చొరబాట్లకు సిద్ధంగా 400 మంది ఉగ్రవాదులు: ఆర్మీ చీఫ్

ABN , First Publish Date - 2021-01-16T00:59:31+05:30 IST

దేశంలో చొరబడేందుకు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కి ఆవల 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు

చొరబాట్లకు సిద్ధంగా 400 మంది ఉగ్రవాదులు: ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ: దేశంలో చొరబడేందుకు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కి ఆవల 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె పేర్కొన్నారు. ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు ఓ కన్నేసి ఉంచాయన్నారు. ఢిల్లీలో జరిగిన ఆర్మీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్‌వోసీ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమరణ ఒప్పందం దాదాపు 44 శాతం పెరిగిందని నవరణె తెలిపారు.  


జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద గతేడాది 28 నాటికి పాకిస్థాన్ 4,700 ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. గత 17 ఏళ్లలో ఇదే అత్యధికమని వివరించారు. 2019లో 3,168 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని, వీటిలో 1,551 ఒక్క ఆగస్టులోనే జరిగినట్టు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది కూడా అదే నెలలో అని నరవణె వివరించారు. 2018లో 1,629 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడించిందన్నారు. 


దేశంలోకి పేలుడు పదార్థాలు, డ్రోన్లను తరలించేందుకు పాకిస్థాన్ సొరంగాలను ఏర్పాటు చేస్తోందని ఆర్మీ చీఫ్ తెలిపారు. పాక్ చర్యలను మన సైన్యం డేగ కళ్లతో గమనిస్తోందని అన్నారు. చొరబాట్లను అడ్డుకునేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశామని, పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు ఇక ఫలించబోమని స్పష్టం చేశారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో గతేడాది దాదాపు 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పారు. 


ఈశాన్య భారతదేశంలోని పరిస్థితులపై నరవణె స్పందిస్తూ.. గత ఏడాది 600 మంది తీవ్రవాదులు లొంగిపోయినట్టు తెలిపారు. అలాగే, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కౌంటర్ టెర్రరిజం విషయంలో మయన్మార్ ఆర్మీతో కలిసి పనిచేస్తూ గొప్ప విజయం సాధించినట్టు ఆర్మీ చీఫ్ తెలిపారు.  

Updated Date - 2021-01-16T00:59:31+05:30 IST