చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-27T07:44:33+05:30 IST

జిల్లాలో వర్షాలు మొదలవడంతో మత్య్సశాఖ అధికారుల చేప పిల్లల విడుదల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి సంవత్సరంలాగానే మత్య్సకారుల అభివృద్ధికోసం ఈ సంవత్సరం కూడా ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వేసేందుకు నిర్ణయించారు.

చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

జిల్లాలో చేప పిల్లల విడుదలకు ప్రణాళికలు

చెరువులు నిండగానే వేసేందుకు ఏర్పాట్లు

చేప పిల్లల టెండర్ల కోసం అధికారుల కసరత్తు

జిల్లా వ్యాప్తంగా 1009 చెరువుల్లో విడుదలకు నిర్ణయం 

 నిజామాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వర్షాలు మొదలవడంతో మత్య్సశాఖ అధికారుల చేప పిల్లల విడుదల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి సంవత్సరంలాగానే మత్య్సకారుల అభివృద్ధికోసం ఈ సంవత్సరం కూడా ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వేసేందుకు నిర్ణయించారు. వీటితో పాటు ఎంపిక చేసిన వాటిల్లో రొయ్యలను కూడా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో కొన్నింటిని ఉత్పత్తి చేయడంతో పాటు మిగతావాటిని టెండర్‌ల ద్వారా తీసుకువచ్చి జిల్లాలోని చెరువులలో వేసేందుకు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని శాఖ అధికారులు చేప పిల్లల విడుదల కోసం తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. 

ఏడేళ్లుగా చేప పిల్లల విడుదల..

జిల్లాలో ఏడేళ్లుగా చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నారు. మత్య్సకారుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం జిల్లాలోని నీళ్లు ఉండే చెరువుల్లో వీటిని వేస్తున్నారు. వర్షాకాలంలో వరదలు బాగా వచ్చి చెరువులు నిండిన తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో వీటిని వేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నాటికి ఈ చేప పిల్లలు పెరిగి మత్య్సకారులకు ఆదాయ వనరుగా మారుతోంది. ప్రతి గ్రామం పరిధిలో చెరువుల్లో వేయడం వల్ల మత్య్సకారులకు ఈ చేపల ద్వారా లక్షల ఆదాయం సమకూరుతోంది. గత సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా జిల్లాలో ఈ చేప పిల్లలను వేసేందుకు నిర్ణయించారు. 

 4కోట్ల 72లక్షల 62వేల చేప పిల్లల విడుదలకు కసరత్తు..

జిల్లాలోని 1009 చెరువుల్లో వీటిని వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చెరువుల్లో మొత్తం 4కోట్ల 72లక్షల 62వేల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చేప పిల్లలు చిన్న సైజు 30 నుంచి 40ఎంఎం చేప పిల్లలు, 80 నుంచి 90 ఎంఎం చేప పిల్లలను వేసేందుకు నిర్ణయించారు. వీటిలో కొన్నింటిని జిల్లాలోని పొచంపాడ్‌ ఫాంలో ఉత్పత్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మత్య్సశాఖ కమీషనర్‌ కూడా ఉత్తర్వులను జారీచేశారు. మిగతా చేప పిల్లలను టెండర్‌లను పిలిచి వారి ద్వారా తెప్పించి వేయించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ చేప పిల్లలను టెండర్‌లు పిలిచి కాంట్రాక్ట్‌ పొందినవారి ద్వారా తీసుకువచ్చి వేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్‌ తీసుకున్న వ్యక్తులు ఆలస్యంగా తీసుకురావడం వల్ల గత సంవత్సరం కొంత సమయం గడిచిన తర్వాత ఆగస్టు, సెప్టెంబరు నెలలో వేయడం వల్ల చేపల సైజు ఎక్కువగా రాలేదు. అనుకున్న విధంగా ఎదగలేదు. కొన్ని చెరువుల్లో తక్కువ వేయడం వల్ల చేపల దిగుబడి పెరగలేదు. కొన్ని చెరువుల పరిధిలో మత్య్సకారులకు అదిక ఆదాయం వచ్చినా మరికొన్ని చెరువుల్లో తక్కువగా వచ్చింది. చేప పిల్లలే కాకుండా వందశాతం సబ్సిడీ కింద రిజర్వాయర్‌లో రొయ్యలను కూడా వేస్తున్నారు. ఈ రొయ్యలను తీసుకువచ్చే స్పాన్‌ సరైన విధంగా లేకపోవడం వల్ల వీటి ఉత్పత్తి తక్కువగా వస్తుంది. రొయ్యల స్పాన్‌ కోసం డబ్బులను ఎక్కువగానే ఖర్చుపెట్టినా చేప పిల్లలలాగా లా భం ఉండడంలేదని మత్య్సకారులు వాపోతున్నారు. 

జిల్లా వ్యాప్తంగా 1043 చెరువులు..

జిల్లాలో మొత్తం 1043 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 324 మత్య్స పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల పరిధిలోనే మత్య్సకారులు ఉన్నారు. ఈ చెరువులను కూడా వీరే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు పడి చెరువులు నిండగానే చేప పిల్లలను వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా మత్య్సశాఖ ఏడీ రాజారామ్‌ నర్సయ్య తెలిపారు. ఎస్సారెస్పీ ఫాంలో కొంత చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నామని మిగతా వాటికి ఆదేశాలు ఇవ్వగానే టెండర్‌లను పిలిచి ఖరారు చేస్తామన్నారు. వర్షాలు పడి చెరువులు నిండగానే వీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-27T07:44:33+05:30 IST