సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-08-15T05:40:46+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లాకేంద్రం ముస్తాబైంది. సోమవారం జెండా పండగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

సర్వం సిద్ధం
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

  జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

  జాతీయ జెండాను ఆవిష్కరించనున్న హోం మంత్రి 

  298 మందికి అవార్డులు

 (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లాకేంద్రం ముస్తాబైంది. సోమవారం జెండా పండగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పాడిన తర్వాత తొలిసారిగా వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో చేపడుతున్న పనులను కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు. హోంశాఖ మంత్రి ఎ.వనిత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.  ఇదిలా ఉండగా ఉత్తమ సేవలకు గాను 298 మంది అధికారులు, సిబ్బందికి అవార్డులు అందించనున్నారు. అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించనున్నారు. పార్వతీపురం పట్టణానికి చెందిన పాలూరు సోమమూర్తి, కూర్మాపు నారాయణమూర్తి, గోర్లె సూర్యనారాయణ, గేదెల పైడితల్లి, ఎం.రామ్మూర్తి, పేరూరి సోమిబాబు, బెలగాం లక్ష్మీనారాయణ సాలూరుకు చెందిన కూనిశెట్టి వెంకటనారాయణదొర తదితర స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాల సభ్యులను సన్మానించనున్నారు. విద్య, ఆరోగ్య, వ్యవసాయ, డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌, తదితర శాఖల శకటాలను వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఇందులో మూడింటిని ఎంపిక చేసి బహుమతులు అందించనున్నారు. ఇక విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్‌ శాఖ పరేడ్‌ వంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వేడుకలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున కళాశాల మైదానంలో గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

   

Updated Date - 2022-08-15T05:40:46+05:30 IST