Abn logo
Nov 23 2020 @ 00:21AM

87 గంటల్లో... 7 ఖండాలు, 208 దేశాలు!

పక్క ఊరు వెళ్లి రావడానికే బద్ధకిస్తాం! ఆ కాస్త ప్రయాణానికే విసుగు తెచ్చుకుంటాం. అలాంటిది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఓ యువతి కేవలం 87 గంటల్లో ఏకంగా 208 దేశాలను చుట్టబెట్టి గిన్నిస్‌ రికార్డు బద్దలు కొట్టింది. ఆ వినూత్న ప్రయత్నం వెనకున్న కథ తెలుసుకుందాం!


ఆమె పేరు డాక్టర్‌ ఖ్వాలా అల్‌ రొమైతి. స్వదేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో దాదాపు 200 దేశాలకు చెందిన విభిన్న విదేశీయులు ఉండడం ఆమె గమనించింది. అంతమంది విదేశీయులు ప్రపంచం నలుమూలల నుంచి తమ దేశానికి వచ్చినప్పుడు, తానెందుకు వాళ్ల దేశాలన్నీ సందర్శించకూడదు? అని ఆమెకు ఓ ఆలోచన కలిగింది. వాళ్ల దేశాలను సందర్శించి, అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకోవాలనే కోరికతో అన్ని ఏర్పాట్లూ చేసుకుని ప్రపంచ యాత్రకు బయల్దేరింది. ఆమె చివరి గమ్యం ఆస్ట్రేలియాలోని సిడ్నీ. గత ఫిబ్రవరి 13న, కొవిడ్‌ ప్రయాణ నిబంధనలు అమల్లోకి రావడానికి ముందు, ఖ్వాలా ప్రయాణ లక్ష్యం ముగించి ఇక్కడకు చేరుకుంది. అయితే ఆ ప్రయాణంలో తనకెన్నో సవాళ్లూ ఎదురయ్యాయని ఆమె ఇలా చెప్పుకొచ్చింది.... 


వెనక్కి వెళ్లిపోదామనుకున్నాను

‘‘అది ఎన్నో ఇబ్బందులతో కూడిన ప్రయాణం. ఇంత సుదూర్ఘ ప్రయాణానికి ఎంతో ఓర్పు అవసరం. మరీ ముఖ్యంగా వరుస విమాన ప్రయాణాల కోసం ఎయిర్‌పోర్టుల్లో పరుగులు పెట్టడానికి ఓర్పుతో పాటు ఓపిక కూడా అవసరం. చాలా సందర్భాల్లో ఇక చాల్లే! వెనక్కి వెళ్లిపోదామా? అనిపించేది. నిజాయతీగా చెప్పాలంటే కొన్నిసార్లు ప్రయాణం అంతటితో ఆపేసి, ఇంటికెళ్లిపోదాం అనుకునేదాన్ని. అయితే ఆ క్షణంలో నేను ఎంచుకున్న లక్ష్యం గుర్తుకొచ్చేది. శ్రమలు ఉంటాయనీ తెలిసీ, ప్రపంచ పర్యటనకు పూనుకున్నాను. అలాంటప్పుడు గమ్యం చేరుకోకుండా వెనక్కు వెళ్లడం సరికాదు అని అనిపించేది. ఈ ప్రయాణంతో గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించు కోగలిగానంటే ఆ క్రెడిట్‌ మొత్తం నా స్నేహితులు, కుటుంబసభ్యులకే చెందుతుంది. క్లిష్ట సమయాల్లో నన్ను ప్రోత్సహించి, ప్రయాణంలో ముందుకు సాగేలా ప్రోత్సహించారు వారంతా!’’ 


మా దేశం ప్రత్యేకం!

‘‘యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడం మొదలు, అత్యంత పెద్ద హై డిఫినిషన్‌ వీడియో వాల్‌, అత్యంత వేగంగా ప్రయాణించే పోలీసు కారు వరకూ రికార్డులు బద్దలు కొట్టే బోలెడన్ని ప్రత్యేకతలు మా దేశం సొంతం. మిగతా ప్రపంచదేశాల్లాగే మా దేశం కూడా అత్యంత అరుదైన రికార్డు బ్రేకింగ్‌ మైల్‌స్టోన్‌నూ అధిగమించగలదని నా ద్వారా నిరూపించి చూపించాలనుకున్నాను. అందుకే ఇంత తక్కువ సమయంలో ఏడు ఖండాలు, 208 దేశాలు చుట్టి ఆ ఘనతను సాధించగలిగాను.’’


గిన్నిస్‌ రికార్డు

ఈ ఏడాది గిన్నిస్‌ బుక్‌ థీమ్‌ ‘డిస్కవర్‌ యువర్‌ వరల్డ్‌’! ఈ అచీవ్‌మెంట్‌ ప్రకటన కోసం డాక్టర్‌ ఖ్వాలా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ డేను ఎంచుకోవడం మరో విశేషం. తను సాధించిన ఈ విజయం గురించి ప్రస్తావిస్తూ... ‘‘నాకూ, నా దేశానికీ ఈ గిన్నిస్‌ టైటిల్‌ ఎంతో గౌరవప్రదమైనది. నా స్వదేశానికే ఈ టైటిల్‌ను బహూకరిస్తున్నాను. నేను సాధించిన ఈ విజయం ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో స్ఫూర్తిని నింపితే చాలు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న లక్ష్యాలను అందుకోవడం కోసం పాటుపడాలి. ఏదీ అసాధ్యం కాదు.’’ అని స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇస్తోంది డాక్టర్‌ ఖ్వాలా. 

ప్రత్యేకం మరిన్ని...