పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-05-23T04:42:59+05:30 IST

పది పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పేటలో పది పరీక్షల విధులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం

- జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు

- హాజరుకానున్న 8,067 మంది విద్యార్థులు

నారాయణపేట, మే 22 : పది పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగనున్నాయి. దీంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారి లియాఖత్‌ అలీ పర్యవేక్షణలో అధికారులు ముందస్తు చర్యలు  చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 70 ప్రభుత్వ, ఎయి డెడ్‌ పాఠశాలలు, 45 ప్రైవేటు, 11 కేజీబీవీ, ఒక జ్యోతిరావు పూలే, రెండు మోడల్‌ స్కూల్స్‌, రెండు మైనార్టీ పాఠశాలలు, ఆరు సోషల్‌ వెల్ఫేర్‌, ఒకటి ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాల ఉండగా మొత్తం 8,067 రెగ్యూల్‌ విద్యార్థులు పదో తరగతి చదువుకున్నారు. ఇందులో బాలురు 3,844, బాలికలు 4,223 మంది ఉన్నారు. 32 మంది ప్రైవేటు విద్యార్థుల్లో 15 మంది బాలురు, 17 మంది బాలికలు పది పరీక్షలు రాయ నున్నారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 38 మంది సీఎస్‌లు, 38 మంది డీవోలు, 415 మంది ఇన్విజిలేటర్లు, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నారు. పరీక్షల నిర్వహాణకు ప్రతీ పరీక్ష కేంద్రంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, రెండు సిట్టింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి. విద్యార్థులను గంట ముందే కేంద్రంలోకి అనుమతినిచ్చి వారి సమాచారాన్ని ఇన్విజిలేటర్లు నమోదు చేసుకుంటారు. కలెక్టర్‌ హరిచందన పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. సమయానికి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులకు సమావావేశాలు నిర్వహించి ప్రత్యేక శిక్షణతో పాటు జూమ్‌ యాప్‌ ద్వారా అన్నీ విషయాలు వివరించారు. సందేహాల నివృత్తి కోసం విద్యార్థులకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 7893701990 ఏర్పాటు చేశారు. 

మక్తల్‌ : నేటి నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో లక్ష్మీనారాయణ పేర్కొనా రు. ఆదివారం పట్టణంలోని మండల వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 260మంది, బాలికల ఉన్నత పాఠశాలలో 260, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 200, బ్రిల్లియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌ లో 200, అక్షర ఉన్నత పాఠశాలలో 200, కేరళ ఉన్నత పాఠశాలలో 280మంది మొత్తం 1450మంది పది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. 66 మంది ఇన్విజిలెటర్లు, మరో ఏడుగురిని అదనంగా ఉంచు కున్నట్లు తెలిపారు. 

ఊట్కూర్‌ : పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో మండలంలోని నాలుగు సెంటర్లలో హల్‌ టికేట్‌ నెంబర్లు వేయడంతో పాటు నీరు, వైద్యం ఇతర వసతులను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెండు విడుతుల్లో ప్రశ్నా పత్రాలు రాగా వాటిని పోలీస్‌స్టేషన్‌లో  భద్రపరిచారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, ఊట్కూర్‌ బాలికల ఉన్నత పాఠశాల, పులిమామిడి గ్రామ ఉన్నత పాఠశాల, పులిమామిడి కేజీబీవీ పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం బాలురు 229, బాలికలు 347 కలిపి 576 మంది పరీక్షలు రాయనున్నారు. పులిమామిడి పరీక్ష కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌ గురుపాదయ్య, డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌ రఘువీర్‌ నామోజీ, ఊట్కూర్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చీఫ్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయ్‌, డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌ రవికుమార్‌, ఊట్కూర్‌ బాలికల ఉన్నత పాఠశాలకు చీఫ్‌ సూపరింటెండెంట్‌ బాలవీర్‌, డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌ హనీఫ్‌, పులిమామిడి కేజీబీవీ కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌ గోపాలచారి, డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌ రాజగోపాల్‌ వ్యవహరించనున్నారు. మరో 34 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననుండగా, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఎంఈవో వెంకటయ్య తెలిపారు.



Updated Date - 2022-05-23T04:42:59+05:30 IST