హత్య కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-20T06:03:43+05:30 IST

: రామసముద్రంలో ఈనెల 17న వెలుగు చూసిన ఆవుల సుబ్బారెడ్డి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని మార్కాపురం డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్‌ తెలిపారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు
కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ కిషోర్‌కుమార్‌

వివాహేతర సంబంధమే కారణం 

వివరాలు వెల్లడించిన డీఎస్పీ కిషోర్‌కుమార్‌

త్రిపురాంతకం, అక్టోబరు 19 : రామసముద్రంలో ఈనెల 17న వెలుగు చూసిన ఆవుల సుబ్బారెడ్డి హత్యకు  వివాహేతర సంబంధమే కారణమని మార్కాపురం డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్‌ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో వై.పాలెం సీఐ పి.దేవప్రభాకర్‌,  ఎస్‌ఐ వెంకటకృష్టయ్యతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. సుబ్బారెడ్డి భార్య సుబ్బమ్మకు అదే గ్రామానికి చెందిన ఆవుల నాసరరెడ్డితో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. భార్యను ఎన్నిసార్లు మందలించినా వినకుండా ఆ బంధాన్ని కొనసాగిస్తోంది.  ఈనెల 16న సాయంత్రం నాసరరెడ్డి తన కంది చేలో సుబ్బమ్మతో కలిసి ఉండడాన్ని గమనించిన సుబ్బారెడ్డి వారితో గొడవపడ్డాడు. ఇంటికి వెళ్తే గొడవ పెద్దదవుతుందని, తమకు అడ్డుగా ఉన్నాడని భావించి హత్య చేశారు. సుబ్బమ్మ సుబ్బారెడ్డి కదలకుండా కాళ్లు పట్టుకోగా, కండువాతో సుబ్బారెడ్డి మెడకు బిగించి నాసరరెడ్డి  హత్య చేశారు. అనంతరం నాసరరెడ్డి తన బైకుపై సుబ్బారెడ్డి మృతదేహాన్ని గ్రామ సమీపంలోని జడ్పీ పాఠశాల వద్దకు తీసుకువచ్చి పక్కన ఉన్న కాలువలో పడేసినట్లు డీఎస్పీ తెలిపారు.  సుబ్బారెడ్డి తమ్ముడు నాసరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,  ఎస్పీ మల్లిక గర్గ్‌ సూచనలతో సీఐ పి.దేవప్రభాకర్‌ దర్యాప్తును చేపట్టి మంగళవారం మధ్యాహ్నం నిందితులను గ్రామంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్‌ఐ వెంకటకృష్ణయ్య, హెడ్‌ కానిస్టేబుల్స్‌ డి.శ్రీనివాసులు,  పీవీ సుబ్బారావు, షేక్‌ బాజి, జి.సురేష్‌, కానిస్టేబుళ్లు ఆర్‌.అంజి, డి.హుస్సేన్‌వలిలను ఎస్పీ అభినందించినట్లు చెప్పారు. 


Updated Date - 2021-10-20T06:03:43+05:30 IST