20 నుంచి గిరి ప్రదక్షిణ

ABN , First Publish Date - 2021-10-18T05:24:16+05:30 IST

శ్రీశైలంలో ఈ నెల 20న అశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది.

20 నుంచి గిరి ప్రదక్షిణ
శ్రీశైలంలో భక్తుల రద్దీ

  1. పునః ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం


శ్రీశైలం, అక్టోబరు 17: శ్రీశైలంలో ఈ నెల 20న అశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌ కారణంగా ఏప్రిల్‌ నుంచి గిరి ప్రదక్షిణ నిలుపుదల చేశారు. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో, నిబంధనలను పాటిస్తూ గిరి ప్రదక్షిణ పునఃప్రారంభించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ నెల 20న సాయంత్రం స్వామి, అమ్మవార్లకు మహా మంగళహారతి సేవ అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులనుజేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పల్లకిని ఊరేగిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆలయ రాజగోపురం వద్ద ప్రారంభమై గంగాధర మండపము, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు, పుష్కరిణి వద్దకు చేరుకుంటుంది. తిరిగి నందిమండపము మీదుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో కార్యక్రమం ముగుస్తుంది. క్షేత్ర పరిధిలోని ప్రాచీన మఠాలను ప్రాధాన్యాన్ని భక్తులకు తెలిజేసేందుకు, వారిలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 


ధార్మిక కార్యక్రమాలు


దర్మప్రచారంలో భాగంగా దేవస్థానం క్షేత్రపరిధిలో పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ధార్మిక సంస్థలు, భక్తబృందాలు క్షేత్రపరిధిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు దేవస్థానం, రెవెన్యూ, పోలీస్‌ శాఖ అనుమతి తీసుకోవాలని దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్జిత సేవలైన స్వామివారి గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, వృద్ధమల్లికార్జున స్వామివారి అభిషేకం, అంతరాలయంలో అమ్మవారి కుంకు మార్చన, అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, చండీహోమం తదితరాలకు దేవస్థానం వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను పొందాలని దేవస్థానం తెలిపింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. శ్రీశైలదేవస్థానం.ఓఆర్‌జి ద్వారా ఆర్జిత సేవలకు నమోదు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. వివరాలకు దేవస్థానం కాల్‌ సెంటర్‌ నెంబరు 8333901351, 52, 53, 54, 55, 56లను సంప్రదించాలని సూచించారు.


శ్రీగిరిపై భక్తుల రద్దీ


శ్రీశైల క్షేత్రానికి ఆదివారం ఎత్తున భక్తులు తరలివచ్చారు. భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే క్యూ లైన్ల వద్ద బారులు తీరారు. స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ఆర్జిత సేవలలో సైతం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలను జరిపించుకున్నారు. కళ్యాణ కట్ట వద్ధ భక్తులు మల్లయ్య స్వామికి తలనీలాలు సమర్పించి మొక్క తీర్చుకున్నారు. దర్శనం క్యూ లైన్లలో ఆలయ అధికారులు కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తున్నారు. 


పల్లకి సేవ


శ్రీశైలంలో లోక కళ్యాణం కోసం ఆదివారం స్వామి, అమ్మవార్లకు పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా మహా గణపతి పూజ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు చేశారు. పల్లకీలో ఆశీనులనుజేసిన అనంతరం ఉత్సవాన్ని నిర్వహించారు. 

Updated Date - 2021-10-18T05:24:16+05:30 IST