పంజాబ్‌లో 40 శాతం మరణాలు ఈ 44 రోజుల్లోనే...

ABN , First Publish Date - 2021-05-16T01:42:44+05:30 IST

పంజాబ్‌లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల్లో 40 శాతం కేవలం గడచిన 40 రోజుల్లోనే...

పంజాబ్‌లో 40 శాతం మరణాలు ఈ 44 రోజుల్లోనే...

చండీగఢ్: పంజాబ్‌లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల్లో 40 శాతం కేవలం గడచిన 44 రోజుల్లోనే నమోదయ్యాయంటే... రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఉధృతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి 31 నుంచి ఇప్పటి వరకు పంజాబ్‌లో కరోనా బారిన పడి 6,868 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెల 14 వరకు రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 11,477గా ఉండగా.. కేవలం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 4,609 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రోగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించడంలో జాప్యం కారణంగా ఇంతమంది చనిపోతున్నారని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11న ఒక్కరోజే కరోనా మహమ్మారి కారణంగా 217 మంది మృత్యుఒడికి చేరడం గమనార్హం..


గత కొద్దిరోజులుగా పంజాబ్‌లో రోజూ 100కు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో లూదియానా మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ఇక్కడ 538 మంది మృతి చెందారు. గడచిన 44 రోజుల్లో పంజాబ్‌లో 2,44,250 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. మార్చి 31 నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు 2,39,734  వరకు ఉండగా.. ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు కరోనా కేసుల సంఖ్య ఏకంగా 4,83,984 వరకు ఎగబాకింది. 

Updated Date - 2021-05-16T01:42:44+05:30 IST