Abn logo
Oct 24 2021 @ 22:47PM

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

- జిల్లాలో 24 పరీక్షా కేంద్రాలు

- హాజరుకానున్న 5208 మంది విద్యార్థులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 24: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గతేడాది జరగాల్సిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడంతో తిరిగి ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ 11, మోడల్‌, సంక్షేమ 5, ప్రైవేటు కళాశాలలు 4, జడ్పీ ప్రభుత్వ పాఠశాలలు 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనరల్‌ కేటగిరిలో 4326 మంది, ఒకేషనల్‌ కేటగిరి 882మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఆయా కేంద్రాల వద్ద చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంట్‌ అధికారులను నియమించారు. అలాగే మూడు కస్టోడియన్‌ స్క్వాడ్‌, నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీంను ఏర్పాటు చేశారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యార్థులను గంట ముందే పరీక్ష హాలులోకి అనుమతించనున్నారు. 9గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పరీక్షా సమయం 12గంటలు అయ్యే వరకు ఏ ఒక్క విద్యార్థిని బయటికి పంపించే ప్రసక్తే లేదని అధికారులు పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నిబంధనలు పాటించాలని, ప్రతి విద్యార్థి మాస్కు ధరించి రావాలన్నారు. 

ఉదయం 8గంటలకు చేరుకోవాలి..

జిల్లాలో సోమవారం జరిగే ఇంటర్‌ పరీక్షలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు పరీక్షలు జరగనుండగా ఉదయం 8గంటల వరకు విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కొవిడ్‌ నేపథ్యంలో నిబంధనలు పాటించేలా అధికారులు తగుచర్యలు తీసుకుంటున్నారు. ఆయా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను విధించారు. అలాగే ఆయా పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల మధ్యనే ప్రశ్నాపత్రాలు తెరవనున్నారు. పరీక్షా సమయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు ఉదయం నుంచే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..

- శ్రీధర్‌ సుమన్‌, డీఐఈవో

అన్ని పరీక్షా కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేశాం. కొవిడ్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఆయా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాం. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేటప్పుడు విధిగా మాస్కు ధరించాలి. కరోనా నిబంధనలు పాటించాలి.