హత్య కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-01-29T04:56:35+05:30 IST

నగరంలో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆర్‌ఎస్‌ రోడ్డు సర్కిల్‌ వద్ద జరిగిన ఇస్మాయిల్‌ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు

కర్నూలు, జనవరి 28: నగరంలో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆర్‌ఎస్‌ రోడ్డు సర్కిల్‌ వద్ద జరిగిన ఇస్మాయిల్‌ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ మహేష్‌, టూటౌన్‌ సీఐ పార్థసారథిరెడ్డి శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కరెంటు ఆఫీసులో పని చేస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ఇస్మాయిల్‌ ఈనెల 13న హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇస్మాయిల్‌ అతని స్నేహితులు షరీఫ్‌, ఖాజాకు మరో వర్గానికి చెందిన గడ్డావీదికి చెందిన ఉస్మాన్‌భాషా, హబీబ్‌, షాషావలి, వడ్డె విజయకుమార్‌తో ప్లాట్ల అమ్మకం విషయంలో వాటాల మధ్య తేడా వచ్చింది. నందికొట్కూరు రోడ్డులో ఉన్న ఓ మసీదు స్థలంలో ఆ ప్లాట్లు విక్రయించగా.. ఆ వచ్చే కమిషన్‌పై వివాదం నెలకొంది. ఈ వివాదంలో 9 నెలల క్రితం వడ్డె విజయకుమార్‌, ఇస్మాయిల్‌పై కత్తితో దాడి చేశాడు. ఇస్మాయిల్‌ తృటిలో తప్పించుకున్నాడు. ఎలాగైనా ఇస్మాయిల్‌ను హత్య చేయాలని ఉస్మాన్‌బాషా, హబీబ్‌, షాషావలి ప్రణాళిక రూపొందించుకున్నారు. దీనికి విజయకుమార్‌ సాయం తీసుకున్నారు. అయితే అప్పట్లో పోలీస్‌ నిఘా ఎక్కువగా ఉండటంతో విజయకుమార్‌ ఇస్మాయిల్‌ను హత్య చేయలేకపోయాడు. ఇటీవల కాలంలో ఎలాగైనా ఇస్మాయిల్‌ను చంపాలని ఉస్మాన్‌బాషా, తన సహచరులైన ముజామిల్‌, సల్మాన్‌ఖాన్‌లకు కొంత సుఫారి ఇచ్చాడు. ఇందుకు అడ్వాన్సుగా రూ.25వేలు  ఇచ్చాడు. ఆన్‌లైన్‌లో కత్తిని తెప్పించాడు. ఈ నెల 13న ఇస్మాయిల్‌ ఆర్‌ఎస్‌ రోడ్డు సర్కిల్‌లో ఓ ఆటోలో కూర్చుని ఉండగా.. ముజామిల్‌, సల్మాన్‌ ఇద్దరు బైక్‌పై వచ్చి ఇస్మాయిల్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత మొదట మాట్లాడుకున్న సుఫారీ కోసం ఉస్మాన్‌బాషా, షాషావలిని కలిసేందుకు శుక్రవారం రావడంతో పోలీసులు నలుగురు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.94వేల నగదు, సెల్‌ఫోన్‌, కత్తి, మోటార్‌సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు. మరో నిందితుడు ఐటీసీ కాలనీ హబీబ్‌, శరీన్‌నగర్‌కు చెందిన విజయకుమార్‌ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన చేదించిన సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ చంచన్న, కానిస్టేబుల్లు రవికుమార్‌, శ్రీనివాసులు, మహేంద్రను డీఎస్పీ అభినందించారు.


Updated Date - 2022-01-29T04:56:35+05:30 IST