ఈ పాపం ఎవరిది?

ABN , First Publish Date - 2022-08-04T09:54:30+05:30 IST

అభివృద్ధి పనులకు సంబంధించి ఇలా నిధుల బకాయిలు పేరుకుపోవడం అనే సమస్య ఈ గ్రామాల్లోనే కాదు..

ఈ పాపం ఎవరిది?

  • సర్పంచ్‌లు, అధికార పార్టీ నేతల మధ్య బకాయిల చిచ్చు
  • వర్క్‌ ఆర్డర్‌కు ముందే అభివృద్ధి పనులపై సర్పంచ్‌లకు ఆదేశాలు
  • పూర్తి చేశాకే నిధులు.. లేదంటే వేటు అంటూ అధికారుల హెచ్చరికలు
  • అప్పులు చేసి మరీ పనుల పూర్తి
  • సుదీర్ఘంగా బిల్లులకు ఎదురుచూపు 
  • అప్పుడెందుకు చేయించారు? ఇప్పుడు చొరవ తీసుకోరెందుకు?  
  • ఎమ్మెల్యేలు, అధికారులపై సర్పంచ్‌ల ఆగ్రహం.. నిలదీత
  • వడ్డీలు కట్టలేక పడరాని 
  • పాట్లు పడుతున్నామని ఆవేదన 
  • దిక్కుతోచని స్థితిలో కార్యాలయాల 
  • వద్ద ఆత్మహత్యాయత్నాలు 


నాలేశ్వరంలో రూ.22 లక్షలు వెచ్చించి ఏడాది క్రితం రైతువేదిక భవనాన్ని నిర్మించారు. విడతల వారీగా ఇప్పటి వరకు రూ.18.25 లక్షల బిల్లులు వచ్చాయి. ఇంకా రూ.3.75 లక్షలు బకాయి ఉన్నాయి. సొంతంగా అప్పులు చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టానని, సకాలంలో బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీ కట్టేందుకు గోస పడుతున్నానని గ్రామ సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 


వనపర్తి రూరల్‌ మండలం నాగమ్మ తండా సర్పంచ్‌ 2020లో అనుమతులు లేకుండానే రూ.2.50 లక్షలు ఖర్చు చేసి చెత్తను వేరుచేసే  షెడ్‌ను కట్టారు. నిర్మాణం పూర్తయిన 9 నెలలకు రూ.1.75 లక్షలు ఆయన చేతికొచ్చాయి. మిగిలిన రూ.75వేల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. పెండింగ్‌ డబ్బులివ్వాలని డిమాండ్‌ చేసేందుకు ఆయన వద్ద అనుమతి పత్రాల్లేవు. 


నిజామాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వర్క్‌ ఆర్డర్‌ లేకుండానే స్థానిక ఎమ్మెల్యే, అధికారుల హామీతో రూ.15 లక్షలతో డ్రైనేజీ, అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తిచేశారు. తర్వాత ఆర్నెల్లకు వర్క్‌ ఆర్డర్‌ వస్తే ఆ తర్వాత ఆర్నెల్లకు ఎంబీలో నమోదు చేశారు. పనులకు సంబంధించి పైసా రాలేదు. బిల్లులు క్లియర్‌ చేయాలంటూ ఎమ్మెల్యే, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆ గ్రామ సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులకు సంబంధించి ఇలా నిధుల బకాయిలు పేరుకుపోవడం అనే సమస్య ఈ గ్రామాల్లోనే కాదు.. రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీల్లో ఎన్నో గ్రామాల్లో నెలకొంది. నెలలు, ఏళ్లు గడుస్తున్నా చేసిన పనులకు సంబంధించి  బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు హైరానా పడుతున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి అనుమతులు రాకముందే సర్పంచుల్లో ఎంతోమంది పనులు పూర్తి చేశారు. వాస్తవానికి ఇది నిబంధనలకు విరుద్ధం. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలున్నాయి. ఆవేవీ పాటించకుండానే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల ఒత్తిడితో అప్పులు చేసి మరీ ముందే పనులు చేయిస్తున్నారు. ఆ తర్వాత బిల్లులు రాకపోవడంతో ఎంతోమంది దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిరాశానిస్పృహల్లో ఇప్పటికే ఒకరిద్దరు బలవన్మరణానికి పాల్పడితే, పలువురు ఆత్మహత్యాయత్నం చేశారు. రోజూ ఎక్కడో చోట బిల్లుల బకాయిలకు సంబంధించి కార్యాలయాల వద్ద సర్పంచుల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలున్నాయి. ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే తొలుత దానికి సంబంధించి పంచాయతీ తీర్మానం చేసి ఆమోదించాలి. 


దీన్ని అధికారులు ఆమోదించాక వర్క్‌ ఆర్డర్‌ వచ్చి.. ఆ తర్వాత నిధుల విడుదలవ్వాలి. ఆ తర్వాతే పనులు చేపట్టాలి. కానీ ఇందుకు పూర్తి రివర్స్‌గా ప్రక్రియ జరుగుతోంది. అనుమతులు రాకముందే పనులు చేపట్టాలని సర్పంచ్‌లపై ఎమ్మెల్యేలు, అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ‘తొలుత పనులు చెయ్‌.. ఒకట్రెండు నెలల్లో డబ్బులొస్తాయిలే’ అని ప్రజాప్రతినిధులు భరోసా ఇవ్వడం.. ‘ముందుగా పనులు చేయించండి.. త్వరలోనే నిధులిస్తాం... మాట వినకుంటే సస్పెండ్‌ చేస్తాం’ అంటూ అధికారులు హెచ్చరించడంతో విధిలేని పరిస్థితుల్లో సర్పంచులు రంగంలోకి దూకుతున్నారు. వర్క్‌ ఆర్డర్‌ రాకున్నా.. లక్షల్లో అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు పూర్తిచేస్తున్నారు. తర్వాత బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారేమో అప్పటికి పనులు పూర్తవడంతో పాత తేదీల్లో వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చి.. ఎంబీలో నమోదు చేయించి.. విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నారు. ఇదంతా జరిగి తీరా బిల్లులు క్లియర్‌ అయ్యేసరికి నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 


తర్వాత బిల్లులు వచ్చినా ఆ డబ్బంతా వడ్డీలకే పోతోందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏళ్లుగా బిల్లులు క్లియర్‌ అవకపోవడంపై అధికార పార్టీకి చెందిన సర్పంచుల్లోనూ ఎంతోమంది తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పనులు చేయాలంటూ వెన్నుతట్టిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బిల్లుల క్లియరెన్స్‌కు చొరవ చూపకపోవడంతో వారిని బహిరంగంగా నిలదీస్తున్నారు. దీనికి వారేమో సమస్యను పరిష్కరించకపోగా ఉల్టా సర్పంచులనే మరింత ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి పంచాయతీ తీర్మానం, ఆమోదపత్రాలు ఏవి? ఆ రికార్డులేవీ లేనప్పుడు అభివృద్ధి పనులు చేశామన్న ప్రశ్నే ఎక్కడిది? అని సర్పంచులను ప్రశ్నిస్తున్నారు. ఫలితంగా ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌ల మధ్య గ్యాప్‌ మరింత పెరిగి.. అగ్గిరాజుకుంటోంది. రెండు రోజుల కిందట అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన దాదాపు ఇలాంటిదే.


 ఈ ఘటనలో మహిళా సర్పంచ్‌ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమైనా, అందరిలాగే ఆమె కూడా అనుమతులు రాక ముందే పనులు చేసి సమస్యల్లో పడ్డారని.. బిల్లులు రాకపోవడంతోనే సర్పంచ్‌ భర్త నిరాశానిస్తృహలకు గురై ఎమ్మెల్యే వద్దకు వెళ్లారనే వాదన కూడా వినిపిస్తోంది. బిల్లులు చెల్లించి సర్పంచులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ  పెద్దలను విపక్షాలు డిమాండ్‌ చేస్తుంటే అసలు పెండింగ్‌ బిల్లులేవీ లేవంటూ బుకాయిస్తున్నారు. కాగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు వైకుంఠ ధామాలు, రైతువేదికలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను సర్పంచులు అప్పులు చేసి మరీ చేపట్టారు. వీటికి సంబంధించిన బిల్లులు ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పాలక వర్గాలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి.  


టార్గెట్లతో సతమతం...

ఆదాయ వనరులు అంతంతమాత్రం ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.1.50లక్షలు నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని సర్పంచులు చెబుతున్నారు. అధికారులు తమకు టార్గెట్లు విధిస్తూ నిధులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, ఉన్నతాధికారులు నేరుగా ఫోన్‌ చేసి పనులు పూర్తి చేయకపోతే.. సస్పెండ్‌ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం వల్లే పనులు చేయించినట్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనుల పేరిట లక్ష్యాలను నిర్దేశించిన రాష్ట్ర సర్కారు... నిధులు మాత్రం ఇవ్వడం లేదని ఈ టార్గెట్లు పూర్తి చేయడంకోసం అప్పులు చేసి పనులు పూర్తి చేయడంతో ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్నామని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కూలీలుగా మారుతున్న సర్పంచులు 

ప్రభుత్వ మార్గదర్శకాలు.. అధికారుల ఆదేశాలు.. వెరసి గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధిపనులకు నిధులు రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులపై అప్పుల భారం తడిసి మోపెడవుతోంది. చేసిన అప్పులకు వడ్డీలు సైతం కట్టలేని స్థితిలో.. సర్పంచులు కొందరు ఉపాధి కూలీ పనులకు వెళ్తున్నారు. కొందరు ఏకంగా జోలె పట్టి బిక్షాటన చేసిన సందర్భాలున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ వెంకన్న ప్రభుత్వం నిర్దేశిస్తున్న రకరకాల లక్ష్యాలతో  పనులు పూర్తిచేశానని.. అయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని నిరసిస్తూ భిక్షాటన చేయడం కదిలిచింది. 

Updated Date - 2022-08-04T09:54:30+05:30 IST