపగడపకూ మన ప్రభుత్వం’లో సమస్యలపై నిలదీస్తున్న ప్రజలకు సంక్షేమ పథకాలు నిలిపివేయడం సరికాదు. అధికారుల తీరును సైతం ప్రజలు గమనిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు మానుకుని.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి’’ అని సూచించారు. అశోక్‌కు మాజీమంత్రి గౌతు శివాజీ, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మణిచంద్ర ప్రకాష్‌, బాసుదేవు రౌళో, సంతోష్‌, బి.చినబాబు, పి.తవిటయ్య, జానీ, కె.శంకర్‌, ఎల్‌.శ్రీను, బి.తిరుమల, టి.హరి, బాసు ప్రధాన్‌ పాల్గొన్నారు.


వైసీపీ రంగులేసుకున్న అధికారులను విడిచిపెట్టం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 19: వైసీపీ రంగులేసుకుని.. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను విడిచిపెట్టేదిలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం పలాసలో బాధితులకు ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న రవికుమార్‌ను పోలీసులు గృహ నిర్బంధించారు. అనంతరం శ్రీకాకుళంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘చట్టప్రకారం విధులు నిర్వహించని అధికారులకు హెచ్చరిస్తున్నాం. దౌర్జన్యాలకు వత్తాసు పాడొద్దు. వచ్చేది కచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే. చట్టవిరుద్ధంగా వైసీపీ తరపున వ్యవహరించేవారిపై చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు. అధైర్యపడొద్దని, దౌర్జన్యాలను ఎదుర్కోవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే అధికార పార్టీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లడించారు. 

Updated Date - 2022-08-20T05:17:13+05:30 IST