ఐదో విడత పల్లెప్రగతికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-13T06:53:30+05:30 IST

జిల్లాలో ఐదో విడత పల్లె ప్రగతి కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల పరిధిలో చేపట్టనున్నారు. నాలుగు విడతల్లో జరిగిన పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను సమీక్షించడంతో పాటు కొత్త పనులను చేపట్టనున్నారు.

ఐదో విడత పల్లెప్రగతికి ఏర్పాట్లు

20 తేదీ నుంచి నిర్వహణకు కసరత్తు 

జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు 

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

నిజామాబాద్‌, మే 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఐదో విడత పల్లె ప్రగతి కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల పరిధిలో చేపట్టనున్నారు. నాలుగు విడతల్లో జరిగిన పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను సమీక్షించడంతో పాటు కొత్త పనులను చేపట్టనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ పనులను చేపట్టనున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల వినియోగంపైన సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. పల్లె ప్రగతికోసం కొత్త కమిటీలను వేయడంతో పాటు గ్రామంలో పర్యటించి పనులను గుర్తించి పూర్తిచేయనున్నారు.

20 నుంచి జూన్‌ 5 వరకు పనులు..

జిల్లాలో ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు పల్లెప్రగతి పనులను చేపట్టేందుకు నిర్ణయించారు. అన్ని గ్రామాల పరిధిలో ఈ పనులను చేపట్టనున్నారు. జిల్లాస్థాయిలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గ్రామస్థాయిలో పల్లె ప్రగతి కోసం సర్పంచ్‌ ఆధ్వర్యంలో కమిటీలను వేయనున్నారు. ప్రతి గ్రామం, మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి పనులను సమీక్షించనున్నారు. షెడ్యుల్‌కు అనుగుణంగా పనులు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. నాలుగు విడతల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించినందున అదేవిధంగా అధికారులను నియమించి ఈ పనులను చేపట్టనున్నారు.

530 గ్రామాల పరిధిలో నిర్వహణ..

జిల్లాలోని 530 గ్రామాల పరిధిలో 15 రోజుల పాటు నిర్వహించే ఈ పనుల కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఈప్రణాళికకు అనుగుణంగా గ్రామాల్లోని పనులను చేపడతారు.  ఈ నెల 20న అన్ని గ్రామాల పరిధిలో గ్రామ కమిటీ సభ్యులు సర్పంచ్‌తో కలిసి అన్ని వాడలు పర్యటిస్తారు. కమిటీలో ఉన్న సర్పంచ్‌, ఎంపీటీసీ, లైన్‌మెన్‌, కార్యదర్శి, మిషన్‌భగీరథ టెక్నిషియన్‌తో పాటు ఇతర సభ్యులు గ్రామాల్లోని వార్డులను పరిశీలిస్తారు. పెండింగ్‌ పనులను గుర్తిస్తారు. పల్లె ప్రగతిలో భాగంగా రెండు రోజులు ప్రభుత్వ, ప్రజా ఉపయోగంలో ఉన్న సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలను చేపడతారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లన్నీ పరిశీలించి హరితహారంలో భాగంగా అవెన్యూప్లానిటేషన్‌ కోసం అనువైన ప్రదేశాలను గుర్తిస్తారు. హరితహారం మొదలుకాగానే ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటనున్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా పవర్‌డేను పాటిస్తారు. పవర్‌డేలో భాగంగా గ్రామంలో అన్ని వీధుల్లో విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తారు. పల్లె ప్రగతిలో భాగంగా తాగునీటి సంబంధించిన ట్యాంకులు, ఇతర వనరులను శుభ్రం చేస్తారు. గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా నిర్మించిన డంపింగ్‌యార్డ్స్‌ వైకుంఠ ధామాలను పల్లె ప్రకృతి వనాలను పరిశీలిస్తారు. వాటి వినియోగంపైన సమీక్షిస్తారు. పల్లె ప్రగతిలో భాగంగా పెండింగ్‌ పనులు ఉంటే పూర్తిచేస్తారు. గ్రామాల్లో పాడుబడినబావులను, ఇళ్లను తొలగిస్తారు. గ్రామస్థులను తరలించి శ్రమదాన కార్యక్రమాలను పల్లెప్రగతిలో భాగంగా చేపట్టనున్నారు. 

ఈ పల్లె ప్రగతిలో ఎక్కువగా మౌలిక వసతులపైన దృష్టిపెట్టనున్నారు. గ్రామాల్లో నిర్మించిన డంపింగ్‌యార్డు పల్లె ప్రకృతి వనాలు వినియోగించేవిధంగా చూస్తారు. తడి, పొడిచెత్తపై అవగాహన కల్పిస్తారు. కంపోస్డ్‌ ఎరువులను తయారు చేసేందుకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లను చేస్తారు. ఇప్పటికే తయారైన వర్మి కంపోస్ట్‌ను హరితహారం మొక్కలకుకాని, రైతులకుకాని సరఫరా చేస్తారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠ ధామాల్లో పెండింగ్‌ పనులను పూర్తిచేయడంతో పాటు అందరికి అందుబాటులో ఉండేవిధంగా అందరితో కలిసి పల్లెప్రగతిలో భాగంగా సమీక్షించనున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామానికి సంబంధించిన హరిత ప్రణాళికను తయారు చేయనున్నారు. ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నారు. ఈ పల్లె ప్రగతి జరిగినన్ని రోజులు అధికారులు గ్రామస్థులతో కలిసి గ్రామాల్లో ఉండి కార్యక్రమాలు చేపట్టే విధంగా పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు ఆదేశాలను ఇచ్చారు. దానికి అనుగుణంగానే చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో ఒకటి, రెండు రోజుల్లో పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఐదో విడత పల్లె ప్రగతి పనులను చేపట్టేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్‌ జయసుధ తెలిపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన తర్వాత ప్రణాళికకు అనుగుణంగా గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటి వరకుచేపట్టిన పనులను సమీక్షిస్తూ కార్యక్రమాలు చేపడతామన్నారు. అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జయసుధ తెలిపారు.

Read more