అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-20T10:51:01+05:30 IST

వాళ్లకు అక్షర జ్ఞానం లేకపోయినా.. నేర పరిజ్ఞానంలో ఆరితేరారు. స్మార్ట్‌ మేగ్నెట్‌ రీడర్‌లను ఉపయోగిస్తూ..

అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

  • నకిలీ ఏటీఎం కార్డులతో నగదు విత్‌డ్రా 
  • బిహార్‌ మాయగాళ్ల ఆట కట్టించిన పోలీసులు 


నల్లగొండ క్రైం, జూన్‌ 19: వాళ్లకు అక్షర జ్ఞానం లేకపోయినా.. నేర పరిజ్ఞానంలో ఆరితేరారు. స్మార్ట్‌ మేగ్నెట్‌ రీడర్‌లను ఉపయోగిస్తూ.. నకిలీ ఏటీఎం కార్డులు తయారుచేసి.. ఎదుటి వాళ్లను బురిడీ కొట్టించడంలో ప్రావీణ్యం సాధించారు. చేసేది పవర్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలైనా.. సైబర్‌ నేరాలనే ప్రధాన సంపాదనా మార్గంగా మార్చుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లు.. చివరకు నల్లగొండ పోలీసులకు చిక్కారు. బిహార్‌కు చెందిన ఓంప్రకాశ్‌, బిజేందర్‌, అశోక్‌ అనే ముగ్గురు యువకులు.. నల్లగొండ జిల్లా దామచర్ల పవర్‌ప్లాంట్‌లో పనిచేందుకు రెండు నెలల క్రితం వచ్చి.. మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, త్రిపురారం ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్ల వద్ద తిరుగుతూ.. స్మార్ట్‌ మేగ్నెటిక్‌ రీడర్లతో అమాయకుల ఏటీఎం కార్డుల్లోని డేటాను కాపీచేసి పెట్టుకుంటారు. అనంతరం.. నకిలీ ఏటీఎం కార్డును తయారు చేసి.. వాటితో డబ్బులు విత్‌డ్రా చేసేవారు. రద్దీ ప్రదేశాల్లో ఉన్న ఏటీఎంల ముందు కాపుకాసి.. నగదు డ్రా చేయడం తెలియని వాళ్లను ట్రాప్‌ చేస్తారు. 


వారికి సహాయం చేసినట్లు నటించి.. వారి ఏటీఎంను తమ వద్ద ఉన్న మెషిన్‌లో స్వైప్‌ చేసి.. డేటాను కాపీ చేసేస్తారు. అనంతరం.. వాళ్లు పిన్‌ నెంబర్‌ చెప్పగానే దాన్ని గుర్తుంచుకుంటారు. వాళ్ల పని పూర్తి చేసి పంపించేసిన తర్వాత నకిలీ ఏటీఎం కార్డు తయారు చేసి విడతల వారీగా నగదు విత్‌డ్రా చేసేస్తారు. ఈ విషయంపై నల్లగొండ టూటౌన్‌ పీఎ్‌సలో ఫిర్యాదులు ఎక్కువవడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. మిర్యాలగూడలోని ఏటీఎం వద్ద నగదు డ్రా చేస్తున్న సమయంలో ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వీరిపై 15 కేసులు నమోదయ్యాయని, వీరి నుంచి రూ. 5 లక్షల నగదు, బైక్‌, మూడు ఎంఎ్‌సఆర్‌ మెషిన్లు, నకిలీ ఏటీఎం కార్డులు, లాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న కానిస్టేబుళ్లు బాలకోటి, శంషుద్దీన్‌, శంకర్‌ను అభినందించిన నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌ రెడ్డి.. వారి పేర్లను రివార్డుకు సిఫారసు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-06-20T10:51:01+05:30 IST