వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-08-12T05:42:03+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు.

వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- వేడుకలను జయప్రదం చేయాలి

- అధికారులతో కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల క్రైం, ఆగస్టు 11 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. గద్వాల పట్టణంలోని కలెక్టరేట్‌ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ, స్వాతంత్య్ర వేడుకలను జయప్రదం చేయాలన్నారు. వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావలసి ఉందని, ఆలోపు అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలను నిర్వహించనున్నామని, అందుకు అనుగుణంగా డయాస్‌, బారికేడింగ్‌ ఏర్పాటు, లోపలికి వెళ్లేదారిని లెవెలింగ్‌ చేయాల్సిందిగా ఆర్‌ అండ్‌ బీ అధికారికి సూచించారు. వేడుకలకు వచ్చే ముఖ్య అతిథికి పోలీస్‌ గౌరవ వందనంతో పాటు, పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చూడాలని అడిషనల్‌ ఎస్‌పీకి సూచించారు. పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, రోడ్ల వెంట ముళ్ల పొదలను తొలగించాలని, పరేడ్‌ మైదానంలో వాటరింగ్‌ చేయాలని కమిషన ర్‌కు సూచించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో చక్కటి ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇచ్చేందుకు అన్ని శాఖల అధికారుల నుంచి వివరాలు తెప్పించుకోవాలని కలెక్టరేట్‌ ఏవోకు సూచించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పీ రాములు నాయక్‌, డీఎంహెచ్‌వో చందూనాయక్‌ ఉన్నారు. 


భద్రత ఏర్పాట్ల పరిశీలన

వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 15న నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి పరేడ్‌ మైదానంలో భద్రతా ఏర్పాట్లను గురువారం అదనపు ఎస్పీ రాములు నాయక్‌ పరిశీలించారు. మైదానంలో స్టేజీ, బారికేడ్లు, ప్రవేశ, నిష్క్రమణ దారుల ఏర్పాటుపై ఏవో, తహసీల్దార్‌లకు సూచనలు ఇచ్చారు. భద్రత, గౌరవ వందన సమర్పణ ఏర్పాట్లపై ఆర్‌ఐ నాగేష్‌కు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జానకిరామ్‌ సాగర్‌, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Updated Date - 2022-08-12T05:42:03+05:30 IST