నిర్వాసితుల అరెస్ట్‌, విడుదల

ABN , First Publish Date - 2021-04-20T07:05:26+05:30 IST

నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించి పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్ట్‌ పనులను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ముంపు నిర్వాసితులు యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పనులను సోమవారం అడ్డుకున్నారు.

నిర్వాసితుల అరెస్ట్‌, విడుదల

 బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధితుల నిరసన

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 19: నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించి పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్ట్‌ పనులను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ముంపు నిర్వాసితులు యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పనులను సోమవారం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిర్వాసితులను చెదరగొట్టి భువనగిరి రూరల్‌, బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్లకు వేర్వేరుగా తరలించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్‌ నిర్మాణంలో బీఎన్‌తిమ్మాపురం గ్రామం ముంపునకు గురవుతోంది. అయితే రెవెన్యూ అధికారులు సోమ వారం బీఎన్‌ తిమ్మాపురం గ్రామంలో ఇళ్ల సర్వేను చేపట్టేందుకు వెళ్లారు. తమకు నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని గ్రామస్థులు బస్వాపురం రిజర్వాయర్‌ వద్దకు చేరుకొని పనులను నిలిపివేయాలని కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న భువనగిరి రూరల్‌ సీఐ జానయ్య, ఎస్‌ఐ కె.సైదులు హుటాహుటిన ప్రాజెక్ట్‌ వద్దకు పోలీస్‌ బలగాలతో చేరుకున్నారు. కాగా ప్రభుత్వం 1.5 టీఎంసీ నీటి నిల్వకు సంబంధించిన పనులను చేపడుతున్నారని,ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నప్పటికీ నిర్వాసి తులు ఒప్పుకోలేదు. దీంతో నిర్వాసితులను పోలీసులు బలవంతంగా డీసీఎం వాహనాల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అయితే సర్పంచ్‌ పిన్నం లతారాజు, ఎంపీటీసీ ఉడుత శారద అంజనేయులు, ఉప సర్పంచ్‌ ఎడ్ల దర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ జిన్న మల్లేశం, నిర్వాసితుల కమిటీ కన్వీనర్‌ వల్దాస్‌ రాజు ఆయా పోలీస్‌స్టేషన్ల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు పరి హారం అందజేసి పునరావాసానికి సంబంధించి స్థలసేకరణ చేపట్ట డం లో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.  ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని, లేకుంటే మంగళవారం గ్రామ స్థులతో కలిసి ప్రాజెక్ట్‌ పనులను అడ్డుకుంటామని  హెచ్చరించారు. అరెస్ట్‌ చేసిన నిర్వాసితులను విడుదల చేశారు. నిర్వాసితులను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని యూత్‌కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిక్కుల వెంకటేశం, రావుల నందు, గంగదేవి బాలరాజు అన్నారు. ఇప్పటి కైనా ఎమ్మెల్యే, కలెక్టర్‌ స్పందించి నిర్వాసితులకు సరైన న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.  



Updated Date - 2021-04-20T07:05:26+05:30 IST