వారంలోగా ఏఆర్‌ఆర్‌ దాఖలు

ABN , First Publish Date - 2020-12-03T08:06:53+05:30 IST

వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌)ను దాఖలు చేయాలని డిస్కమ్‌లు యోచిస్తున్నాయి.

వారంలోగా ఏఆర్‌ఆర్‌ దాఖలు

సిద్ధంగా ఉన్న డిస్కమ్‌లు..

సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌)ను దాఖలు చేయాలని డిస్కమ్‌లు యోచిస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ)కి సంకేతాలు ఇచ్చాయి. 2021-20 ఆర్థిక సంవత్సరానికి ఏఆర్‌ఆర్‌ దాఖలు చేసే గడువు నవంబరు 30తో ముగిసింది. దాంతో మూడేళ్ల(2019-20, 2020-21, 2021-22) ఏఆర్‌ఆర్‌లు పెండింగ్‌లో పడ్డాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తికావడం.. 4న ఫలితాలు కూడా వెలువడనుండటంతో వారం రోజుల్లో ఏఆర్‌ఆర్‌ను సమర్పించే అవకాశాలు లేకపోలేదని డిస్కమ్‌లు సంకేతాలిచ్చాయి.


వాస్తవానికి ఏఆర్‌ఆర్‌ దాఖలుకు మాటిమాటికీ గడువు కోరుతుండటంతో ఇక ఇచ్చేది లేదని, ఏఆర్‌ఆర్‌ దాఖలు చేసినప్పుడే ఎందుకు ఆలస్యమయిందో నివేదించాలని డిస్కిమ్‌లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) ఇదివరకే తేల్చిచెప్పింది. గత మార్చిలోనే  రెండేళ్ల ఏఆర్‌ఆర్‌ దాఖలు చేసి విద్యుత్తు చార్జీలు పెంచడానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు కూడా ఇచ్చారు. దీనికి అనుగుణంగా శాసనసభలో ఆయన ప్రకటన కూడా చేశారు. చెల్లించే వర్గాలపైనే చార్జీల భారం ఉంటుందని సంకేతాలు కూడా ఇచ్చారు. 


అయితే ఏఆర్‌ఆర్‌ దాఖలుకు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా ముప్పు వచ్చిపడింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి రాష్ట్రం కోలుకుంటోంది. అన్నీ ఆర్థిక కార్యకలాపాలు కుదుటపడుతున్నాయి. వాస్తవానికి  ప్రతిసారి ఏఆర్‌ఆర్‌ దాఖలుకు ఎన్నికలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. 

2019-20లో ఏఆర్‌ఆర్‌ దాఖలుకు  2018లో జరిగిన  శాసనసభ ఎన్నికలు అడ్డుపడగా ఆ తర్వాత పార్లమెంట్‌, స్థానిక సంస్థలు ఇలా ఎన్నికలు ప్రతిబంధకంగా మారడంతో వాయిదా వేస్తూ వచ్చారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాటిమాటికీ ఏఆర్‌ఆర్‌ వాయిదా వేయడంపై ఫోరం ఆఫ్‌ రెగ్యులేటరీలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ కూడా తెలంగాణ డిస్కమ్‌ల తీరును నిరసించింది. దాంతో ఇటీవలే డిస్కమ్‌ల అధికారులను తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) పిలిపించినట్లు తెలిసింది. ఎప్పట్లోగా ఏఆర్‌ఆర్‌ దాఖలు చేస్తారని నిలదీయగా, సిద్ధంగానే ఉన్నామని, సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలుపగానే దాఖలు చేస్తామని డిస్కమ్‌ల అధికారులు బదులిచ్చినట్లు సమాచారం. 


Updated Date - 2020-12-03T08:06:53+05:30 IST