నేడు కీలక ఘట్టం

ABN , First Publish Date - 2021-10-19T04:29:34+05:30 IST

అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టం సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తుల నడుమ సిరిమానోత్సవం జరగనుంది. పోలీసులు మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు.

నేడు కీలక ఘట్టం
ఆలయం వద్ద భక్తుల సందడి




సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

మూడెంచల భద్రత 

అడుగడుగునా పోలీసు నిఘా

భక్తులకు అనుమతి నిరాకరణ

మధ్యాహ్నం 3 నుంచి 5 మధ్య ఉత్సవం

ప్రత్యేక ప్రణాళికతో యంత్రాంగం

వీక్షణకు ప్రధాన కూడళ్లలో స్ర్కీన్లు

విజయనగరం రూరల్‌, అక్టోబరు 18: 

అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టం సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తుల నడుమ సిరిమానోత్సవం జరగనుంది. పోలీసులు మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు. సిరిమాను వీక్షణకు ఎత్తుబ్రిడ్జి, కోట, మూడులాంతర్లు, కొత్తపేట జంక్షన్‌తో పాటు నగరంలోని పలు కూడళ్లలో స్కీన్లను ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను తిరిగేందుకు వీలుగా ముహూర్తాన్ని నిర్ణయించారు. సాయంత్రం 5 గంటలకు ఉత్సవం ముగిసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తిచేశారు. అమ్మవారి పరివారంగా పిలిచే  జాలరి వల, అంజలి రథం, పాలధార ఇలా సిరిమాను నడిచే రథాలకు సంబంధించి నిర్వహకులకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం  దిశా నిర్దేశం చేసింది. ఈ రథాల వెంట వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండాలని స్పష్టం చేసింది. వీటిపై  పోలీ సు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. కలెక్టర్‌ సూర్యకుమారి, జాయింట్‌ కలెక్టర్లు కిషోర్‌కుమార్‌, వెంకటరావు, ఎస్పీ దీపికాపాటిల్‌ పర్యవేక్షిస్తున్నారు. కోట బురుజుపై నుంచి పూసపాటి వంశీయులు తిలకించేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు డీసీసీబీ నుంచి సిరిమానును తిలకించనున్నారు. సిరిమాను నేపథ్యంలో పురాతన భవనాల పైకి ఎక్కరాదని పోలీసు శాఖ విన్నవించింది. మూడు లాంతర్లు నుంచి కోట వరకూ ఉన్న పురాతన భవనాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నోటీసులు అంటించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు గస్తీ కాయనున్నారు.  సిరిమానును బంటుపల్లి వెంకటరమణ అధిరోహించనున్నారు. హుకుంపేట నుంచి సిరిమానును వీలైనంత వేగంగా మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే జేసీలు కిషోర్‌కుమార్‌, వెంకటరావు, ఇతర అధికారులు నిర్వహకులతో మాట్లాడారు. సిరిమానోత్సవ ప్రత్యేక అధికారి ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, ఈవో కిషోర్‌కుమార్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

 పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి బొత్స

అమ్మవారి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం తరుపున మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో బొత్స సత్యనారాయణ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, దేవదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఇతర నాయకులు, అధికారులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. 




Updated Date - 2021-10-19T04:29:34+05:30 IST