అన్యాయంగా అరెస్టు చేశారు..

ABN , First Publish Date - 2020-10-30T07:02:30+05:30 IST

తన భర్త డీసీసీబీ ప్రత్తిపాడు విశ్రాంత బ్రాంచ్‌ మేనేజర్‌ మాకిరెడ్డి నరసింహమూర్తిని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన భార్య రమణమ్మ, వారి కుమారుడు రామకృష్ణ ఆరోపించారు.

అన్యాయంగా అరెస్టు చేశారు..

  • డీసీసీబీ విశ్రాంత బ్రాంచి మేనేజర్‌ భార్య, తనయుడు ఆవేదన

ప్రత్తిపాడు, అక్టోబరు 29: తన భర్త డీసీసీబీ ప్రత్తిపాడు విశ్రాంత బ్రాంచ్‌ మేనేజర్‌ మాకిరెడ్డి నరసింహమూర్తిని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన భార్య రమణమ్మ, వారి కుమారుడు రామకృష్ణ ఆరోపించారు. గురువారం ప్రత్తిపాడులో వారు మీడియాతో మాట్లాడారు. ఈనెల 27న రాత్రి పోలీసులు తమ గృహంలోకి తలుపులు బాదుకుంటూ ప్రవేశించారని, అన్ని గదులు తనిఖీలు చేసి తన భర్త నరసింహమూర్తి దుస్తులు సైతం ధరించనివ్వకుండా తీసుకుపోయారని భార్య రమణమ్మ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన ఆరోగ్యం, తన ఆరోగ్యం సక్రమంగా లేదని, హైకోర్టు స్టేఆర్డర్‌ ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని భార్య రమణమ్మ వాపోయారు. అర్ధరాత్రి సమయం లో పోలీసులు తన తండ్రిని అరెస్టు చేయడం ఏమిటని తనయుడు రామకృష్ణ వాపోయాడు. హైకోర్టు ఆదేశాలతో రెండు వారాలు ఇంకా స్టే ఉన్నా తన తండ్రిని అన్యాయంగా తీసుకుపోయారని రామకృష్ణ ఆరోపించాడు. హైకోర్టు స్టే ఆదేశాలను పోలీసు ఉన్నతాధికారులకు వాట్సప్‌ చేశామని, తమ తండ్రి ఎక్కడున్నదీ తమకు సమాచారం ఇవ్వలేదని వారు వాపోయారు.


  • చట్టప్రకారమే అరెస్టు చేశాం: డీఎస్పీ శ్రీనివాసరావు

ప్రత్తిపాడు డీసీసీబీ బ్రాంచ్‌ విశ్రాంత మేనేజర్‌ నరసింహమూర్తిని చట్టప్రకారమే అరెస్టు చేశామని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం సీఐ వై రాంబాబు, ఎస్‌ఐ కె సుధాకర్‌లతో కలిసి డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. లంపకలోవ సొసైటీకి చెందిన నిధులు రూ.15 కోట్ల 75 లక్షలు దుర్వినియోగం వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులపై ఆగస్టు 27న ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశామన్నారు. దీనిలో ఎ-4 నిందితుడు అయిన ఎం నరసింహమూర్తిని ఈనెల 27వ తేదీ రాత్రి 8.45 నిమిషాలకు అరెస్టు చేశామన్నారు. కోర్టు నిబంధనలు, చట్టప్రకారంగా ఆయనను అరెస్టు చేశామని, ఆసమయంలో అతని వద్ద, అతని అడ్వకేట్‌ వద్ద ఎటువంటి ఆర్డరు కాపీలేదన్నారు. నిందితుడి అల్లుడిని పలుమార్లు కోర్టు ఆదేశాల వివరాలు తెలుపమని కోరినా ఆ వివరాలు అందజేయలేదన్నారు. అరెస్టు చేసే సమయంలో సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చి అతని భార్య సమక్షంలో అరెస్ట్‌ చేశామని తెలిపారు. నరసింహమూర్తికి స్థానిక మెజిసే్ట్రట్‌ గోపాలకృష్ణ 28వ తేదీ మధ్యాహ్నమే రిమాండ్‌ విధించారని తెలిపారు.

Updated Date - 2020-10-30T07:02:30+05:30 IST