చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-12T06:22:23+05:30 IST

జిల్లాలో మత్య్సకారుల అభివృద్ధి కోసం ఈ యేడాది కూడా చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే టెండర్‌లను ఖరారు చేసిన అధికారులు చెరువులు నిండడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం జిల్లాలోని కొన్ని చెరువుల్లో ఈ చేప పిల్లలను విడుదల ప్రారంభించనున్నారు.

చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

15 నుంచి చేప పిల్లల విడుదలకు కసరత్తు

ముందుగానే సరఫరా చేసేవిధంగా కాంట్రాక్టర్లతో ఒప్పందం

నిజామాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మత్య్సకారుల అభివృద్ధి కోసం ఈ యేడాది కూడా చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే టెండర్‌లను ఖరారు చేసిన అధికారులు చెరువులు నిండడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం జిల్లాలోని కొన్ని చెరువుల్లో ఈ చేప పిల్లలను విడుదల ప్రారంభించనున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్ని చెరువుల్లో వీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. చేప పిల్లలను పెంచడంతో పాటు వాటిని అన్ని చెరువులకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 

జిల్లాలోని 1043 చెరువుల్లో ఈ చేప పిల్లలను వేసేందుకు నిర్ణయించారు. మొత్తం 4కోట్ల 85లక్షల చేప పిల్లలను అన్ని చెరువుల్లో వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గత సంవత్సరంలాగానే ముందస్తుగా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం చెరువులు, కుంటలు నిండాయి. అన్ని చెరువులు మత్తడులు పారుతున్నాయి. చెరువులన్ని నిండుగా ఉండడం వల్ల చేప పిల్లలు వేస్తే త్వరగా పెరిగే అవకాశాలు ఉండడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా టెండర్‌లను పిలిచారు.  35 నుంచి 40 మి.మీలు ఉండే చేపకు 60 పైసలు, 80 నుంచి 100 ఎన్‌ఎంలు ఉండే చేప పిల్లలకు ఒక్కొటి 162 పైసల చొప్పున టెండర్‌ ఖరారు చేశారు. మొత్తం 4 కోట్ల 85లక్షల చేప పిల్లలను ఈ చెరువుల్లో వేసేందుకు నిర్ణయించారు. వీటిలో 2 కోట్లకు పైగా చిన్న చేపలను వేస్తుండగా 2.85 కోట్ల పెద్ద చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం చేప పిల్లల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడడం, నిర్ణయించిన పరిమాణంలో చేప పిల్లలు రాకపోవడం వల్ల మత్స్య సంఘాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ దఫా అలాంటి పరిస్థితులు ఉండకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్‌లు పొందిన కాంట్రాక్టర్‌లు నిర్ణయించిన పరిమాణంలో సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 15 నుంచి చేప పిల్లల విడుదల నిర్ణయం తీసుకోవడంతో ఈ నెలాఖరులోపు అన్ని చేప పిల్లలు వేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేయడం వల్ల మత్స్యకారులు లబ్ధిపొందుతున్నారు. చేప పిల్లల వల్ల అధిక లాభాలు వస్తుండడం, మత్స్యకార కుటుంబాలకు ఉపయోగపడుతుండడంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం జిల్లాలో 5 కోట్ల వరకు ఈ చేప పిల్లల కోసం నిధులు వెచ్చిస్తుంది. జిల్లాలో ఈ చెరువులపై ఆధారపడే 1040 సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల పరిధిలో 42వేల వరకు మత్స్యకార సభ్యులు ఉన్నారు. వీరికి శాఖ తరఫున రాయతీల కింద వాహనాలతో పాటు వలలు, ఇతర వస్తువులను చేపలు పట్టేందుకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని శ్రీరామసాగర్‌తో పాటు ఎంపిక చేసిన రిజర్వాయర్‌, పెద్ద చెరువుల్లో రొయ్యల స్పాన్‌లు కూడా వేసేందుకు నిర్ణయించారు. శ్రీరామసాగర్‌ చేప పిల్లల కేంద్రంలో చేప పిల్లలతో పాటు రొయ్యలస్పాన్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తి చేసేవారితో పాటు కాంట్రాక్టర్‌ల ద్వారా మిగతా చేప పిల్లలను తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. మొత్తం ఈ నెలాఖరులోపు అన్ని చెరువుల్లో వేసేవిధంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లాలో చేప పిల్లల విడుదల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా మత్స్యశాఖ అధికారి నర్సయ్య తెలిపారు. ఆగస్టు 15 నుంచి చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తామన్నారు. వీటితో పాటు కొన్ని ఎంపిక చేసిన చెరువులు, రిజర్వాయర్‌లో రొయ్యలస్పాన్‌ కూడా వేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-08-12T06:22:23+05:30 IST