అటు ఆరోపణలు.. ఇటు వివాదాలు!

ABN , First Publish Date - 2021-05-13T05:15:55+05:30 IST

జిల్లా కరోనా అధికారిగా జేసీ ప్రభాకరరెడ్డికి ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి.

అటు ఆరోపణలు..  ఇటు వివాదాలు!
జేసీ ప్రభాకర్‌ రెడ్డి

జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీరుపై విమర్శల వెల్లువ

ఉద్యోగ వర్గాల్లో సత్సంబంధాలు కరువు

ప్రజాప్రతినిధులూ అసంతృప్తే!

జిల్లా మంత్రుల ఫిర్యాదుతో బదిలీవేటు 


జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన.ప్రభాకర్‌ రెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ప్రజాప్రతినిధులతో అధికార ఉద్యోగ వర్గాలతో ఈయనకు సత్సంబంధాలు లేకపోవడం, దీనికితోడు అవినీతి ఆరోపణల క్రమంలో ఈయనపై బదిలీవేటు పడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కరోనా కష్టకాలంలో ఈయన వ్యవహారశైలి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ జిల్లా మంత్రులు గౌతమ్‌, అనిల్‌ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఉన్నఫళంగా స్థానచలనం కల్పించినట్టు సమాచారం.


నెల్లూరు, మే 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కరోనా అధికారిగా జేసీ ప్రభాకరరెడ్డికి ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీని అటకెక్కించి రోజుకు రూ.30 వేల బిల్లులు వసూలు చేస్తున్నా, నోడల్‌ ఆపీసర్లు ఆసుపత్రుల వైపు తిరిగి చూడకున్నా, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు బ్లాకులో అమ్ముకొంటున్నా పట్టించుకునే దిక్కేలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొవిడ్‌ అధికారిగా జేసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల బాదుడుకు పరోక్షంగా ఈయన తీరుతెన్నులే కారణమని అధికార పార్టీ నాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కరోనా చికిత్స విషయంలో తమ మాటకు విలువ లేకుండా పోయిందని, అత్యవసరమై ఫోన చేసినా సంబంధిత అధికారి స్పందించడం లేదని జిల్లా మంత్రులు ఇటీవల సీఎంవో కార్యాలయంలో గట్టిగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వెంటనే చర్యలు తీసుకోనిపక్షంలో పార్టీకి చెడ్డపేరు వస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. శాసన సభ్యులు సైతం ఇప్పటికే పలుమార్లు జేసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన క్రమంలో సీఎం కార్యాలయం ప్రభాకరరెడ్డి బదిలీకి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 


అధికారుల్లోనూ అసంతృప్తే!   


మరోవైపు జేసీ ప్రభాకరరెడ్డి తీరుపై ప్రభుత్వ శాఖల అధికారులు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. కింది స్థాయి ఉద్యోగులను చులకనగా మాట్లాడతారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. కొందరు ఉద్యోగ సంఘ నాయకులు కూడా కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీనికితోడు ఇటీవల అంగనవాడీ వర్కర్‌ను తన బంగ్లాలో ఇంటి పనికి వాడుకోవడం, తనను జేసీ భార్య, సీసీలు వేదిస్తున్నారని, కొడుతున్నారని, ఆమె పత్రికల ముందు ఆక్రోశించడం, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై అప్పట్లోనే ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచించినా ఎన్నికల కోడ్‌ రావడంతో ఆగారని, ఇప్పుడు కరోనా విధుల్లో ఆయన పనితీరు పట్ల విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ప్రభాకరరెడ్డిపై బదిలీవేటు పడినట్లు తెలుస్తోంది. 



కొత్త జేసీ గణేష్‌కుమార్‌


వైజాగ్‌ నుంచి జిల్లాకు బదిలీ


నెల్లూరు, మే 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నూతన జాయింట్‌ కలెక్టర్‌ (సచివాలయాలు, అభివృద్ధి)గా జీ గణేష్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన.ప్రభాకర్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఆయన్ను సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేసుకోవలసిందిగా ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. కాగా, గణేష్‌కుమార్‌ ప్రస్తుతం విశాఖపట్నం మెట్రోపాలిటిన రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కార్యదర్శిగా పని చేస్తున్నారు. 2009 గ్రూప్‌-1 బ్యాచకు చెందిన ఈయన గతంలో మదనపల్లె, అమలాపురం ఆర్డీవోతోపాటు పలు విభాగాల్లో విధులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణేష్‌కుమార్‌కు 2019 బ్యాచ కనఫార్మడ్‌ ఐఏఎస్‌గా ఉద్యోగోన్నతి లభించింది. జాయింట్‌ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌ జిల్లాలో లభించింది.

Updated Date - 2021-05-13T05:15:55+05:30 IST