వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-06T07:01:12+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపడుతున్న వజ్రోత్సవ వేడుకులకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు

వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌అర్బన్‌, ఆగస్టు 5: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపడుతున్న వజ్రోత్సవ వేడుకులకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీసీ ద్వారా మాట్లాడారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీనుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తొలి రోజు సీఎం హైదరాబాద్‌లో ఉత్సవాలు ప్రారంభిస్తారని 9 నుంచి జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశానికి మండలస్థాయి ముఖ్య అధికారులు హాజరుకావాలన్నారు. 10న ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి ఒకేచోట 750 చొప్పున మొక్కలు నాటాలన్నారు. ఆ ప్రాంతాన్ని ఫ్రీడం పార్కుగా సంబోధించడం జరుగుతుందన్నారు. 11న మున్సిపల్‌, మండలస్థాయిలో ఫ్రీడంరన్‌, 12న జాతీయ సమైఖ్యత రక్షాబంధన్‌, 13న ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించి మైదానాల్లో త్రివర్ణబెలూన్‌లు ఎగురవేయాలన్నారు. 14న జిల్లా, నియోజకవర్గస్థాయిలో జానపద కళాకారుల ప్రదర్శనలు, బాణాసంచా కాల్చడం, 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16న అన్ని ప్రాంతాల్లో నిర్ణీత సమయంలో సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, 17న జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం, 18న ఉద్యోగులు, యువతకు ఫ్రీడం పేరిట క్రీడాపోటీల నిర్వహణ, 19న అనాథ, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు, జైళ్లలో పండ్ల పంపిణీ, 20న స్వయం సహాయక సంఘాలకు, మహిళలకు రంగోళి పోటీలు, 22న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ముగింపు సంబరాలు ఉంటాయన్నారు. 15న ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగిరేలా ఇంటింటికీ జెండాల పంపిణీ చేయాలన్నారు. 

పచ్చదనం పెంపొందించేలా చర్యలు

జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లు, రైతు వేదికల వద్ద పచ్చదనం పెంపొందించేలా అఽధికారులు చర్యలు తీసుకోవాలని ప్రతి మీటర్‌కు ఒక మొక్కచొప్పున మొక్కలు నాటాలన్నారు. మొక్కల చుట్టూ దాతల సహకారంతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని ఆ పనులన్ని వచ్చే శుక్రవారంలోగా పూర్తిచేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు

నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ నగరపాలక (విలీనగ్రామాల) హద్దులను త్వరితగతిన నిర్ణయించి అర్హులైన ఉద్యోగులకు హౌజ్‌రెంట్‌ అలవెన్స్‌ భత్యాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ జేఏసీ నాయకులు శుక్రవారం కలెక్టర్‌ నారాయణరెడ్డిని కోరారు. నూతన హెచ్‌ఆర్‌ఏ సీలింగ్‌ను వర్తింపచేయాలని అన్నారు.

Updated Date - 2022-08-06T07:01:12+05:30 IST