ఒక్కరోజులో భూమిని చుట్టొస్తా!

ABN , First Publish Date - 2021-02-11T09:43:13+05:30 IST

ఒకరోజు అక్బర్‌ దర్బార్‌ సభికులతో నిండిపోయి ఉంది. విశేషమేమిటంటే ప్రముఖ జోతిష్యుడు ఒకరు దర్బారుకు విచ్చేశారు. అతడు భూమి ఆకృతి, సౌరవ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు

ఒక్కరోజులో భూమిని చుట్టొస్తా!

ఒకరోజు అక్బర్‌ దర్బార్‌ సభికులతో నిండిపోయి ఉంది. విశేషమేమిటంటే ప్రముఖ జోతిష్యుడు ఒకరు దర్బారుకు విచ్చేశారు. అతడు భూమి ఆకృతి, సౌరవ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అక్బర్‌కు ఒక సందేహం వచ్చింది. ‘‘భూమి గుండ్రంగా ఉన్నట్లయితే, ఎవరైనా ఒకే దిశలో ప్రయాణించినట్టయితే తిరిగి ఎక్కడి నుంచి ప్రారంభించారో అక్కడికే చేరుకుంటారు కదా’’ అని అడిగాడు అక్బర్‌. ‘‘సిద్ధాంతపరంగా చూస్తే కరెక్టే’’ అన్నాడు జోతిష్యుడు. ‘‘మరి నిజజీవితంలో ఎందుకు సాధ్యం కాదు’’ అన్నాడు అక్బర్‌ కుతుహులంగా! ‘‘సముద్రాలు, పర్వతాలు, అడవులు దాటాల్సి ఉంటుంది. ఒకే దిశలో ప్రయాణించడం సాధ్యం కాదు’’ అన్నాడు జోతిష్యుడు. ‘‘పడవల ద్వారా సముద్రం దాటొచ్చు. పర్వతాలను తొలిచి సొరంగాలు ఏర్పాటు చేయవచ్చు. ఏనుగుల సహాయంతో అడవులు దాటొచ్చు’’ అని సమాధానం ఇచ్చాడు అక్బర్‌. ‘‘అయినా కూడా సాధ్యం కాదు’’ అన్నాడు జోతిష్యుడు. ‘‘ఎందుకు?’’ అని అడిగాడు అక్బర్‌. ‘‘ఎందుకంటే ప్రయాణం పూర్తి కావడానికి చాలా ఏళ్లు పడుతుంది’’ అన్నాడు జోతిష్యుడు. ‘‘ఎన్ని సంవత్సరాలు పడుతుంది?’’ మళ్లీ అడిగాడు అక్బర్‌. ‘‘ఏమో నాకు తెలియదు’’ అన్నాడు జ్యోతిష్యుడు.


అయితే మంత్రులను అడుగుతాను. ‘‘ఎవరికైనా సమాధానం తెలుసా?’’ అని మంత్రులను ప్రశ్నించాడు. కొందరు పాతికేళ్లు అని, ఇంకొందరు యాభై ఏళ్లు అని చెప్పారు. బీర్బల్‌ మాత్రం మౌనం వహించాడు. అది గమనించిన అక్బర్‌ ‘‘బీర్బల్‌ నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. భూమిని చుట్టి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పు?’’ అన్నాడు అక్బర్‌. అప్పుడు బీర్బల్‌ ‘‘జహాపనా! నేనైతే ఒక్కరోజులో భూమిని చుట్టి వస్తాను’’ అన్నాడు. ‘‘ఒక్కరోజులోనా! అసంభవం! ఒక్కరోజులో నువ్వు మన దేశం కూడా దాటలేవు.’’ అన్నాడు అక్బర్‌. ‘‘సంభవమే జహాపనా! మీరు సూర్యుడి వేగంతో ప్రయాణించే ఏర్పాటు చేస్తే చుట్టి రాగలను’’ అన్నాడు నవ్వుతూ.

Updated Date - 2021-02-11T09:43:13+05:30 IST