హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2020-05-21T10:54:47+05:30 IST

కందుకూరులోని ఓ చర్చి వివాదంలో ఒకరిని హత్య చేసేందుకు కుట్రపన్నిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

కందుకూరు చర్చి సెక్రటరీని హత్య చేసేందుకు

రెండు లక్షలు సుఫారీ

ఆ కేసులో ఆరుగురి నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన ఎస్పీ


ఒంగోలు(క్రైం), మే 20 : కందుకూరులోని ఓ చర్చి వివాదంలో ఒకరిని హత్య చేసేందుకు కుట్రపన్నిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని గెలాక్సీ సమావేశపు హాలులో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ మాట్లాడారు. ఆ వివాదంలో చర్చి సెక్రటరీ కొండయ్యపై జరిగిన హత్యాయత్నం కేసులో కందుకూరుకు చెందిన పులుకూరి సుజయ్‌, తాటిపర్తి అశోక్‌కుమార్‌, చెనుమాల బాలాజీతో పాటు కిరాయి హంతకులైన నెల్లూరు జిల్లా కావలికి చెందిన కోడూరి రామస్వామి అలియాస్‌ రాము, చింతం రూప్‌కుమార్‌ అలియాస్‌ రూప్‌, నాదెళ్ల భాస్కర్‌లను అరెస్టు చేశామన్నారు. ఇందుకుగాను రూ.2 లక్షలు సుఫారి కుదుర్చుకొని రూ.50వేలు అడ్వాన్స్‌ తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. చర్చిలోని రెండు గ్రూపులకు కార్యదర్శిగా ఉన్న చదలవాడ కొండయ్య, పులుకూరి సుజయ్‌లు చెరో గ్రూపులకు నాయకత్యం వహిస్తున్నారని తెలిపారు.


ఫిబ్రవరి 29న సుజయ్‌ వర్గీయులు కొండయ్యపై హత్యాయత్నం చేశారన్నారు. కేసు దర్యాప్తులో ప్రత్యేక శ్రద్ధ చూపించిన కందుకూరు డీఎస్పీ కే శ్రీనివాసరావు, సీఐ ఎం.విజయకుమార్‌, ఎస్‌ఐ కేకే తిరుపతిరావు, హెడ్‌కానిస్టేబుల్‌ ఎంఎం బేగ్‌, కానిస్టేబుళ్లు జీ దయానంద్‌, హరిబాబు, లక్ష్మణస్వామి, ఎస్‌కే బాషా, హోంగార్డులు ముక్తార్‌ బాషా, టీ ఆనంద్‌లను అభినందించి నగదు రివార్డులు అందజేశారు. 


హత్యాయత్నాన్ని ఛేదించింది ఇలా...

కందుకూరులోని ఎస్‌బీఐ కస్టమర్‌ సర్వీస్‌ షాపులో ఉన్న కొండయ్యపై హత్యాయత్నం జరిగినట్లు కేసు నమోదు చేసుకున్న కందుకూరు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సేకరించిన సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఏపీ 26 బీజే 1404 హీరో గ్లామర్‌ మోటార్‌ సైకిల్‌పై నిందితులు సంఘటనా స్థలానికి వెళ్లినట్లు గుర్తించి దాని ఆధారంగా పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు కందుకూరుకు చెందిన వారు కాగా, మరో ముగ్గురు కావలి వాసులుగా గుర్తించారు.

Updated Date - 2020-05-21T10:54:47+05:30 IST