‘పబ్జీ’ పేరిట మహిళలకు వల

ABN , First Publish Date - 2021-06-20T08:46:34+05:30 IST

మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్‌లో అపలోడ్‌ చేయడం ద్వారా భారీగా సంపాదించిన ‘పబ్జీ మదన్‌’ దంపతులు ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. మూడేళ్లలోనే వీరు రూ.75 కోట్ల వరకు సంపాదించినట్లు తేలడంతో

‘పబ్జీ’ పేరిట మహిళలకు వల

అసభ్య సంభాషణలను ‘అప్‌లోడ్‌’ చేసి మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన

‘పబ్జీ మదన్‌’ దంపతుల అరెస్టు


చెన్నై, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్‌లో అపలోడ్‌ చేయడం ద్వారా భారీగా సంపాదించిన ‘పబ్జీ మదన్‌’ దంపతులు ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. మూడేళ్లలోనే వీరు రూ.75 కోట్ల వరకు సంపాదించినట్లు తేలడంతో పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. అదేవిధంగా మదన్‌, అతని భార్య కృత్తిక బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.4 కోట్ల నగదును కూడా సీబీసీఐడీ పోలీసులు సీజ్‌ చేశారు. తమిళనాట సంచలనంగా మారిన ‘పబ్జీ మదన్‌’ లీలలపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మదన్‌తో వ్యక్తిగతంగా జరిపిన సంభాషణ యూట్యూబ్‌లలో బహిర్గతం కావడంతో కొంతమంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని వేంగైవాసల్‌కు చెందిన మదన్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. పబ్జీ గేమ్‌ ఆడుతూ, పలువురు మహిళలను  కూడా దీనిలోకి దింపాడు. ఈ క్రమంలో వారి వద్ద అసభ్యంగా మాట్లాడుతూ.. ఆ సంభాషణలను రికార్డు చేసి సదరు మహిళలకు తెలియకుండా ఆడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవాడు.


మదన్‌ యూట్యూబ్‌కు లక్షలాది మంది సబ్‌స్ర్కైబర్లు, ఫాలోవర్లు ఉన్నారు. దీంతో అతనికి భారీగా ఆదాయం వచ్చేది. ఇలా మూడేళ్లలో రూ.75 కోట్ల మేరకు సంపాదించినట్టు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. తన భార్య కృత్తికతో కలిసి దాదాపు పదికిపైగా యూట్యూబ్‌ చానెళ్లను నడుపుతూ.. భారీగా సంపాదించాడు. మదన్‌కు అతని భార్య పూర్తిగా సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో మదన్‌కు సహకరించిన స్నేహితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు మదన్‌ను జైలుకు తరలించారు. అతని భార్యనూ అరెస్టు చేశారు. 


డబ్బులు వెదజల్లి..

తనతో బాగా అసభ్యంగా మాట్లాడిన మహిళలకు మదన్‌ రూ.5 లక్షల వరకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చినట్టు పోలీసులకు సాక్ష్యాధారాలు లభ్యమయ్యాయి. అతనితో అసభ్యంగా మాట్లాడిన మహిళల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. మరికొంతమంది యువతులు మదన్‌కు భారీగా డబ్బులు ఇచ్చి, మోసపోయినట్లు కూడా తేలింది. దీంతో బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2021-06-20T08:46:34+05:30 IST